ఉత్తర తెలంగాణ

ఒంటరి ప్రయాణం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్కులో సిమెంటు బెంచిమీద కూర్చొని సేద తీరుతున్నాడు రంగారావు. అరుణిమ ఆకాశంలో బారులు తీరి గూళ్లకు వెళ్లిపోసాగాయి పక్షులు. అక్కడక్కడా ఆడుకుంటున్న పిల్లలు, కబుర్లు చెబుతూ నవ్వుకుంటున్న మధ్యవయస్క జంటలు. ఇంత మందిలో ఎక్కడైనా తనలాంటి వాళ్లు ఉన్నారేమోనని చుట్టూ పరికించాడు. నెరిసిన తలలతో, ముసిరిన ఆలోచనలతో, ముదిమి భారంతో, ఊతకర్ర సహాయంతో ఈవినింగ్ వాకింగ్ చేస్తూ కొందరు. తన పెంపుడు శునకంతో ఆడుకుంటూ మరికొందరు. పాటలు వింటూ జీవిత భాగస్వామితో కలిసి నడుస్తున్న మరికొందరు. రంగారావులో తెలియకుండానే అంతర్మథనం ప్రారంభమయింది. మరి తనలాగ ఎవరూ లేరా? ఏమో? ఇక్కడున్న వాళ్లలో ఐతే చెప్పలేను. నాలాగ జీవిత భాగస్వామిని పోగొట్టుకొని, కొడుకుల మధ్య ఆత్మవిభజన చేసుకుంటూ ఊరూరా తిరుగుతున్న ఒంటరి దేశదిమ్మరిని. ప్రేమగా చూసేవాళ్లు లేక ఒక ఆప్యాయతా పలకరింపునకై మొఖం వాచి, ఒక ఆత్మీయతా ఆలింగనం కొరకై అర్రులు చాచి లేచి ఉన్న ఎడారి లాంటి వాణ్ణి. తెగబారెడు బతుకు బతికి చివరికి మరికొన్నాళ్లు ఈ బతుకు భారాన్ని ఈడ్చలేక చితికిలపడటమా? లేక నిస్సహాయంగా ఈ లోకాన్ని వదలి వెళ్లటమా? ఇలా ఎన్నోసార్లు ఆలోచించాడు రంగారావు. ఇన్ని రోజులు సమయం ఎలా గడిచిందో తెలియదు. సీనియర్ సిటిజన్ కాగానే చివరికి కాలం కూడా మనపై పగబడుతుందేమో అన్పించింది ఆయనకు. మనుమలు, మనుమరాండ్రు చుట్టూరా ఎంత జనం. బంధువులు ఉన్నా, మనిషి అంతరంగంలో మాత్రం ఎప్పటికీ ఒంటరే..! ఒంటరి ప్రయాణాన్ని కడదాకా కొనసాగించాల్సిందే. మధ్యలో వచ్చి చేరిన పిల్ల కాల్వలాంటి వాళ్లు భార్యాబిడ్డలు కలుస్తుంటారు. విడిపోతుంటారు. అంత మాత్రాన తాను మాత్రం ఒంటరిగా ఈ జీవితాన్ని జీవించలేడా? మనకు ఆల్ టైం ఫ్రీగా దొరికిన ఈ దేహపు నౌకను సుఖవంతంగా ఒడ్డుకు చేర్చలేడా? తప్పకుండా..అనుకొని తనలో తాను ఏదో ఆలోచించుకున్న వాడల్లా పైకి లేచాడు రంగారావు. ‘సారీ అండి. మీ నాన్నగారు తాను ఎక్కడికి వెళ్లాడో తెలియనివ్వవద్దని, మీరొస్తే ఈ లెటర్ ఇవ్వమని మాత్రం చెప్పారండి.’ అన్నాడు వృద్ధాశ్రమంలోని నిర్వాహకుడు. తెల్లబోతూ ఆ లెటర్ అందుకొని చదవటం ప్రారంభించాడు నరేష్.
‘నాకు తెల్సురా! ఈ రోజు డబ్బులు కట్టటానికి మీలో ఎవరైనా ఒకరు ఇక్కడకు వస్తారని, ఇనే్నళ్లు నన్ను, కుటుంబాన్ని చల్లగా చూసిన నా అమృతవల్లి వెళ్లిపోయాక, శూన్యంలో నేనుంటే ప్రాపంచిక విషయ భోగలాలనతో మీరు, మీ భార్యలు, ఉరుకుల పరుగుల దైనందిక జీవితం. మధ్యలో నా వృద్ధ ప్రాణానికి తిండీ తిప్పలు, మందు.. మాకులూ..! మీకు బరువుగా నేనుండలేనంటే ఈ వృద్ధాశ్రమంలో చేర్పించారు. కానీ ఇక్కడా నా మనసు శాంతంగా ఉండలేక పోయిందిరా..! ‘నాన్నా! మీరెక్కడున్నా ఆనందంగా ఉండాలి. ఎక్కడా అడ్జస్ట్ కాలేకపోతే ఎలా నాన్నా?’ అని మీరు అనేవారు గుర్తుందా? అందుకే నా ఐడెంటిటీని కొన్ని రోజులు మరుగునపెడ్తూ వెళ్లిపోతున్నాను. అంత మాత్రాన మీరు అనుకున్నంత పిరికిపంద చర్యలేమీ చేసుకోనని మాట ఇస్తున్నాను. మళ్లీ నెలకి ఇదే తారీఖున వచ్చి ఇక్కడే కలవండి. అపుడు నేనెక్కడికి వెళ్లి వచ్చానో చెబుతాను..ఆశీస్సులతో..మీ నాన్న’.. అని లెటర్ ముగించాడు.
***
రైలు వేగంగా వెళ్తోంది. జ్ఞాపకాల భారంతో రంగారావు గుండె బరువెక్కింది. తానిప్పుడు ఒంటరికాడు. చుట్టూరా ఉన్న పది మందికి జీవనభరోసానిచ్చే చల్లని నీడలాంటివాడు. రోడ్డు దుర్ఘటనలో తన కుటుంబాన్ని పొగొట్టుకొని ఒంటరి మోడులా మిగిలిన తన చిన్ననాటి స్నేహితుడు రాఘవ, చిన్న వయస్సులోనే భర్త కోల్పోయి ఇటీవలే రిటైర్ అయిన వసుమతి. తమలాంటి వాళ్లెందరో కలిసి బాగు చేసుకోబోతున్న కొత్త ఇల్లు..నందనవనం..! పల్లెలో రెండెకరాల విస్తీర్ణంలో విస్తరించిన తోటను బాగు చేసి నందనవనాన్ని నిర్మించుకుందామన్న తమబోటి వాళ్ల ఆలోచనను కార్యరూపం దాల్చటానికి వెళ్తున్న రథసారథి రంగారావు. తనలాగ జీవన మలిసంధ్యలో భాగస్వామిని, కుటుంబాన్ని పోగొట్టుకొని, జీవితాన్ని ఓడిపోయామని భావించేవాళ్లకు ఊరటనిచ్చే నందనవనం ఓ స్వాంతన కుటీరం. ఒక్కొక్కరి జీవితం ఒక అనుభవం నేర్పిన పాఠం. కలతలు, కష్టాలు, కన్నీళ్లు, కలల సమూహారమే కదూ.. జీవితమంటే. ఏదో జరిగిందని, ఇక అక్కడితో జీవనం అయిపోయిందని భావించే బదులుగా తనలా జీవితాన్ని మరోవైపు నుండి కూడా మొదలు పెట్టవచ్చని ఆశావహాన్ని, స్ఫూర్తిని కొద్ది మందిలో రగిలించినా చాలు..! తన జన్మ సార్థకమయినట్లే..! రేపటి ఉదయం కొరకు నేటి చీకట్లను అనుభవించాలి తప్పదు. ఎక్కడినుండో నిషా స్వరంతో విషాద గీతిక ఒకటి అలలా తేలి వస్తున్నది. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు..నీ కోసమే కన్నీరు నింపుటకు.. తోడొకరుండిన అదే భాగ్యమూ.. అదే సౌఖ్యమూ..! ఫర్వాలేదు..! ఈ గుప్పెడు గుండెలో ఆమె వదలివెళ్లిన జ్ఞాపకాల విత్తనాలు చాలు! శేష జీవితాన్ని ఇక నిర్భయంగా జీవించేస్తాను. అనుకొని స్టేషనులో దిగి జన సమూహంలో కలిసిపోయాడు రంగారావు. మరి రేపటి రంగారావు మాటో? మీరైనా... నేనైనా... మనలో ఎవరైనా... ఓడినా తుదికంటూ నిలబడటమే పెద్ద గెలుపు..!

