ఉత్తరాయణం

ఫెర్టిలిటీ కేంద్రాల దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాంధ్రలో అక్రమ స్కానింగ్ సెంటర్లు, అబార్షన్ క్లినిక్‌లు, సరోగసీ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉంది. పుట్టబోయేది ఆడపిల్ల అని స్కానింగ్‌లో గుర్తిస్తే వెయ్యి రూపాయలకే అబార్షన్ చేసేస్తున్నారు. పిల్లలు పుట్టనివారిని ఫెర్టిలిటీ క్లినిక్‌లు ‘సరగోసి’ పేరిట వలలో వేసుకుని లక్షలాది రూపాయలు గుంజేస్తున్నాయి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా ఈ క్లినిక్‌లు నడుస్తుండడం, నకిలీ డిగ్రీలతో కొందరు డాక్టర్లుగా చెలామణి అవుతుండడం జగమెరిగిన సత్యం. పేద మహిళలను ఉపయోగించుకుంటూ సరోగసి పేరిట కొందరు భారీగా ఆర్జిస్తున్నారు. మరోవైపు నకిలీ మందుల బెడద పెరిగిందని వస్తున్న వార్తల పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు భయభ్రాంతులవుతున్నారు.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం
సెన్సార్ బోర్డు ఎక్కడ?
వయో భేదం లేకుండా నేడు బాలికలు, యువతులు ఈవ్ టీజింగ్‌కు, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. సహచర విద్యార్థులే విద్యార్థినుల పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ పేరుతో వేధింపులు, భౌతిక దాడులతో యువతులు బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతోంది. పరిస్థితులు ఇలా వున్నా ఎక్కడెక్కడో విద్యా సంస్థలకు ఎన్నో ఇబ్బందులు పడుతూ బాలికలు, యువతులు వెళ్లాల్సి వస్తోంది. సినిమాల ప్రభావంతో పోకిరీ కుర్రాళ్లు యువతుల వెంట పడి అసభ్య పదజాలంతో దూషించడం, ప్రేమించమని వేధించడం, తిరస్కరిస్తే అఘాయిత్యాలకు పాల్పడడం చూస్తున్నాం. మహిళలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు ‘నిర్భయ’ చట్టం వచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఇవేవీ పట్టించుకోకుండా ఫిలిం సెన్సారు బోర్డు చెత్త సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. సెన్సారు బోర్డు సభ్యులు బాధ్యతగా విధులు నిర్వహిస్తే సినిమాల తీరు కొంతవరకైనా మారుతుంది.
-గర్నెపూడి వెంకటరత్నాకర్‌రావు, హన్మకొండ
పది రూపాయల నాణెంపై అపోహలు
కొన్ని జిల్లాలలో వ్యాపారులు, చిన్న చిన్న దుకాణాలు, రైతు బజారులు ఇతరత్రా సంస్థలలో పది రూపాయల నాణేలను తీసుకోని పరిస్థితి ఏర్పడింది. అధికారులు బ్యాంకర్లు పది రూపాయలను తీసుకోవలసిందిగా ప్రకటనలు చేస్తూన్నారు. కొందరు తీసుకోవటంలేదు. పది రూపాయల నాణేలను తీసుకోలేనివారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాత ఐదు వందలు, వెయ్యి రూపాయలు రద్దుచేసినపుడు డబ్బుల కొరత ఏర్పడినపుడు పదిరూపాయల నాణేలను బ్యాంకువారు వినియోగదారులకు అందజేశారు. వాటిని వాడుకలో వినియోగిద్దామనుకుంటున్న తరుణంలో పది రూపాయలపై ఎవరో చేసిన దుష్ప్రచారం వల్ల ఎవరూ తీసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. పది రూపాయల నాణేలను వినియోగించుకునే విధంగా బ్యాంకు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలి. గతంలో ఐదు రూపాయల నోటు విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని జిల్లాలలో ఆ నోటు కనిపించకుండా పోయిన స్థితి ఉంది. దుష్ప్రచారం చేసే వారి మాటలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-అయినం రఘురామాగౌడ్, ఖమ్మం