ఉత్తర తెలంగాణ

స్నేహమంటే..? ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలచక్రం మామూలుగానే తిరుగుతోంది. కానీ మనుషుల్లో విలువలు మాత్రం మారిపోతున్నాయి. కారణాలు అందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇంతే అని అదేమిటో తమకు సంబంధం లేనిదిగా కళ్లప్పగించి చూస్తున్నారు. ఇదే కొనసాగితే ఎంతటి సునామీ ఎదురౌతుందో ఎవరికీ అర్థం కావటం లేదని మనసులోనే మధన పడుతున్నాడు విశాల్రావు. అదే సమయంలో ఫోన్ మ్రోగింది. ఎవరై ఉంటారు అని అనుకుంటూ కళ్లజోడు పెట్టుకుంటూనే ఎత్తారు.
అవతలి నుంచి చక్రధర్ గొంతు వినగానే ‘ఓ! నువ్వా! చక్రీ! ఎన్నాళ్లకు గుర్తుకు వచ్చాను. చెప్పరా సంగతులు’ అన్నాడు ఆయన ఆనందంగా!
‘ఏమిటి చెప్పేది? నువ్వేంటో ‘రాళ్లపల్లి’ దగ్గిర వాగావటగా అది తేల్చుకుందామనే చేసాను’.
‘అదా! నువ్వు ఆఫీసులో అవినీతికి పాల్పడుతున్నావని, లంచాలు బాగా తింటున్నావని అన్నాడు. అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎన్నటికీ నిలబడవు అన్నాను. అది లోకం ఎరిగిన సత్యమే కదా! అందులో తప్పేముంది చక్రీ?’
‘చక్రి ఏమిటి? చక్రధర్ గారూ అని పిలుపు. నీ స్టేటస్ ఏమిటి? నా స్టేటస్ ఏమిటి? ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు’.
‘స్నేహితులు మధ్య స్థాయి లేమిటిరా? నువ్వూ, నేను చిన్నప్పటినుంచీ ఫ్రెండ్స్‌కదా’.
‘ఆ! ఫ్రెండ్స్ అంటే ఇంటికి రా టిఫిన్ పెడతాను. తిను వెళ్లు అంతే!’
‘స్నేహం అంటే ఇదా! కష్టంలో సుఖంలో తోడుగా ఉండటం అనుకున్నానే’
‘నువ్వేమన్నా అనుకో, నా ఉద్దేశం ఇదే’ అంటూ ఫోన్ కట్ చేసాడు.
కాలంతో పాటు పదాలకు నిర్వచనాలే మారిపోతున్నాయి. స్నేహానికి వీడు కొత్త భాష్యం చెప్పాడు. ఈ కాలం స్నేహాలు ఇంతే అన్నమాట.
గతం అతని కళ్ల ముందు కదిలింది.
వెక్కి వెక్కి ఏడుస్తున్న చక్రి ప్రక్కన చేరాడు విశాల్.
అతన్ని చూడగానే కావలించుకుని బోరుమన్నాడు.
‘అమ్మా, నాన్న ఒకేసారి నన్ను విడిచి వెళ్లిపోయారురా. ఇక నేనెలా బ్రతకాలి? ఎవరికోసం బ్రతకాలి? ఏడుస్తూనే అంటున్నా అతనితో ‘అదేంటిరా అలాగంటావ్? నీకు నేను లేనా? ఇద్దరినీ నేనే అవుతాను. రా! మా ఇంటికి వెళదాం’ అని తీసుకువచ్చేసాడు.
తమ బిడ్డ పేరులానే విశాల హృదయమని పొంగిపోయారు ఆ తల్లిదండ్రులు. అప్పటి నుంచి తమకు ఇద్దరు బిడ్డలు అనుకున్నారు. తమ కొడుకుతో పాటు ఎంబిఎ దాకా చదివించారు.
ఒకటా..రెండా..ఇరవై ఏళ్ల అనుబంధం తమది. అలాంటిది ఈ రోజు తను ఏమీ కాని వాడయి పోయాడా? వాడిని తను చక్రధర్ గారూ అని పిలవాలా?
ఆ మాటలనటానికి నోరు ఎలా వచ్చింది?
గతంలోంచి వాస్తవంలోకి వస్తే సంతోషమంతా ఒక్కసారి బాధగా మారిపోయింది.
మనుషులింతగా ఎలా మారిపోతున్నారు?
బంధాలకు, అనుబంధాలకు, అనురాగం ఆప్యాయతల కన్నా డబ్బుకీ, పదవులకీ, పరువుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారే!
ఇదంతా చూస్తుంటే నందనవనం నుంచి ఎడారిలోకి వెళ్లిపోతున్నట్లు తనకి అనిపిస్తోంది!
మరి అందరికీ ఎందుకలా అనిపించటం లేదు?
‘మనసు అద్దంలోకి తొంగిచూసే సమయం ఉండటం లేదు. దాన్ని కూడా యంత్రంలా యాంత్రికంగా తయారు చేస్తే ఇలా కాక ఎలా ఉంటాయి అనుబంధాలు?’
అంతరంగం గబుక్కున బయటకు వచ్చి అర్జునుడికి శీకృష్ణుడు భగవద్గీతను బోధించినట్లు చిటుక్కున చెప్పేసి..చటుక్కున మాయమయ్యింది.
విశాల్రావు పెదాల మీద ఓ పేలవమైన దరహాసం విరిసి మాయమయ్యింది. చెరుకు పిప్పి స్మరణకు వచ్చింది మరి!