- బి.కళాగోపాల్
నిజామాబాద్, సెల్.నం.9441631029

పుస్తక సమీక్ష

మనసుకు సాంత్వన..
జయశ్రీ ‘చిగురు కల’

పేజీలు: 56 - వెల : 50/-
ప్రతులకు:
బండారు జయశ్రీ
ఇం.నం.3-1-46/48
ఆజాద్ రోడ్, శివాజీనగర్
భువనగిరి - 508116
నల్లగొండ జిల్లా
సెల్.నం.9885623485

ఆశ నిరాశల దోబూచులాటే జీవితమని తేల్చి చెప్పిన కవయిత్రి బండారు జయశ్రీ ‘చిగురు కల’ పేరుతో ఓ కవితా సంపుటిని వెలువరించి తెలుగు పాఠకులకు చేరువైనారు. గుండె గాయాలు జీవితాన్ని శాసించరాదని భావించే ఆమె నిరాశ నిస్పృహలకు తావివ్వరాదని కోరుకోవడం ఆహ్వానింపదగింది. బాల్యంలోనే కవితలు, గేయాలు రాయడం మక్కువ చూపిన ఆమె.. ఇప్పుడు ప్రకటిస్తున్న కవితా సంపుటిలోని కవితల ద్వారా ఆశావహ దృక్పథాన్ని నింపడానికి ప్రయత్నించడం ప్రశంసనీయం! ఆమె తమ కవితలకు వస్తువులను ఎంపిక చేసుకోవడంలో వైవిధ్యాన్ని పాటించారు. శిల్పం, అభివ్యక్తిలో ఇంకా పరిణతి సాధించాల్సి వున్నప్పటికీ.. తన అంతరంగంలో గుట్టుగా గూడుకట్టుకున్న భావాలకు అక్షర రూపమివ్వడంలో సరళత్వాన్ని పాటించి పాఠకులను మెప్పించయత్నించారు. మనసును సాంత్వన పరిచేలా తమ కవిత్వాన్ని ఇందులో పొందుపరిచారు. ఆత్మీయతకు అభిమానానికి, ప్రేమకు అనుబంధానికి తొలిమెట్టు ‘చెలిమి’ అని భావించే ఆమె.. స్నేహానికి భేషజాలుండరాదని సూచించడం బాగుంది.
ఆటుపోట్లకు అలవాటుపడ్డ మనసును నియంత్రించుకోవడం.. నిగ్రహంగా ఉండటం తేలికేనని ఒక కవితలో తేల్చి చెప్పారు.
విసుగూ విరామానికి స్వస్తి చెప్పి..శ్రమైక జీవన సౌందర్యంలోంచి.. ప్రేమానురాగాలు ఆయుధాలుగా, ఆప్యాయత, దానగుణాలు పరమావధిగా నిలిచిన ఆమె ‘అమ్మ’ను మరో కవితలో ఉన్నతంగా చిత్రించారు.
మనసున్న మనిషిలోని ‘ఘర్షణ-సంఘర్షణ’ను ఇంకో కవితలో చక్కగా ఆవిష్కరించారు. పొద్దుతిరుగుడు పువ్వును ‘సూర్య పుష్పం’ కవితలో పాఠకులకు కవితాత్మకంగా పరిచయం చేశారు. మారణ హోమంతో.. మత విద్వేశాలతో.. మానవత్వానికి దూరం కావద్దనీ.. ప్రేమతో మనుషులందరు కలిసుండాలని ‘శాంతి పావురాన్ని’ ఎగురేశారు.
‘ఎన్నికల సమరం’ కవితలో ఎన్నికల వేళ నాయకులు ప్రదర్శించే ఊసరవెల్లి వేషాలను చక్కగా దృశ్యమానం చేశారు.
‘నవకామనలు’ కవితలో.. చైత్రమాసం ఉగాది ఉషస్సున లేతాకు చిగురులోంచి మొగ్గలేసిన మల్లెల గుబాళింపు పరిమళాలను అక్షరబద్ధం చేశారు. అయితే పర్యావరణానికి విఘాతం కల్పిస్తూ.. సాంకేతిక విజ్ఞానం వలయంలో చిక్కుకుని సహజత్వాన్ని కోల్పోవడం పట్ల తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ‘పర్వదినం’ కవితలో.. కాలంతో పాటు కవిత్వమై సాగిపోవాల్సిందేనని కాంక్షించడం బాగుంది. మరో కవితలో ఫ్లోరోసిస్ బాధితుల వ్యథలను ఆర్ద్రంగా ఆవిష్కరించారు. ‘జీవితావిష్కరణ’ కవిత సందేశాత్మకంగా ఉంది. ప్రేమకంటే జీవితం గొప్పదని చెప్పిన తీరు అభినందనీయం. కవయిత్రి తన చిన్ననాటి మిత్రురాలితో ముచ్చటించాక.. పొందిన అనుభూతిని ఒడవని ముచ్చటగా ‘అక్షయ పాత్ర’ కవితలో మనతో పంచుకున్నారు.
కవితకేదీ కాదనర్హం అని శ్రీశ్రీ పేర్కొన్నట్లు.. కవయిత్రి జయశ్రీ ‘బీడీ కార్మికుల’పై కవిత రాశారు. బీడీ కార్మికురాలిని పట్టాలేని పట్ట్భద్రురాలిగా అభివర్ణించారు.
‘వౌనం’ కవిత ద్వారా గెలుపు రహస్యాన్ని తెలియజెప్పారు. కాలం మారినా ‘ఆడపిల్ల’ ‘కహానీ’ అలాగే ఉండటం పట్ల కవయిత్రి తమ విచారాన్ని ప్రకటించారు.
ఇలా సీదా సాదాగా కవిత్వాన్ని పండించి ‘చిగురుకల’ గ్రంథాన్ని వెలువరించిన జయశ్రీ గారికి అభినందనలు తెలుపుదాం. ముందు మాటల మోతాదు కొంత పెరిగినప్పటికీ.. అవి గ్రంథానికి శోభను కూర్చాయి! కవయిత్రిగా రాణించడానికి జయశ్రీ గారు కవిత్వం రాయడంలో ఇంకా మెలకువలు తెలుసుకోవాల్సి ఉంది. అభివ్యక్తిలో ఇంకా పరిణతి సాధించాల్సి ఉంది. శిల్పం పట్ల శ్రద్ధ చూపాల్సి ఉంది. అధ్యయనం పట్ల మక్కువ చూపి తమ కలానికి పదును పెట్టుకుంటారని ఆశిద్దాం.. మున్ముందు చక్కని అంశాలతో చిక్కని కవిత్వాన్ని అందించడానికి ఆమె కృషి చేయగలరని విశ్వసిద్దాం.

