ఉత్తరాయణం

విద్యావ్యవస్థ మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్య అనేది వ్యక్తి అభ్యున్నతికి సోపానం. విద్యార్థులు, యువకులపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది. విద్యార్థులకు పాఠశాల నిజంగా గుడి లాంటిది, ఉపాధ్యాయులే దేవుళ్లు. అయితే, బడిలాంటి గుడులు ఇపుడు శిథిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉన్నాయి. కొన్ని ఊళ్లల్లో అయితే ఆరుబయటే విద్యాబోధన గావిస్తున్నారు. కొన్ని పాఠశాలలు ఒకే గదిలో ఒకటినుండి ఐదో తరగతి వరకు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి. విద్యావ్యవస్థలో లొసుగులు, లోటుపాట్లను తొలగించడానికి అనేక కమిటీలు, కమిషన్లు ఏర్పడి సిఫార్సులు చేసినా ప్రభుత్వాల తీరు మారడం లేదు. విద్యాశాఖ పనితీరుపై ప్రభుత్వానికి కచ్చితమైన పర్యవేక్షణ ఉండాలి. అవసరమైన ఆదేశాలను ఎప్పటికప్పుడు జారీచేస్తూ వాటిని కచ్చితంగా అమలు జరపాలి. అదే సమయంలో వౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉపాధ్యాయులు పాఠశాలలకు దగ్గరలో నివాసం ఉండేలా చూడాలి. కొందరు టీచర్లు మండల కేంద్రాల్లో, సొంత ఇళ్లలో ఉంటూ బడికి రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి టీచర్లపై చర్యలు తీసుకోవాలి. టీచర్లు కూడా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి. అలా చేయనివారిపై చర్యలు తీసుకోవాలి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు

ఇంటర్నెట్ లేకుంటే ఎలా?
ఈ- గవర్నెన్సు, నగదు రహిత పాలన అని పెద్దపెద్ద ఆశయాలతో ప్రచారం చేస్తోంది ఎపి ప్రభుత్వం. కానీ, వాస్తవ పరిస్థతిచూస్తే చాలా నిరాశాజనకంగా వుంది. ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలు ఉన్నా వాటిలో కొత్త టెక్నాలజీ కనిపించడం లేదు. ముఖ్యంగా చాలా అనుబంధ కళాశాలలో ఇప్పటికీ ఇంటర్‌నెట్ సదుపాయమే లేదు. విద్యార్థులకు ఇంటర్‌నెట్ సౌకర్యం కాలేజీ లైబ్రరీలో వుండాలి. ఒకవేళ ‘నెట్’ సౌకర్యం ఉన్నా అది ప్రిన్సిపాల్ లేదా కళాశాల యాజమాన్య ప్రతినిధుల గదుల్లోనే ఉంటాయి. విద్యార్థులకు చేరువలో లేకుంటే ఇంటర్నెట్ గురించి, డిజిటల్ టెక్నాలజీ గురించి ఎలా తెలుస్తుంది? దీన్నిగూర్చి విద్యార్థులు ప్రశ్నిస్తే ప్రిన్సిపాల్ లేదా యాజమాన్య వారి కోపానికి గురికావల్సి వస్తున్న సందర్భాలు అనేకం. ‘కాళ్ళు బురదలో, తలలేమో ఆకాశంలో’ అన్నట్లు ఉన్న ఈ వ్యవస్థలో లోపాలను ఎవరు సరిదిద్దుతారు?
- డి.సత్యవతి, కొమ్మర

దత్తతతో గ్రామాల ప్రగతి
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడచినా ఇప్పటికీ అనేక మారుమూల గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. తాగునీరు, రోడ్లు, మరుగుదొడ్లు వంటి సమస్యలు ఉన్నాయి. నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు, అనారోగ్యాలు వంటి సమస్యలతో గిరిజనులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. పల్లెసీమల ప్రగతికి బడ్జెట్‌లో నిధులు కేటాయస్తున్నా ఎలాంటి ఫలితం లేదు. వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అధికారులు అభివృద్ధి చేయాలి. ధనవంతులు, నాయకులు, సెలబ్రిటీలు వీటిని ప్రగతిపథంలో నడిపించాలి. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు చేసి విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలి.
- ఎస్. శ్రీనివాసరాజు, వనస్థలిపురం