- యలమర్తి అనురాధ
తణుకు, సెల్.నం.924760206

సమీక్ష

ఆకాంక్షల ప్రతిరూపం.. అమరవీరుల విజయం
పేజీలు: 57 ... వెల: 50/-
ప్రతులకు:
హనుమాండ్ల రమాదేవి
క్వార్టర్ నెం.80, ఎస్‌ఆర్‌టి
హిల్‌టాప్ విలేజ్,
ఎఎంసి ఏరియా, బెల్లంపల్లి
ఆదిలాబాద్ జిల్లా

ఆత్మాహుతి కన్నా శాంతి ఆయుధం మిన్న అనే నినాదంతో.. తమ మనసులోని భావాలతో.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమబాట పట్టిన ఆనాటి ఉద్యమకారులకు ఆత్మహత్య పరిష్కారం కాదని..ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తూ ఉడుతాభక్తిగా కవయిత్రి హనుమాండ్ల రమాదేవి కవిత్వం రాశారు. ఉద్యమ నేపథ్యంలో ఆమె కలం నుండి జాలువారిన కవితల్ని ఏర్చి కూర్చి ‘అమరవీరుల విజయం’ పేరుతో ఓ చిన్ని గ్రంథాన్ని వెలువరించారు. తెలంగాణ ఆకాంక్షతో ఆమె రాసిన ఏబది ఐదు కవితలు ఈ గ్రంథంలో చోటు చేసుకున్నాయి. అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ ప్రత్యేక రాష్టమ్రనీ..ఉద్యమంలో అమరులైన వీరులకు ఈ కవితా మాలికను అంకితమివ్వడం అన్ని విధాల సమర్థనీయం! తన నిరాహార దీక్షతో ఉద్యమానికి ఊపిరులూదిన కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో సిద్ధాంతకర్తగా ప్రశంసాపూర్వక పాత్ర పోషించిన ఆచార్య కోదండరామ్‌ను గుర్తు చేసుకున్నారు. ‘తెలంగాణ గ్రంథం’ పేరుతో రాసిన మొదటి కవితలో రమాదేవి ప్రకటించిన భావాలు ఆర్ద్రంగా ఉన్నాయి! ఉద్యమం పట్ల విద్యార్థుల విశ్వాసం.. వారి త్యాగం.. అజరామరం అని ‘నిజం’ కవితలో పేర్కొన్నారు. మనసులో తెలంగాణ జెండాను మోస్తూ..అక్షరాల్లో రాష్ట్ర అస్తిత్వ ఆలోచనలను ప్రతిబింబిస్తూ.. అక్షర యజ్ఞం చేసిన తెలంగాణ కవులను ఏకరువు పెడుతూ.. ‘కవి గుండెల్లో రాయని కావ్యాలు’ కవిత రాశారు. ఆచార్య జయశంకర్‌ను ‘ఉద్యమాంకురం’గా పాఠకుల ముందు నిలిపారు. వివేక్‌ను ప్రశ్నించే చతురుడుగా అభివర్ణించారు. ‘సకల జనుల సమ్మె‘పై రాసిన కవితలో చీకటి దారుల్లో వెలుగులు నింపడానికి ఆనాడు సబ్బండ వర్ణాల ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. తెలంగాణ కోసం న్యాయవాదులు చేతులు కలిపిన తీరును మరో కవితలో చక్కగా ఆవిష్కరించారు. ‘సాగరహారం’ కవితలో జనసంద్రమై కదలి వచ్చి మానవహారంగా ఏర్పడి స్ఫూర్తినిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఫ్లోరైడ్ కష్టాలను ఇంకో కవితలో చిత్రించారు. ఈ గ్రంథంలో తెలంగాణ ఇతివృత్తమైనా.. కలగాపులగంగా వస్తువులను ఎంపిక చేసుకున్న రమాదేవి..అభివ్యక్తిలో కనీస ప్రమాణాలు పాటించలేకపోయారు. గ్రంథం రూపంలో తమ భావాలను ప్రకటించే క్రమంలో..కవిత్వానికి ఉండే కనీస లక్షణాలను విస్మరించారు. శిల్పం, అభివ్యక్తి విషయాల్లో చాలా అంశాలు రమాదేవి తెలుసుకోవాల్సి ఉంది.. కవిత్వం రాయడంలో ఇంకా మెలకువలు పాటించాల్సి ఉంది. అన్నింటికి మించి ఆమె తెలుగు భాషపై పట్టు సాధించాలి..పద ప్రయోగంలో ప్రతిభను ప్రదర్శించాల్సి ఉంది. ఈ గ్రంథ రూపకల్పనలో అనుభవజ్ఞులను సంప్రదిస్తే బాగుండేది. ఎందుకంటే.. పంటి కింది రాయిలా.. అడుగడుగునా అట్టపేజీ నుండి ఆఖరు పేజీ దాకా.. అక్షర దోషాలే అడ్డుపడతాయి! ఏది ఏమైనా.. తెలంగాణ పట్ల ఆమెకున్న మక్కువను, అభిమానాన్ని, స్వాభిమానాన్ని అభినందించకుండా ఉండలేము...అధ్యయనంపై దృష్టి పెట్టి.. మంచి కవయిత్రిగా ఎదగాలని కోరుకుందాం!

- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544

స్ర్తి
సకారము తకారము రకారము
ఈ కారంతో కలిపి పలికే
ఏకాక్షర ఉచ్ఛారం ‘స్ర్తి’
త్యాగానికి తార్కాణం
అందానికి ప్రతిరూపం
ఆరాధిస్తే కరుణారస ప్రవాహం
కలహిస్తే..
ప్రళయభీకర ఉత్తుంగ తరంగం
ప్రేమిస్తే..
క్షమా ఓర్పుల సమాహారం
ప్రణవనాదానికి శ్రీకారం
ప్రాణప్రతిష్టకు
పరమ పవిత్ర స్థానం
జీవునికి ఆకారాన్ని ప్రసాదించే
అమృతభాండం
మానవోత్పత్తికి సహజ కేదారం
స్ర్తిమూర్తి గర్భకోశం
సృష్టి రహస్య రక్షణకు పెట్టని ప్రాకారం
స్ర్తిమూర్తి జీవితం
పురుష ప్రయత్నానికి కలకాలం
స్ర్తియే శక్తి సహకారం
జగతి మనుగడకు ఆధారం
స్ర్తిమూర్తి ఆకారం

- దాసరి శ్రీనాథ్ గౌడ్
తిమ్మాపూర్, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9701781696

మనోగీతికలు

చెట్టు నేస్తం

ఈ గట్టు దగ్గర నా నేస్తం
రోజు పొద్దునే్న తన ముఖంలో
నా నవ్వును చూపించేది
రాలిపోతున్న నా ఆకులను పువ్వులను
తన అలల చేతులపై ఎత్తుకుని జోలపాడేది

తన అలల పిల్లలంతా
నా మొదళ్లతోనే తడిముచ్చటలాడేవి
అప్పటి పదన గుర్తులే
పొడిబారిన ఇప్పటి నా వాకిల్లయ్యాయి

తను స్తబ్దంగా ఉన్నప్పుడు
నా కొమ్మల చేతులతో పలకరిస్తే
నేనిచ్చిన చిరుగాలి స్నేహానికి ప్రతిగా
చల్లని సంగతులెన్నో చెప్పేది

నలుదిసలా విస్తరించిన మానవ జీవనం
తన అస్తిత్వాన్ని ధ్వంసం చేసేటప్పుడు
కలికాలపు వాతావరణపు కోరలు
తనకు విషపు కాటు వేసినప్పుడు

నీరింకిన తన గుండెను
నా ముందు విశాలపరిచింది
పగుళ్ల పలుకులతో పెదవులు విప్పి
ఈ చోటుకు సెలవు చెప్పింది

కరువు దాడికి తాళలేక
అవని గర్భాన తలదాచుకుంది
మునివేళ్లను గునపాలుగా చేసి
తనకిప్పుడు జీవం పోయగలరా
మీలో ఎవరన్నా...