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

రచనలకు ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం... సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక
సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా, మీరు రాసిన అక్షరానికి
అచ్చురూపం ఇచ్చి, ఆవిష్కరించే అద్భుత అవకాశమే ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి... నిస్తేజంగా ఉన్న భావుకతను
మేల్కొలపండి. ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

లోతు
బావి లోతెంతో చూడాలంటే
కండల్లో బలముండాలి
గుండెల్లో ధైర్యముండాలి
కమ్ సే కమ్ దిగడానికి
చేతులు కాయలు కాసైనా ఉండాలి
పట్టులేని గోడను సైతం పట్టుకునే
గరుకు పాదాలైనా ఉండాలి
ప్రాణవాయువు లేకున్నా
ఊపిరి బిగపట్టే సత్తా నీ చెంతుండాలి

చేయిజారి చేదబావిలో
నీళ్ళ బొక్కెన పడినప్పుడు
పరిశోధించి పైకి తెచ్చేది
పాతాళ గరిగే కదా!
వెతకాలంటే మనిషికి
లోతు చూపుల కొక్కాలుండాలి నేస్తమా!
మనుషుల్లో
మమతానురాగాల పురీ లేదు
మానవత్వపు స్వరఝరీ లేదు
చిలుము పట్టిన
కాఠిన్యపు హృదయ బావిలో
ఎంత పాతాళ గరిగేసి దేవినా
తిరిగొచ్చేవీ ఖాళీ నాచు కొక్కాలే.

మునిగిన బతుకు బొక్కెనను
అనే్వషించి బయటకు లాగటానికి
ఆలోచనల లోతుల కొక్కాలున్న
తెలిసిన అనుభవశాలి ఒకరు కావాలి

బావైనా... మనిషైనా...
లోతులు తెలిసి దిగాలి మిత్రమా!

