ఉత్తరాయణం

చేటు తెస్తున్న టీవీ సీరియళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీరియళ్లు వచ్చే సమయానికి ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ టీవీలకు అతుక్కుపోతున్నారు. కుట్రలు, కుతంత్రాలు, పగ, ద్వేషాలు, భార్యభర్తల, అత్తాకోడళ్ల గొడవలు నేపథ్యంగా సీరియళ్లు ప్రసారమవుతూ పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి. ఇవి చూసి ఇంట్లో గొడవలు, అనుమానాలు, అఘాయిత్యాలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వీటిని చూడడం వల్ల మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతోంది. మహిళలు, విద్యార్థులు సీరియళ్లకు బానిసలుగా మారి మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారు. సాయంత్రం వేళ తీరుబడిగా కుటుంబ సభ్యులందరూ, పక్కింటి వారితో మంచీ చెడూ మాట్లాడుకోకుండా సీరియల్స్ ఆటంకం కలిగిస్తున్నాయి. అర్ధరాత్రి వరకూ వీటితోనే కాలక్షేపం చేస్తున్న ఎంతోమంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రోజూ చూసే సీరియల్స్ వచ్చే సమయానికి కరెంటు పోతే తట్టుకోలేకపోతున్నారు. నైతిక బంధాలను, కుటుంబ బాంధవ్యాలను పెంచే అంశాలు లేని సీరియళ్లను జనం బహిష్కరించాలి.
- కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట

చాటింగ్‌తో మమేకం
ఈరోజుల్లో కాలేజీ కుర్రకారుకు ల్యాప్‌టాప్ తప్పనిసరి. టీనేజీ అమ్మాయికి స్మార్ట్ఫోన్ సరేసరి. యువ ఉద్యోగికి కంప్యూటర్‌తోనే పని. ఇవి చాలు యువత ‘చాటింగ్ సాలెగూడు’లో చిక్కుకోవడానికి. ఒక్క బటన్‌తో కోరింది చూసేలా అందుబాటులో అంతర్జాలం. వంద రూపాయలకే వందలకొద్దీ ఎస్సెమ్మెస్‌లంటూ ఆఫర్లు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అశ్లీల వెబ్‌సైట్లు. ఎలాంటి పరిచయం లేని వాళ్లతో ఫేస్‌బుక్‌లో రోజంతా కబుర్లు.. ట్విట్టర్‌లో చేరి గంటల తరబడి చాటింగ్.. వంచిన తల ఎత్తకుండా సెల్‌ఫోన్‌లో మాటల ప్రవాహం.. యుక్తవయసులో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఆకర్షణ ఈ పనులన్నీ చేయిస్తుంది. నలుగురిలో మాట పెగలని భయస్తులు సైతం సోషల్ మీడియాలో నిర్భయంగా ఇతరులతో భావాలు పంచుకుంటారు. వేసుకున్న డ్రస్సు నుండి చూసిన సినిమా వరకు ఏదైనా ముచ్చటకు ముడి సరుకవుతుంది. సిగ్గూ బిడియాలు గుర్తుకురావు. అసభ్యత, అశ్లీలమూ ఇష్టమైపోతాయి. ఎక్కడున్నా చాటింగ్ యావే. చదువు, కెరీర్‌ను నిర్లక్ష్యం చేసేవారే వీటి మోజులో పడి కాలాన్ని, ధనాన్ని నష్టపోతున్నారు.
- వి.బాలకేశవులు, గిద్దలూరు

ఆటోల జోరు.. జనం బేజారు
పట్టణాల నుండి పల్లెటూళ్ళలోకి ఆటోల జోరు ఎక్కువైంది. నిబంధనలు పాటించని ఈ ఆటోల కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో పరిమితికి మించి వీటిలో ప్రయాణికులను ఎక్కిస్తుంటారు. మితిమీరిన వేగం వల్ల రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. కొందరు ఆటోడ్రైవర్లు ముందు సీటులో అటూ,ఇటూ ప్రయాణికులను కూర్చోబెట్టడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, భారీ సౌండ్‌తో పాటలు పెట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. రవాణాశాఖ అధికారులు, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడం సబబు కాదు. ఆటోడ్రైవర్ల అత్యాశ ప్రజల ప్రాణాలతో చెలగాటమేగాక ఆర్టీసీకి భారీ నష్టం తెస్తోంది. కొన్ని పల్లెలకు వెళ్ళాల్సిన ఆర్టీసీ బస్సులు ఆటోల మూలంగా కలెక్షన్లు లేక రద్దవుతున్నాయి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం