ఉత్తరాయణం

ఓటుబ్యాంకు రాజకీయాలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మతం పేరిట రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఉన్నత న్యాయస్థానాలు ఇదివరకే తప్పుపట్టాయి. మతప్రాతిపదికపై మైనారిటీలంటూ కొందరికి విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా మన నేతల ధోరణి మారడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మైనారిటీల ఓట్ల కోసమే ఇపుడు ‘రిజర్వేషన్ల జపం’ చేస్తున్నారు. మైనారిటీ వర్గాల్లో పేదలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవచ్చు. కానీ, రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడం సమర్ధనీయం కాదు. మైనారిటీ, ఎస్‌సి, ఎస్‌టి, బీసీలకు ప్రత్యేక గురుకులాలంటూ ప్రభుత్వమే ప్రజలను శాశ్వతంగా విడదీస్తోంది. ఈ విధానాలు జాతీయ సమైక్యతకు విఘాతం కలిగిస్తాయి. కుల,మత వాదాలకు బీజం పడుతుంది. అన్ని వర్గాల వారినీ కలిపేలా విద్యావ్యవస్థలో మార్పులు చేయాలే తప్ప కుల,మతాల పేరిట విభజన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మేధావులు, విద్యావేత్తలు ఉద్యమిస్తే తప్ప దేశ సమగ్రత సాధ్యం కాదు. అవకాశవాద, ఓటుబ్యాంకు రాజకీయాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. సమైక్యత, సమభావన కొరవడితే భారత జాతి మున్ముందు ప్రమాదంలో పడుతుంది.
- సామల కిరణ్, జూలపల్లి (పెద్దపల్లి జిల్లా)

పరీక్షల వేళ ‘కోత’లా?
పదో తరగతి, ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్నందున ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్థులు ఇంటిపట్టునే ఉంటూ చదువుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో పల్లెప్రాంతాల విద్యార్థులకు కరంటు కోత శాపంగా మారుతోంది. రాత్రివేళ, తెల్లవారు జామున చదువుకునే విద్యార్థులకు వెసులుబాటు కలిగేలా విద్యుత్ సరఫరా నిరాటంకంగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. చాలా గ్రామాల్లో స మయం, సందర్భం లేకుండా విద్యుత్ సరఫరాలో ఎంతోకొంత కోత విధిస్తున్నారు. పట్టణాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి పూట విద్యుత్ కోత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. పల్లెప్రాంతాల్లో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం పెంచాలంటే విద్యుత్ సరఫరా సజావుగా జరగాలి.
- జి.అశోక్, గోదూర్ (జగిత్యాల జిల్లా)

ఉసూరుమన్పించిన బడ్జెట్
రైల్వే పద్దులతో కలిపి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొత్తగా ఒరిగిందేమీ లేదు. విశాఖకు రైల్వేజోన్, కాకినాడ-పిఠాపురం, కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్లకు ఈసారి కూడా మోక్షం లేదు. విశాఖ నుంచి తిరుపతి, హైదరాబాద్‌లకు రద్దీ పెరుగుతున్నా అదనపు రైళ్ల ప్రస్తావనే లేదు. ఆదాయపు పన్ను పరిమితిని ఐదు లక్షల రూపాయలకు పెంచుతామన్న హామీని కేంద్ర నేతలు మరచిపోయారు. ఫలితంగా నాలుగో తరగతి వేతనజీవులు సైతం ఆదాయపు పన్ను చెల్లించక తప్పదు. పెట్రో ఉత్పత్తులపై సెస్‌ను రద్దు చేస్తే ఎంతోమందికి మేలు జరిగేది. పంటలకు మద్దతు ధరలు పెంచకుండా దీన్ని ‘రైతు బడ్జెట్’ అని ఎలా అంటారు? గర్భిణులకు వైద్యసహాయం తప్ప బడ్జెట్‌లో కొత్తగా ప్రకటించిన వరాలేవీ లేవు. కాంగ్రెస్ నేతల వలే నేడు బిజెపి వారు కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరచిపోతున్నారు. అన్ని పార్టీలూ ఒకే తానులో ముక్కలని తేలిపోయింది.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం