ఉత్తరాయణం

‘అమెజాన్’కు బుద్ధి చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన త్రివర్ణ పతాకాన్ని, హిందూ దేవతలను అవమానించే రీతిలో అమెరికన్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ డోర్‌మ్యాట్‌లు, టీషర్టులు, బెర్ముడాలు, మద్యం గ్లాసులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్టు వస్తున్న వార్తలపై భారత ప్రభుత్వం గట్టిగా స్పందించాలి. భారత్‌లోనే ఆన్‌లైన్ అమ్మకాలు ఎక్కువగా జరుపుతున్న అమెజాన్ సంస్థ మన జాతీయత, హైందవ సంస్కృతీ సంప్రదాయాలను దారుణంగా అవమానించే రీతిలో ప్రవర్తిస్తున్నందుకు ఆ సంస్థను తక్షణం నిషేధించాలి. దేశంలో నుంచి అమెజాన్ సంస్థ ప్రతినిధులను వెళ్లగొట్టాలి. గతంలో ఒక మతాన్ని కించపరిచేలా వ్యవహరించినందుకు అనేక దేశాలు కలిసికట్టుగా ఆ సంస్థను బహిష్కరించగా, ఇకపై ఇలాంటి పిచ్చివేషాలు వేయనని అమెజాన్ సంస్థ క్షమార్పణలు చెప్పింది. మన దేశం, ప్రత్యేకించి హిందువులంతా సమైక్యంగా ఆ సంస్థకు గుణపాఠం చెప్పాలి. అలా చేసినపుడే ఏ విదేశీ సంస్థ కూడా ఇలాంటి పిచ్చిపనులు చేయడానికి సాహసించదు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

నినాదాలకే పరిమితం
ఆర్టీసీ బస్సుల్లో- ‘స్ర్తిలకు కేటాయించిన సీట్లలో స్ర్తిలనే కూర్చోనిద్దాం, మహిళలను గౌరవించడం మన సంప్రదాయం’ అంటూ రాసిన నినాదాలు ఆచరణలో కానరావడం లేదు. బస్సు ఆగడమే ఆలస్యం.. ముందు సీట్లు, కిటికీ పక్క సీట్లే లక్ష్యంగా మహిళల సీట్లనూ పురుషులే ఆక్రమిస్తున్నారు. ఎంతోమంది మహిళలు సీటు దొరక్క నిలబడి ప్రయాణిస్తున్నారు. పురుషులతో గొడవ పడలేక స్ర్తిలు వౌనం వహిస్తున్నారు. స్ర్తిలకు కేటాయించిన సీట్లను ఖాళీ చేయించడంలో చాలామంది కండక్టర్లు కూడా ఆసక్తి చూపడం లేదు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, పసిపిల్లల తల్లులూ ఉంటున్నారు. ఆర్టీసీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి, మహిళల సీట్లలో కూర్చున్నవారికి జరిమానాలు విధించాలి. పురుషులు కూడా గొడవలకు దిగకుండా మహిళలను గౌరవించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

ఆహార భద్రత అవసరం
పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని అందరికీ ఆహార భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందజేసి, సాగునీటి సౌకర్యాలను మెరుగు పరచాలి. నూతన విధానాలతో పంటల ఉత్పత్తులు పెంచాలి. అనేక కారణాలతో ఏటా పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. భవిష్యత్తులో ఇదే కొనసాగితే కరవుకాటకాలు ఏర్పడే ప్రమాదం ఉంది. సాగు విస్తీర్ణం తగ్గిపోవటానికి ప్రధాన కారణం- భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చడం. రైతులకు సౌకర్యాలు పెంచి, తగిన గిట్టుబాటు ధరను ప్రకటిస్తే వ్యవసాయ రంగానికి మంచి రోజులు వస్తాయి. ఆహార ధాన్యాలపై దృష్టి సారించేలా రైతులను ప్రోత్సహించాలి. పండ్లతోటలు, కూరగాయలు, ఆకుకూరలు పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలి.
- అయినం రఘురామారావు, ఖమ్మం