- కొత్త అనిల్‌కుమార్
జ్యోతినగర్, కరీంనగర్
9395553393

విజయం

ప్రాణాల్ని సైతం
లెక్కచేయక
దేశ సేవకు
ప్రాణాల్ని అర్పించటానికి
గుండెధైర్యంతో
శత్రువుల్ని వేటాడటానికి
యుద్ధం చేసే సైనికుడికి
విజయం తప్పక లభిస్తుంది
కష్టజీవి రైతన్న
రేయింబవళ్లు రెక్కలు ముక్కలు
చేసుకుంటే కాని
వరుణ దేవుడు కరుణిస్తేనే కాని
విజయం కలిసిరాదు
శిలలు శిల్పంలా మారాలంటే
ఉలి పోట్లు తప్పవు
విజయాన్ని చవిచూడాలంటే
చిత్తశుద్ధితో లక్ష్యంవైపు పయనించాలి

- బి.సుమతి, జడ్చర్ల
8019028325

మన్నించు

సరిగ్గా ఏడాది క్రితం జన్మించినావు
ముద్దుముద్దు పేర్లెన్నో పెట్టుకు మురిసాం

నువ్వు పుట్టిన ఆనందంలో నీ తల్లి
మాకందరికీ నాల్రోజులు జన్నుపాలతో
తృప్తిగా కడుపు నింపింది... సంతోషం

వాకిలంతా నువ్వు చెంగుచెంగున ఎగురుతుంటే
పిల్లలందరు కేరింతల్లో తేలియాడారు

తల్లితో మందల కొడితే బుద్ధిగా వెళ్ళి
అప్పుడప్పుడు దారితప్పినా, తప్పక ఇంటికొచ్చేదానివి
ఆహారపు కొయ్య దగ్గర ఆశగా ఎదురుచూసే దానవు

అయనా ఎన్ని రోజులు బిడ్డా, ఉన్న గడ్డీ ఎండిపోయే
బొత్తిగా నీళ్ళు లేక బీడువారిన పొలాలాయే
సాగునీరు తాగునీరు కరువాయే...

మరి ఇంటిముందు నువ్వు జాలితో నిలుచుండ
మాది మేం కాపాడుకోవడానికే ఆపసోపాలు
మూగదానివి నువ్వు, నీ జీవం కాపాడేదెలా...

ఏడాది బిడ్డవు అయన నిన్ను ఏమంత వెల రాకున్నా
తప్పనిసరి అయ అమ్ముకోక తప్పడం లేదు
మరి మాది స్వార్థమే కావొచ్చు

అందుకే, వచ్చినవాడు కసాయో,
నిను కాపుగాసే కాపయ్యో
కనుక్కోవాలనే ఇష్టం చంపుకుని నిన్ను వదిలించుకొన్నాం

పాలతో మనిషి ఆహారం అయ,
పేడతో పంటకు ఎరువై
తోట పనితో రైతుకు తోడువై
పంట పంటకు పెద్దన్న పాత్ర పోషించి
మనిషికి ఆహారం పంచుతున్న నిన్ను
కాలం కలిసిరాక కరువు బారినపడి
రైతన్న నీకు భరోసా ఇవ్వడం లేదని గమనించు
అందుకు మమ్మల్ని మన్నించు!

- జయరెడ్డి బోడ, మేడిపల్లి, కరీంనగర్, 9963373059

తిరిగి నీ ఒడిలోకి...

