ఉత్తరాయణం

మట్టి విగ్రహాలనే వాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక చవితి సందర్భంగా ఏటా ఇళ్లలోను, కాలనీల్లోను చిన్నా పెద్దా విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించుకోవడం ఆనవాయితీ. కొందరు మట్టి గణపతులను ఏర్పాటు చేసుకోగా మరికొందరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను ఆర్భాటంగా ఏర్పాటు చేస్తున్నారు. మట్టి విగ్రహాలే పర్యావరణానికి మేలు చేస్తాయని అందరూ గ్రహించాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలలో ఉపయోగించే జిప్సం, సల్ఫర్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటివి నీటిలో కరగక భూమిలోకి నీరు ఇంకకుండా అడ్డుపడతాయి. విగ్రహాల రంగులలో వుండే లోహాల వల్ల నీటిలో ఆమ్లతత్వం పెరుగుతుంది. లోహాల సాంద్రత పెరిగి నీటిలోని జీవులు మృత్యువాత పడుతున్నాయి. రంగుల మాయలో పడి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను ఎవరూ కొనరాదు. ఈ విషయమై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేయాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
2వేల రూపాయలపై స్పష్టత ఏది?
రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేస్తారనే ఊహాగానాలు జోరుగా వ్యాపించాయి. పార్లమెంటులో విపక్షాలు ఈ విషయమై అడిగినా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దాటవేసారు. దీనిపై స్పష్టత లేకుండాపోయింది. ఇప్పడు చెలామణి అవుతున్న రెండువేల నోట్ల పరిస్థితి ఏమిటి? అవి అలాగే కొనసాగుతాయా? గతంలోలా వాటిని కొద్దిరోజులకు పూర్తిగా రద్దు చేస్తారా? 500, 1000 రూపాయల మాదిరి రెండువేల రూపాయల నోట్లను రద్దు చేస్తే ఫలితం ఉంటుందా? కొన్నాళ్లయినా వీటిని కొనసాగిస్తారా? ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం విచారకరం. ఇక, రెండువందల రూపాయల నోట్ల విడుదలపై జాప్యం జరుగుతోంది. రూపాయి నోట్లను విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా జాప్యం చేస్తున్నారు. ఆ మధ్య పెద్దనోట్ల రద్దుతో గందరగోళాన్ని సృష్టించారు. మళ్లీ రెండువేల రూపాయల ముద్రణ ఆపివేసి ప్రజలను అగమ్య గోచర స్థితికి తీసుకువస్తున్నారు. నిర్దిష్టమైన వైఖరి లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు. కొన్ని సంస్కరణలు మంచివే అయినా, ఆకస్మిక నిర్ణయాలతో సామాన్య ప్రజలకు సమస్యలు తప్పడం లేదు.
-అయినం రఘురామారావు, ఖమ్మం
‘గంగ ప్రక్షాళన’ ఎప్పుడు?
గంగానదిలో నానాటికీ పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జాతీయ హరిత ట్రిబ్యునల్ చేసిన పరిశోధనలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి. అయిదు రాష్ట్రాలగుండా రెండున్నర వేల కిలోమీటర్ల పొడవున ప్రవహించే గంగానది నీళ్లు తాగడానికి, కనీసం స్నానం చేయడానికి కూడా పనికిరాని విధంగా కలుషితమయ్యాయి. హరిద్వార్-ఉన్నావ్‌ల మధ్య 85 మురుగు కాల్వలు, సుమారు వెయ్యి పరిశ్రమల నుంచి వెలువడే యాభై కోట్ల లీటర్ల వ్యర్ధాలు గంగానదిని మురికి కూపంగా మార్చేస్తున్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. 2014లో ఇరవై వేల కోట్ల వ్యయంతో ప్రారంభించిన ‘నమామి గంగే’ పథకం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత దశాబ్దకాలంలో ఎనిమిది వేలకోట్లు ఖర్చయినా ఒక శాతం కూడా ప్రక్షాళన జరగకపోవడం చూస్తుంటే ‘గంగానది ప్రక్షాళన’ ప్రచార ఆర్భాటంగానే కనిపిస్తోంది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే గంగానదికి ఈ దుస్థితి పట్టడం నిస్సందేహంగా పాలకుల వైఫల్యమే!
-సి.ప్రతాప్, శ్రీకాకుళం