- అశోక్ అవారి,
సిద్దిపేట, మెదక్, సెల్: 9000576581

అన్నార్థి
గుప్పెడు మెతుకులు
దొరకక ఎన్నో ప్రాణాలు
గాలిలో కలిసి పోతున్నాయి!
ఆకలి మంటలు
దహించివేస్తున్నాయి!
ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి
ఎంతో ఆశతో వారు
పిడికెడు అన్నం కోసం
ఆక్రోశిస్తున్నారు!
వారివి మురికివాడల
మురికి బ్రతుకులు
పార్లమెంటు సింహాసనంపై
ఎవరు కొలువుదీరినప్పటికీ..
వారికి దేవుడితో సమానం
అన్నార్థులు
ఆశతో ఎదురు చూస్తారు కానీ
ఇది ఎప్పటికీ ముడి వీడని

- గంప ఉమాపతి
కరీంనగర్
సెల్.నం.9849467551

ప్రభూ...
ప్రభూ నువ్వు రాసిన
నుదుటి రాతల్లోనే
ఇమిడి పోయామే!
నువ్వు గీసిన
బ్రతుకు గీతల్లోనే
ఒదిగిపోయామే!
ప్రభూ నువ్వు ప్రాప్తించిన
గుప్పెడు ఆనందంలోనే
ఓ...తలమునకలయ్యామే
నువ్వు మోసిన గంపెడు
కష్టాల్లో కన్నీరై కరిగామే!
నువ్వు పంచిన కలిమి
లేముల్ల
కావడి కుండలమే అయ్యామే!
ప్రభూ
నువ్వు మలచిన బొమ్మలమనే కదా
పావులను చేసి ఆడావు
చదరంగం ఆటల్లో
ఎంత నిర్దయుడవు నీవు!
ఎంత నియంతవు ప్రభూ!
ప్రభూ
నువ్వు బాధించినా, వేధించినా
ఆడించినా నిన్ను పూజించామే!
ప్రభూ నువ్వు పన్నిన వలల్ని
ఛేదించామే!
నీ మాయా కడలిని ఈదామే!
చూశావా ప్రభూ...
నీ సృష్ఠి ఎంత గొప్పదో!
ఇకనైనా కళ్లు తెరిచి చూడు
భయం దేనికి
నిన్ను నిందించములే!

- రామానుజం సుజాత
కరీంనగర్
సెల్.నం.9701149302

నది మాట్లాడితే...
నా ముందర నిలబడి
నన్ను చూస్తుంటే భలేగుంది కదూ
అలల ఉయ్యాలలు, కెరటాల జంపాలలు
గవ్వల గలగలలు, చేప పిల్లల సయ్యాటలు..
గమ్మతుగున్నది కదూ!
నా తరంగాల నావలలో
బుడుబుంగలు, కొంగలు, ఊరవిష్కలు
జాతర చేసుకుంటాయి!
నాకు రెండు ముఖాలు లేవు
రెండు రంగులూ లేవు
నా అద్దంలాంటి మనసులో..
ఆల్చిప్పల అలకలు, ఆకురాళ్ల కోపాలు
పసి పిల్లల్లా సతాయించినా..
సుతారంగా సముదాయిస్తా!
నీళ్లాటకు పంపిస్తా
పుట్టుకతోనే పుట్టిన నడక నాది
ఉరకడం నా నైజం! ఉప్పొంగడం నా ఇజం!
ఊళ్లకు దప్పిక తీర్చడం
పైరుకు పాలివ్వడం నా అమ్మతనం
నా కడుపులో తొండం మిషన్లు దించినా
జీవంసాన్ని ఖజానాగా మార్చినా
గొంగట్లో ఎంటికల్లాగా
నా దుఃఖం ఎవరికి తెలుసు?
నా గదవను పైకెత్తి
నా ముఖానికేసి సూడుండ్రి
ఎందరో నాలో చిక్కుకున్నారట
బత్కుమీద ఆశను కక్కుకున్నారట
తిట్ల రాళ్లతో గాయం చేశారట
ఈమధ్యే నా వీపు మీద
వంతెన పరిచారట
మీరు తొక్కినా హాయిగుంటది
ముండ్లు గుచ్చినా మంచిగుంటది.. కానీ..
ఈ వంతెన
ఒక్క ప్రాణాన్నైనా కాపాడితే చాలు
ఒక్క మనిషినన్నా మనిషిగా చేస్తే చాలు
ఒక్కరన్నా నన్ను అర్థం చేసుకుంటే చాలు!!