అమ్మా నీ గర్భంలో జనియంచాను
శిశువుగ పుట్టిన నేను, ఇంతింతై
ఎంతో ఎంతో ఎదిగి, దశలన్నీ అధిగమించి
దిశలన్నీ కలియతిరిగి
నేనే ప్రపంచమని అహంకార దురితనై
ఆవహించిన అనాలోచిత ఆలోచనలు పాటిస్తూ
నా పునాది పడిపోయేందుకు నేనే తొలి కారకుడను
ప్రకృతి కోపం, పర్యావరణానికి శాపం కలిగించే
పనులు చేస్తూ ప్రళయం వచ్చేలా చేస్తూ
బాధలను భరిస్తూ, గుణపాఠం త్యజిస్తూ
కష్టాలకు, కన్నీళ్లకు కాసేపే సమయమిచ్చి
కొంతైనా మారకుండా
నా దోవ నేను నడుస్తూనే ఉన్నాను
సముద్రమా, నీ కోపము సరియైనదే(నా) సుమా!
నిన్ను వేలెత్తి చూపే ధైర్యం నాకెక్కడిది?
కాల గర్భంలో కలిసె నగరాలు, నాగరికత
తండ్రీ నీ ప్రళయం సునామీల బీభత్సం
ఆపలేము, ఆగవు
అమ్మ గర్భంలోంచి నేను,
సముద్ర గర్భంలోకే సుమా
అలలుగా నీవిసిరేసినా
తిరిగి చేరేది నీ ఒడిలోకే కదా!

- రాజేశ్వరి బొమ్మిదేని
పెద్దపల్లి, ఫోన్: 9160908045

డబ్బు! డబ్బు!!

లేని బంధాలను
కలిపేస్తూ
ఉన్న బంధాలను తుడిచేస్తూ
కాళ్ళు లేకుండానే నడిపిస్తూ
చేతులు లేకుండానే ఆడిస్తూ
నోరు లేకుండానే పలికిస్తూ
కళ్ళు లేకుండానే శాసిస్తోంది డబ్బు
డబ్బుకు
మనసు లేదు
మనిషి చేసిన డబ్బు
మనిషినే ఆడిస్తోంది నేడు.

- సోక్కల తిరుపతి
మామిడిపల్లి, 9032390776

అలక
సఖీ...
జామురాత్రి జగడాలెందుకు
కారాలు నూరి
కాలాన్ని కరగనీయకు
నీ నవ్వుతోనే కదా
నక్షత్రాలు విరబూస్తాయ
ఇకనైనా
కోపాలు కట్టిపెట్టి
తెచ్చిన పూలను కొప్పున పెట్టు
పుత్తడి బొమ్మను మరిపించేలా
అందాలను ఒడిసిపట్టు
అలక మాని నీ అణువణువును
నాకు పంచిపెట్టు!

- సంటి అనిల్‌కుమార్, 9542620878

హరితం
సతతం హరితం అయతేనే
అడవులకు అందం
హరితంతోనే
కదులుతాయ
పల్లె ప్రగతి చక్రాలు
జలసిరులు ఉంటేనే
పాడిపంటలకు మోక్షం
ఆ హరుడే అచ్చెరువొందేలా
ధరణంతా
హరితమయం కావాలి
భూమాత ఒడిలో
చల్లగా బతకాలి

- అడప రాజు, సీతారాంపురం, పరకాల మం.
ఫోన్ నెం. 9177825265

లేఖినికి ఓ విన్నపం

లేఖినీ!
నీలోని సిరాను
కలుషితం కానీయకు
తెల్లని కాగితంపై సత్యాన్ని
తేటతెల్లం చేసే నీ గుణం
జగతికే ఆభరణం
నీది ఒకటే రంగు
చీకటిలో చిరుదీపంలా
వెలిగిపోతుంటావు
రంగులు మార్చకు
హంగులు చేర్చకు
నీ ఉనికి అక్షరాలలోనే!
నీ గమ్యం అక్షరమే!
నీ లక్ష్యం ఆనందమే!
ఎన్నటికీ తరుగని కీర్తి
నీకు నిరంతర స్ఫూర్తి
నిర్మలంగా ఉండాలి
ఎప్పుడూ నీ మూర్తి!

- డా. అయాచితం నటేశ్వరశర్మ, కామారెడ్డి, 9440468557

ధైర్యాన్ని వీడకు

రైతన్నా
కాలమెప్పుడూ
ఒక రీతిగనే ఉండదు గదనే
నీకు తెలియందేముందే చెప్పన్న..

