ఉత్తరాయణం

ట్రంప్ విధానాలే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో ఒక జాత్యహంకార ఉన్మాది చేతిలో తెలుగు యువకుడు శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడం. మరో యువకుడు గాయపడడం విచారకరం. ఎలాంటి ఘర్షణ లేకుండానే ఆ ఉన్మాది కాల్పులకు తెగబడడం అమెరికా విడిచిపొమ్మంటూ కూతలు కూయడం కేవలం వివక్షాభావం వల్లనే. విదేశీయులపై వివక్షాపూరిత దాడులు అమెరికాలో ఒక్కసారిగా పెరగడానికి కారణం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విధానాలే కారణం. తన రాజకీయ అవసరాల కోసం ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వివక్ష అనే విషబీజాలు నాటాడు. గద్దెనెక్కగానే ట్రంప్ తన బాధ్యతను గుర్తించి, అమెరికా ఉన్నతికి తోడ్పడుతున్న వివిధ దేశాలకు చెందిన పౌరుల మీద విషం చిమ్మడం ఆపేస్తే బాగుండేది. వివక్షకు అధ్యక్షుడి అధికార ముద్ర తోడవ్వడంతో ఉన్మాదులకు లైసెన్సు దొరికింది. ఫలితంగా జాత్యహంకార దుర్ఘటనలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇక అమెరికా సమాజమే మేల్కొనాలి. ఈ దుర్ఘటనలోనే తన ప్రాణాన్ని పణంగా పెట్టి, దుండగుణ్ణి నిలువరించిన సాటి శే్వతజాతీయుడే స్ఫూర్తి. అలాంటి మానవతామూర్తులు సంఘటితం కావాలి.
- డా.డివిజి శంకరరావు, పార్వతీపురం

మరీ ఇంత ఆలస్యమా?
పెద్దనోట్ల రద్దుపై రభస సద్దుమణిగి చాలారోజులైంది. ఇప్పుడు బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద ఎలాంటి రద్దీ లేదు. అంతటా సాధారణ పరిస్థితి నెలకొన్నాక- పెద్దనోట్ల రద్దుపై వ్యితిరేక ప్రచార కమిటీలను నియమించి జిల్లాల వారీగా ఆరిపోయిన మంటను తిరిగి రగిలించడానికి ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రయత్నించడం విడ్డూరం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలా కాంగ్రెస్ వ్యవహారం కామెడీగా ఉంది. ఈ వ్యవహారం మీడియా లో ఓ రెండు మూడు రోజులు ప్రచారం పొంది కాంగ్రెస్ ఇంకా బతికే ఉందని చెప్పుకోడానికి పనికొస్తుంది. నోట్లరద్దుపై ఇంత ఆలస్యంగా ఆందోళనలు చేయడం శుద్ధదండగ.
- చంద్ర, కాకినాడ

డిఎ ప్రకటించండి
కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు, పెన్షనర్లకు జూలై 2016 నుండి కరువుభత్యం పెంపును ప్రకటించింది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు 2,3 నెలల తరువాత తమ ఉద్యోగులకు, పెన్షనర్లకు డిఎ పెంచుతూ ఉత్తర్వులిచ్చేవారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి (దాదాపు 3 నెలలైనా) ఎటువంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. నిత్యావసర సరకుల ధరలు అందుబాటులో ఉండడం లేదు. ఉద్యోగులకు, పెన్షనర్లకు తక్షణం తెలంగాణ ప్రభుత్వం డి.ఎ. మంజూరు చేయాలి.
- కెహెచ్ శివాజీరావు, హైదరాబాద్

విద్యార్థీ.. మేలుకో!
ఓ విద్యార్థీ.. రానున్నది పరీక్షల కాలం
వృథా చేయరాదు విలువైన సమయం
తిరిగిరానిది ప్రతి క్షణం
దాని విలువ గుర్తెరగాలి తక్షణం
ప్రణాళికాబద్ధంగా చదువుకో
అత్యుత్తమ గ్రేడులు తెచ్చుకో
అత్యున్నత లక్ష్యాలను ఏర్పరచుకో
వినయం, సౌశీల్యం, సత్ప్రవర్తనలు
విలువైన ఆభరణములు
ఆ ఆభరణములను నిలుపుకో
నీ తల్లిదండ్రుల మర్యాదను కాపాడుకో
మొబైల్, కంప్యూటర్, టీవీ, చెడు స్నేహాలు,
లేనిపోని వ్యసనాలను దరికి రానీయకు
నిరంతర శ్రమను నమ్ముకో
నీ రాతను రాసుకునేది నీవే
ఆ రాతను చక్కదిద్దుకో
బంగరు భవితను ఏర్పరచుకో
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం