ఉత్తరాయణం

చేనేతపై పన్నుభారం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో వ్యవసాయం తర్వాత చేనేతను జీవనోపాధిగా చేసుకున్నవారు అధికం. మరమగ్గాలపై తయరయ్యే వస్త్రాలు తక్కువ ధరకు లభించడం, కుటుంబమంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా పూట గడవడం గగనమవుతుండడంతో నేటి యువత ఇతర మార్గాల వైపు చూడడం, వారంలో ఒక్కరోజైనా ఖద్దరు దుస్తులు ధరించాలన్న నిబంధనను పాలకులే ఆచరించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో బడ్జెట్‌లో చేనేత రంగానికి విదిల్చేది ఎంగిలి మెతుకులే! కులవృత్తిని వదలలేక ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని గంపెడాశతో ఇంకా కొద్దిమంది మగ్గాలను నమ్ముకున్నారు. విదేశాల్లో మన చేనేత వస్త్రాలకు మంచి గిరాకీ ఉంది. ప్రోత్సహిస్తే విదేశీ మారక ద్రవ్యం పెంచుకోవచ్చని నేతలు గమనించడం లేదు. ఈ పరిస్థితుల్లో జిఎస్‌టిని చిలుప నూలుపై విధించడం మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టుంది. ఈ పన్ను విధిస్తే ఒక్కో కార్మికుడు వేలాది రూపాయలు చెల్లించాల్సిన దుస్థితి తప్పదు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు చేనేతపై ఆదాయం పెంచుకోవాలనుకోవడం శవాలపై చిల్లర ఏరుకోవడమే! నేతన్నలు వారి వృత్తిని కొనసాగించేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తే నిరుద్యోగ సమస్యతో పాటు విదేశీ మారక ద్రవ్యం పెంచుకోవచ్చు.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
రజనీపై రాద్ధాంతం ఎందుకు?
సినీనటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడన్న వార్తలతో అతను తమిళుడు కాడు, కన్నడిగుడు అని తమిళ సంఘాలు ఉద్యమించడం సబబు కాదు. ఎన్నో ఏళ్లుగా తమిళనాట నివసిస్తున్నా, రాజకీయ ప్రవేశం చేస్తున్నాడన్న నెపంతో రజనీపై బురద చల్లడం మంచిది కాదు. ఈ విషయం అతను సినిమాల్లో నటిస్తున్నప్పుడు గుర్తుకురాలేదా? గతంలో రాధిక సహా పలువురు నటీనటులు రజనీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జయలలిత ఎక్కడినుంచి వచ్చారో, సిఎం ఎలా అయ్యారో వారికి తెలియదా? జయ మేనకోడలు దీప సినిమా రంగానికి రజనీ ఏమి చేసారో చెప్పమంటున్నారు. తన సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే డబ్బులు ఇవ్వడం రజనీతో మొదలైంది. ఇలాంటి స్పూర్తిని అందరిలో కలిగించాడు. ఎందరో సహచరులకు చేదోడువాదోడుగా ఉన్న రజనీపై రాద్ధాంతం తగదు.
-అయినం రఘురామారావు, ఖమ్మం
ప్లాస్టిక్ బియ్యం నిజమేనా?
ప్లాస్టిక్ బియ్యం ఇపుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్ని కుదిపివేస్తున్నది. ప్లాస్టిక్ బియ్యం కేవలం భ్రమ తప్ప వాస్తవం కాదని నిపుణులు చెబుతున్నారు. చెత్తను ప్లాస్టిక్ మిషన్‌లో వేస్తే బియ్యం వస్తున్న వీడియో వాట్సప్‌లో హల్‌చల్ చేస్తోంది. అవి ప్లాస్టిక్ తునకలు తప్ప బియ్యం కాదని, ఇవి బియ్యం కన్నా ఖరీదు ఎక్కువ, బియ్యం కంటే చాలా తక్కువ బరువు కాబట్టి కల్తీ చేస్తే వ్యాపారి నష్టపోతాడని అంటున్నారు. అన్నాన్ని గట్టిగా పిసికి ఉండగా చేస్తే దానిలోని జిగురు ఎండిన తర్వాత ఆ ఉండ బంతిలాగ ఎగురుతుందని, ప్లాస్టిక్ వల్ల కాదని అంటున్నారు తెలిసినవారు. ప్లాస్టిక్ బియ్యం గురించి భయాలను తొలగించాలి.
-సాహిత్యదీప్తి, రమణయ్యపేట