నువ్వనుకుంటున్నట్టు
చావే అన్ని సమస్యలకు పరిష్కారమైతే
ఈపాటికి లోకమంత ఎప్పుడో
శ్మశాన గడ్డలతో నిండిపోయేది గదనే

మట్టిని పిసికే నీ చేతులు
ఈ మట్టిలోనే బలవంతంగా కల్సిపోతుంటే
మాకు ఒక్క ముద్దైన దిగుతలేదే

ఏండ్ల సంది
ఎవుసం చేస్తున్నోడివి
ఎన్నో కాలాల్ని కళ్ళనిండ జూసినోడివి
ఎంత కట్టమొచ్చిన నట్టమొచ్చిన
ఇన్ని దినాలు ధైర్నంగ బతికినోడివి
ఇయ్యాల నీ ధైర్యాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నవే

నిజమే
ఎవ్వరికి రాని కట్టమొచ్చింది నీకు
కాలం కనె్నర్రజేస్తున్నది
కాదనను...
యింతదానికి నువ్వు తనువు చాలించితే
నీ కట్టాలన్నీ తీరిపోతాయా?
నీ కన్నీళ్లన్నీ ఆగిపోతయా?
నినే్న నమ్ముకున్నోండ్ల సంగతెట్ల జెప్పు?

ఎవరో వస్తారని ఏదో జేస్తారని
ఎన్నాళ్లని ఎదురుచూసి మోసపోతవే
నిన్ను నువ్వు నమ్ముకో
ధైర్నాన్ని వీడకు
అర్ధంతరంగ నీ బతుకును తెల్లారనియ్యకు

నీకు మేమున్నం
నువ్వు మాకుండాలే
కట్టమొచ్చిన నట్టమొచ్చిన
ఇద్దరం కల్సే పంచుకుందం
మనకు రావల్సిన హక్కులను
ఖచ్చితంగ కొట్లాడి సాధించుకుందాం

- బిల్ల మహేందర్, వరంగల్, 9177604430

చెమట చుక్కలు
వారి కళ్లకు
కన్నీళ్లు రావడం లేదు
వారి తలలకు
సంతాపసూచకంగా వంచడమే తెలీదు
వారి కాళ్లు
కడపటి సంస్కారానికి కలసి రావు
కాని నాలుక మాత్రం
నాటకీయంగా నాట్యం చేస్తూనే ఉంది
నరం లేనిది కదా...?
నోట్లో బెల్లంగడ్డ పెట్టుకు వస్తరు
తీపి వినీ వినీ చెవులు తూట్లు పడ్డయి
ఇక బతుకు బండి నడపడానికి
కాకర రసాన్ని ఇంధనంగా వాడాలి
రెక్కల కష్టానికి
లెక్కలు కట్టకపోతే పోతిరి కానీ
పెట్టుబడి పుట్టి మునుగకుండా చూస్తే సరి!
కాంటాలో తూగిన చెమట చుక్కలు
మార్కెట్ మాయలకు
ఆవిరి కాకుండా ఉంటే చాలు

- రాపాక శ్రీనివాస్, నెక్కొండ,
9966228963

భరత మాత రుణం

ప్రపంచానికి వెలుగుల్ని
పంచేందుకు నిరంతరం
కొవ్వొత్తినై కాలుతున్నాను
చీకట్లను పారద్రోలడం కోసం
ఆయుష్షును ఫణంగా పెట్టి
నాలోని అంతరాత్మను రగిలించి
మదిలోని భావాల్ని మరిగించి
ప్రజా క్షేమానే్న కాంక్షించి
స్వార్థపు పునాదులు పెకిలించి
దేశ ప్రజల శ్రేయస్సు కోసం
నా దేహాన్ని ఫణంగా పెట్టి
భరత మాత రుణాన్ని తీర్చుకుంటా
మరో జన్మలో సైతం
ఈ భూమినే కోరుకుంటా!

- బి.రాంకుమార్, జడ్చర్ల
8297777732

గుండె చప్పుళ్ళు
ఎన్నికల సమయంలో
మన్నికైన వాగ్దానాలు చేసి
కల్లబొల్లి కబుర్లు చెప్పి
కపటమైన ప్రేమను చూపి
జనసమీకరణ చేసి
జనాకర్షక పథకాల ఆశజూపి
ఓటర్లకు కోటర్లు పంచి
ఓట్లు గడించి
కోట్లు సంపాదించి
చుట్టం చూపుగా వచ్చి
చట్ట సభల్లో కూర్చునే
రాజకీయ రాబందులారా
కనబడుట లేదా?
ఆకలితో అలమటించే
బక్కచిక్కిన బడుగు జీవులు
వినబడుట లేదా
గూడు లేక
వేడెక్కిన గుండె చప్పుళ్ళు?

- నూతన్, శ్రీరాంపూర్, 9908475207

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
email : merupuknr@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

dasyamsenadhipathi10@gmail.com

- యలమర్తి అనురాధ