ఉత్తరాయణం

భారతీయ భాషలకు తప్పని ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని రాష్ట్రాల్లోనూ భారతీయ భాషలకు చావు మూడింది. ఎందుకంటే అన్ని పార్టీలకూ ఓట్లే కాని సంస్కృతి, భాషలు అక్కర్లేదు కాబట్టి! త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలలో శ్రీకృష్ణమిషన్ అన్న పాఠశాల యాజమాన్యం- రోజూ పాఠశాలలో ఇంగ్లీషులో మాట్లాడనందుకు ఉపాధ్యాయులకు 100 రూపాయలు, విద్యార్థులకు 10 రూపాయలు జరిమానా కింద ప్రతిరోజూ కట్టాలని నిబంధన విధించారట. దీనికి కారణం, కొద్దిమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడకుండా తమ ప్రాంతీయ భాషలు మాట్లాడుతున్నారని పాఠశాల యాజమాన్యానికి తమ నిరసన వెలిబుచ్చారట. దీంతో మిగిలిన ఎక్కువ భాగం తల్లిదండ్రులు ఆ నిరసన పట్ల వ్యతిరేకత వెలిబుచ్చారట. అంటే- ఎక్కువమందికి ఇంకా ప్రాంతీయ భాషల మీదనే మక్కువ వుంది. కానీ, పాఠశాల యాజమాన్యమే పిల్లలందర్నీ మెకాలే వంటి మేధావుల్ని చెయ్యలేకపోయామని బాధపడుతోంది. ఇప్పుడీ గోల భరించలేక యాజమాన్యం ఆ జరిమానాను రద్దుచేస్తారట! మరి- మన తెలుగు రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అంతటా ప్రాథమిక విద్యా పాఠశాలలన్నీ ఇంగ్లీషు మీడియంలోనే నడవాలని ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినాయి. కనుక పిల్లలందరూ ‘అయ్యవారు, అమ్మ, నాన్న’ - వగైరాలు అనకుండా ‘సార్, మమీ, డాడీ, మేడమ్, లేడీ’ అనాలన్నమాట. మేడమ్, లేడీ అనేవి పాశ్చాత్య దేశాల్లో గౌరవనీయమైన స్ర్తిలకు వాడే పదాలు కావు! కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు ‘ఎలిమెంటరీ విద్యను ప్రాంతీయ భాషలోనే అందించాలి’ అని చట్టం చేసి ఎంతగానో తాపత్రయం పడుతున్నాయి. మన ఎపి ప్రభుత్వం మాత్రం- ‘దుకాణాల పేర్లను తెలుగులోనే రాయండి’ అంటోంది. పిల్లలు, ఉపాధ్యాయులు మాత్రం ఇంగ్లీషులోనే పుట్టి ఇంగ్లీషులోనే బతకాలా? తెలుగును వీలైనంత వేగంగా పూర్తిగా చంపేయాలా? గోవాలో కూడా ఇంగ్లీషే కావాలట ప్రభుత్వానికి!
-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఏలూరు

ఎన్నాళ్లీ అస్పష్టత
తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. డిఎస్సీలో మార్పులు చేస్తారని, టెట్‌లో అర్హత పొందాలని, టెట్‌కు, డిఎస్సీకి సంబంధం లేదని.. ఇలా స్పష్టత లేకుండా ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంతో అభ్యర్థులు అయోమయంగా ఉన్నారు. ఏడాదికోసారి బదులు నాలుగైదేళ్లకు ఒకసారి టెట్ నిర్వహిస్తే లాభమేంటి? గతంలో టెట్ ప్యాసైన వారి విషయంలోనూ గందరగోళం నెలకొంది. ఈ విషయాలపై స్పష్టతనిస్తూ టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలి.
- నవనీత్ రాజ్, మద్నూర్

ఆ చట్టం జాడలేవీ?
ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను నిరుపేద పిల్లలకు ఉచితంగా ఇవ్వాలని విద్యాహక్కు చట్టం చెబుతున్నా రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రైవేటు పాఠశాలలో నిబంధనలు అమలుకావడం లేదు. ఈ చట్టం అమలు జరిగితే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికైనా చట్టం అమలుచేసి, పేద విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేయాలి.
- చామంతి అనిల్, సిద్దిపేట

ఆస్పత్రుల్లో నరకం
ప్రభుత్వ ఆసుపత్రులు రానురానూ నరకకూపాలై పోతున్నాయి. కుక్కలు, ఎలుకలు స్వైరవిహారం చేస్తూ శిశువులను పీక్కుతినడం, పాముల బెడద, షార్టుసర్క్యూట్స్‌తో అగ్నిప్రమాదాలు, సరైన బెడ్లు లేకపోవడం, సెలైన్ బాటిల్స్‌ను రోగి బంధువులు చేత్తో పట్టుకోవడం వంటివి షరామామూలే. వైద్యులకు సమయపాలన లేకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం, మందుల కొరత, వరండాలో ప్రసవాలు.. ఇలాంటి పరిస్థితులతో ప్రభుత్వ ఆస్పత్రులంటేనే జనం హడలిపోతున్నారు. ఏ ఒక్క రోగి పట్ల వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ ఆస్పత్రులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందా?
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్