సబ్ ఫీచర్

ఆదివాసులను ఆదుకోవడం ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధి ప్రయోజనాలు అన్ని ప్రాంతాలకూ, అన్ని వర్గాలకూ అందాలని మన ప్రణాళికలు ఆశించినా అలా జరగలేదు. మన దేశంలో గిరిజనుల సంఖ్య సుమారు 10 కోట్లు. అడవులలోను, చుట్టుప్రక్కల వుండేవారి సం ఖ్య 25 కోట్లు. వీరు ప్రత్యేక పరిస్థితులలో నివసించడంవల్ల అభివృద్ధికి దూరంగా వున్నారు. ఇది గ్రహించి ప్రభుత్వం వీరి అభివృద్ధికి, సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలను అమలుపరుస్తూ వస్తున్నది. అయినా పరిస్థితిలో ఆశించిన మార్పులేదు. గిరిజనాభివృద్ధి, వ్యూహాలలోనే కొన్ని లోపాలున్నాయి. ఉదాహరణకు రూర్కెలా గిరిజన ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన జరిగింది. దీనివల్ల గిరిజనులు, వాళ్ళ ప్రాంతం అభివృద్ధి చెందవచ్చని ప్రభుత్వ అభిప్రాయం. అలా జరగలేదు. ఎందుకంటే ఉక్కు ఫ్యాక్టరీకి గిరిజనుల వనరుల, అవసరాలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ ఫ్యాక్టరీ వల్ల గిరిజనులు ఎటువంటి ప్రయోజనం పొందలేదు.గి రిజనులు ప్రయోజనం పొందాలంటే అటవీ వనరుల ఆధారిత పరిశ్రమలు స్థాపించాలి. అడవులలో దొరికే అనేక వస్తువులకు బయట మంచి గిరాకీ వుంది. ఉదాహరణకు వెదురు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అటవీ వస్తువులపై గిరిజనులకు హక్కు కల్పిస్తే అనేక రకాల వస్తువులు ఉత్పత్తి చేయగలరు. ఆధునిక ఉత్పత్తి పద్ధతులలో గిరిజనులకు తగు శిక్షణ ఇవ్వాలి. గిరిజనులు తమ సంస్కృతిని వదలుకోకుండా ఆధునిక ఉత్పత్తి పద్ధతులను చేపట్టవచ్చు.
గిరిజనులు కష్టపడతారు. అయితే వీరు సేకరించిన వస్తువులనుండి తగు ఆదాయం లేదు. గిరిజనులున్న ప్రత్యేక పరిస్థితులను ఆసరా చేసుకొని దళారులు సొమ్ముచేసుకుంటున్నారు. దీనిని అరికట్టటానికి పథకాలు ఉన్నప్పటికీ ప్రయోజనం అంతంత మాత్రమే. వస్తువులు మార్కెట్ చేయడంలోనూ తగు ధర పొందటంలోనూ సహకార సంఘాలు సహాయపడాలి. గిరిజనుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుంది. గిరిజన ప్రాంతాలలో జ్వరాలు సామాన్యమైపోయాయి. గిరిజనులు తరచు మలేరియా, డయేరియా, డెంగీ వంటి వ్యాధులకు గురి అవుతున్నారు. రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. పౌష్టికాహారం లోపంవల్ల రక్తహీనత ఎక్కువగా వుంది.శిశు మరణాల రేటు కూడా ఎక్కువే. పిల్లలలో ఎక్కువమంది వుండవలసిన బరువుకంటే తక్కువగా వుంటున్నారు. గిరిజనులకు ఆరోగ్య అంశాలపై సరైన అవగాహన లేదు. సంప్రదాయాలు, కట్టుబాట్లువల్ల కూడా పరిస్థితి విషమించింది. గిరిజనుల ఆహార అలవాట్లు, సంప్రదాయాలపై వైద్య సిబ్బందికి అవగాహన లేదు.గిరిజనుల విద్య విషయంలో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. గిరిజనులలో అక్షరాస్యత బాగా తక్కువ. అయితే, ప్రాథమిక పాఠశాలలకు వెళ్ళే గిరిజన విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే వుంది. ఇది 2000-01లో 1.1 కోట్లు వుంటే 2013-14 నాటికి 1.47 కోట్లకు పెరిగింది. ఉన్నత ప్రాథమిక స్థాయిలో ఈ పెరుగుదల 31 లక్షల నుండి 65 లక్షలుగా వుంది.విద్యా విషయంలో ప్రగతి లేకపోవడానికి సామాజిక కారణాలు కూడా వున్నాయి. గిరిజన తల్లిదండ్రులు తమ పిల్లలు పాఠశాలలకు వెళ్తే తమ సంస్కృతినీ, ఉపాధిని కోల్పోతారని భావిస్తున్నారు. ఇతర కారణాలూ వున్నాయి. వీటిలో ముఖ్యమైనవి: దారిద్య్రం, ఉపాధికై వలసలు, అక్షరాస్యత కార్యక్రమాల అమలులో లోపాలు. బడిమానేసే వారి సంఖ్య బాగా ఎక్కువగానే వుంది.
గిరిజనేతరులను ఉపాధ్యాయులుగా నియమించడంవల్ల కూడా విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతున్నది. విద్యార్థులు మాట్లాడే భాష ఉపాధ్యాయులకు తెలియదు. ఉపాధ్యాయులు మాట్లాడేది విద్యార్థులకు తెలియదు. గిరిజనుల జీవనశైలిపై ఉపాధ్యాయులకు అవగాహన తక్కువ. కొండల ప్రాంతాలలో వున్న విద్యార్థులు తేలికగా పాఠశాలలకు చేరుకోలేరు. కొంత దూరమే రోడ్డు ద్వారా వస్తున్నారు. ఆ తర్వాత కాల్వలు, వంతెనలు దాటి రావాలి. చదువు గిరిజన విద్యార్థులకు ప్రయోజనకరంగా వుండాలి. వీరు వృత్తి విద్యపై ఇష్టత చూపుతున్నారు. కొందరు విలువిద్యలో శ్రద్ధ చూపించి నైపుణ్యత సాధించారు. పాఠశాల పనివేళలలో కూడా మార్పులు తేవాలి. గిరిజన ప్రాంతాలలో వసతి సౌకర్యంగల పాఠశాలలను ఏర్పరచాలి. గనులకు సంబంధించిన చట్టాలవల్ల కూడా గిరిజనులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గనులు తవ్వకాల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం గిరిజనులను కనీసం సంప్రదించడం లేదు. అభివృద్ధి పేరుతో గిరిజనులకు అడుగడుగునా అన్యాయం జరుగుతున్నది.

- డా.ఇమ్మానేని సత్యసుందరం