ఉత్తరాయణం

విశాఖ ఎయిర్‌పోర్టుకు ‘సింహాద్రి’ పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ విమానాశ్రయానికి సింహాద్రి అప్పన్న పేరు పెడితే ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో సంతోషిస్తారు. గన్నవరం (విజయవాడ) ఎయిర్‌పోర్టుకు ‘ఎన్టీఆర్ అమరావతి విమానాశ్రయం’ అని, తిరుపతి ఎయిర్‌పోర్టుకు ‘శ్రీవేంకటేశ్వర విమానాశ్రయం’ అని పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం తాజాగా తీర్మానించింది. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టు ప్రస్తావన రాకపోవడం విచారకరం. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన సింహాచలం అప్పన్న పేరును ఎయిర్‌పోర్టుకు పెట్టడం సముచితం. ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఉత్తరాంధ్రకి చెందినవారు, పైగా ఆయన సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త కూడా. వచ్చే మంత్రివర్గ సమావేశంలోనైనా ఈ మేరకు తీర్మానం చేయాలి.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు

పుస్తకరూపంలో ఆలయాల చరిత్రలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల చరిత్రలను, స్థలపురాణాలను వివరించే పుస్తకాలు ఆయా దేవస్థానాల వద్ద అందుబాటులో ఉండడం లేదు. పుస్తక రూపంలో వున్న ఆలయ చరిత్రల ద్వారా ఆలయ వాస్తు, నిర్మాణ విశేషాలు, పురాతన చరిత్ర, ఆ కాలం నాటి రాచరిక వ్యవస్థ, శాసనాల విశేషాలు, ఆలయానికి రాజులు చేసిన దానధర్నాలు వంటివి తెలుస్తాయి. తద్వారా మన ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పూర్వీకుల ఘన చరిత్రలు తెలుసుకునే వీలు కలుగుతుంది. ఆలయాలను దర్శించుకునేవారికి విషయ పరిజ్ఞానం పెరగడమే కాకుండా దైవచింతన, ఆలయ దర్శనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధీనంలో వున్న అన్ని దేవాలయాలలో ఆయా గుడుల స్థల పురాణాలను, చరిత్రలను సమగ్రంగా ముద్రించి విక్రయానికి ఏర్పాట్లు చేయాలి.
-కప్పగంతు వెంకటరమణ మూర్తి, సికింద్రాబాద్

భ్రూణహత్యలు ఆపాలి
ఆడపిల్ల పుడుతుందని తెలుసుకుని తల్లిగర్భంలోనే హత్య చేస్తున్నారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపించే తల్లిదండ్రులను, బంధువులను కఠినంగా శిక్షించాలి. ఆడపిల్లలకు చదువు చెప్పించకుండా బాల్యవివాహాలు చేయటం ఇంకా కొనసాగుతోంది. ఒక బాలిక ఇచ్చిన సమాచారం మేరకు ఒక గ్రామంలో 15 బాల్య వివాహాలను నిలిపివేశారు. ఆడపిల్ల విషయంలో చదువుకున్నవారు సైతం వివక్ష చూపుతున్నారు. గతంలో భ్రూణహత్యలు కొంతమేర తగ్గినా మళ్ళీ విజృంభిస్తున్నాయి. పలురకాల వివక్షలకు మహిళలు గురవుతున్నారు.
- ఎ.ఆర్.ఆర్.ఆర్.గౌడ్, ఖమ్మం

అమరావతి బడ్జెట్.. అంకెల గారడీ
అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ సమావేశాల్లో- ఆర్థిక లోటు, అప్పులు, అననుకూల పరిస్థితుల నడుమ స్థూల ఉత్పత్తి, జాతీయోత్పత్తిని మించి రెండకెల్లో వుందని ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం గనుక సాయం చేస్తే, మరింత అభివృద్ధిని చూపిస్తామని సన్నాయినొక్కులు నొక్కడం అంతర్లీనంగా రాష్ట్రానికి వున్న ఆంక్షల్ని, పరిమితుల్ని చూపిస్తుంది. అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా, రాష్ట్రాన్ని అభివృద్ధి కేంద్రంగా మలుస్తామనడంలో దీర్ఘకాలిక ఆకాంక్షల భారం కనబడుతోంది. ఆకాంక్షలు, ఆంక్షలు నడుమ అగాధం మాత్రం ఎక్కువగానే ఉంది. వార్షిక ప్రణాళికలు, నిధుల సమీకరణల గూర్చి అస్పష్టమైన వైఖరి సహా లోటు ఎలా పూరించడమన్న దాంట్లో ప్రస్తుతానికి అయోమయమే. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. జనాభాలో 7 శాతం ఉన్న గిరిజనులకు సంక్షేమ నిధులు బడ్జెట్‌లో 2 శాతం మాత్రమే. ఆరోగ్య రంగానికి కేటాయింపులు తక్కువ. నిరుద్యోగ భృతి మంచి ఆలోచనే అయినా విధి విధానాలలో స్పష్టత రావాల్సి వుంది. మానవ వనరుల అభివృద్ధి సూచీల్లో అట్టడుగున రాష్ట్రం వున్న దృష్ట్యా విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్‌మెంట్, ఆహార భద్రతకి పెద్దపీట వేయాల్సింది. ఆ దశగా ప్రయత్నం జరగలేదు. వెరసి అమరావతిలో తొలి బడ్జెట్ అతి మామూలు అంకెల పద్దుగా మాత్రమే మిగిలిపోయింది.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం