ఉత్తరాయణం

తెలుగు వర్సిటీ, అకాడమీలను విభజించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు గడిచినా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీలను ఇప్పటికీ విభజించకపోవడం బాధాకరం. అయితే- వ్యవసాయ, ఆరోగ్య విశ్వవిద్యాలయాలను ఇప్పటికే విడగొట్టారు. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ ఇంకా ఉమ్మడిగా ఉండడంతో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ భాషాభివృద్ధి కుంటుపడుతోంది. గ్రాంట్ల విడుదలలో జాప్యం జరుగుతోంది. తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలో ఆంధ్రలో కూచిపూడి, రాజమండ్రి, శ్రీశైలం కేంద్రాల్లో ప్రాంగణాలున్నాయి. అయినా వర్సిటీని ఉమ్మడిగా కొనసాగిస్తున్నారు. తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రాలు ఆంధ్రాలో అనంతపురం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో వున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు వర్సిటీని, తెలుగు అకాడమీని విభజించాలి.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు
నిజాలు తెలియని రాహుల్
కాంగ్రెస్ యువరాజా రాహుల్ గాంధీ తీరు మారలేదు. దుందుడుకు వ్యాఖ్యలు మానలేదు. ఈసారి ఆయన- ‘్భజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నాయి’ అన్నాడు. నిజానికి అతని నాయనమ్మ ఇందిరమ్మ రాజ్యాంగం పీక నులిమి ఎమర్జెన్సీ విధించి ఎంతోమందిని విచారణ లేకుండా జైళ్లలో కుక్కింది. రాహుల్ తల్లి సోనియా రాజ్యాంగానికి విరుద్ధంగా సలహా కమిటీని ఏర్పరచుకొని ప్రధానిని నిర్వీర్యుడిని చేసి తనే దేశాన్ని ఏలింది. సోనియా సమ్మతితో ప్రధాని ప్రవేశపెట్టాలనుకున్న బిల్లుని రాహుల్ స్వయంగా పబ్లిక్‌లో చించి పారేసి రాజ్యాంగాన్ని ధిక్కరించాడు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర నిండా ఇలాంటి ధిక్కరణలెన్నో!
-శాంతి చంద్రిక, సామర్లకోట
వ్యాధులపై అప్రమత్తత
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయన్న విషయాన్ని ప్రజలు, ఆరోగ్యశాఖ అధికారులు మరువరాదు. విషజ్వరాలు, వైరల్ జ్వరాలు, డెంగీ, చికెన్‌గున్యా, ఇతర అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వైద్య నిపుణుల నుంచి సలహాలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులు విస్తృత ప్రచారం చేయాలి. నిరక్షరాస్యులలో చైతన్యం కలిగించాలి. మందులను అన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉంచాలి.
-సరికొండ శ్రీనవాసరాజు, వనస్థలిపురం
అంతులేని చైనా, పాక్ ఆగడాలు
భారత భూభాగాల్లోకి జొరబడి యుద్ధ వాతవరణాన్ని తలపించేలా చైనా, పాకిస్తాన్ వ్యవహరిస్తున్నాయి. మన ప్రభుత్వం ఈ కుతంత్రాలను తిప్పికొట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలి. భారత స్థావరాలపై దాడులు చేసే పాకిస్తాన్‌కు సైనికులు దీటైన సమాధానం ఇవ్వాలి. సిక్కిం భూభాగాన్ని ఆక్రమిస్తూ చైనా కవ్వింపుచర్యలకు పాల్పడుతూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. చైనా, పాకిస్తాన్‌లు శాంతి చర్చలు అంటూనే సరిహద్దు ప్రాంతాలలో సైన్యాలను మోహరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు పాకిస్తాన్ చర్యలను ఎండగడుతున్నాయి. అయినా పాక్ తన వైఖరిని మార్చుకోలేని స్థితిలో ఉంది.
-అయినం రఘురామారావు, ఖమ్మం
దళారీల రాజ్యం
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవినీతి రానురానూ పెరుగుతోంది. అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే సంబంధిత ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. డబ్బులిస్తేనే ఆస్తిపాస్తులు రిజిస్ట్రేషన్ చేస్తారని, లేకుంటే చేయరనే అభిప్రాయం రిజిస్ట్రేషన్ శాఖపై ప్రజల్లో బలంగా వుంది. రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలు జరగాలి. రిజిస్ట్రేషన్ ఆఫీసుకు సంబంధించి దళారీల ప్రమేయం అధికంగా ఉంటోంది. ఒక్కో పనికి ఎంత ముడుపు ఇవ్వాలో, ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తిఅవుతుందో దళారీలే చెబుతారు. రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది ఎప్పుడు డ్యూటీకి వస్తారో, రారో అన్న విషయాలను వీరే కచ్చితంగా చెబుతారు. దస్తావేజులు మొదలుకొని రిజిస్ట్రేషన్ కాగితాలు చేతికి అందేవరకూ దళారీల సాయంతోనే అధికారులు పనిచేస్తారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ఎలాంటి చర్యలు లేనందున లంచాల బెడద తప్పడం లేదు.
-వులాపు బాలకేశవులు, గిద్దలూరు