- డా. ఉదారి నారాయణ
ఆదిలాబాద్, సెల్.నం.9441413666

ఆవిష్కరణ
వేకువనే పైరగలి ఓంకారనాదాన్ని
ఆలాపిస్తూ ప్రశాంతతనిస్తోంది!
గగన తలంలో పక్షులు
కిలకిలలతో విహరిస్తున్నాయ్!
తెరలుగ క్రమ్మిన మబ్బులు ఆకాశపందిరిలో
ఊయల తాగుతుంటే..
నెమలి పింఛం పువ్వు విప్పుకుని
ఒయ్యారంగ నాట్యమాడుతోంది!
భూతలమంతా పచ్చ తివాచి పర్చుకోగా..
జీవకోటి ప్రాణ వాయువునాస్వాదిస్తోంది!
ప్రకృతి శోభాయమాన నవ్వును విరబూయగ
పరిమళం సర్వవ్యాప్తమై గుప్పిస్తోంది!
వాతావరణ సప్తస్వరాలు
వీనుల విందుగావిస్తుంటే
కవిత్వం వంటల వల్లభుడై
పంచభక్ష పరమాన్నం రుచి చూపిస్తోంది!
తన ఆవిష్కరణలో ఇంత సౌందర్యం
ధర్మాచరణ ఒలుకుతున్నాయని
విశ్వకర్తకు సృష్టి, మహత్వ పూర్ణముగ
గోచరిస్తూ తన మోముపై చిరునవ్వు వెల్లివిరుస్తోంది!

- తోట సదానందము
మంచిర్యాల, ఆదిలాబాద్
సెల్.నం.9908594669

గజల్ మహిమ
గట్టు దాటితేనే గదా
అసలు గుట్టు తెలిసేది
తట్టుకుంటేనే గదా
అసలు మెట్టు ఎక్కేది
గంధపు చెక్కలే మోసినా
గాడిదకు పరిమళం తెలియదు
జీవన భారాలు యెన్ని మోసినా
జీవన మాధుర్యమే గదా!
సంచికైనా మంచికైనా
పిలుపే బంగారమే
పతనానికి ప్రగతికి
మాటనే ముఖ్యం గదా
లెక్క జేయకుంటే
నీవు లెక్కకేరావు సుమా!
నలుపెరుగనీ గురివిందనా
అలుపెరుగనీ జనబంధమే!
పిల్లవాని ఏడుపుకు అర్థమే పెద్దవారి ఏడుపు కులర్థమా?
భావనా శక్తివున్న గానీ
బావిలో పడడమెందుకు?
మామిడీ చెట్టుకు వుందీ
స్నేహమనే రసమస్తాననీ
దాని పిక్క విసరగానే
మరో మొక్క మొలిచేనూ.

- డా. జి.నర్సన్
వేములవాడ
సెల్.నం.9247303236

చిరునామా గల్లంతే!
నీరు నిలకడగా వుంటే కొలను
పారుతూ వుంటే నది
నిండుకుంటే సముద్రం
ఉప్పొంగుతే వరద బీభత్సం
మనసులా నీటికి
సదా చైతన్య స్వభావం!
మనసు నిశ్చలం, నిష్కల్మషం
భూమ్యాకాశాల వైశాల్యం!
సుంకుచితమై స్వార్థం జొరబడితే
మనసుకన్న ఇరుకైనది నాస్తి!
చపలం, గతి శూన్యం
నానా వేషధారణం!
మనసైనా, నీరైనా.. ఆవిరైతే
చిరునామా గల్లంతే!

- ఆచార్య కడారు వీరారెడ్డి
హబ్సీగూడ, హైదరాబాద్
సెల్.నం.7893366363

ఓ అమ్మా!
ఓ అమ్మా!
నువ్వు జ్వలిస్తూ మాకు వెలుగులు పంచావు!
మహావృక్షమై నీవిచ్చిన నీడలో
చల్లగా సేద తీరాము!
నువ్వు వర్షించే నీలిమేఘమై కరుగుతూ..
అమృత ధారలతో..
మా ఆర్తి తీర్చావు!
సదా మా అభివృద్ధినే కాంక్షించి..
మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు!
క్షమయా ధరిత్రిగా భాసిల్లుతూ
మా అందరి కష్టాలను..
నువ్వే అనుభవించావు!
మాకేమో సుఖాల తివాచీ పరిచావు!
నీ ఆశీస్సులతోనే..
నేడు మా ప్రతి అడుగు!
మమ్మల్ని ప్రయోజకుల్ని చేసిన..
ఓ అమ్మా నీ రుణం ఎలా తీర్చుకోగలం
నీ ప్రేమను కొలిచేందుకు..
విశ్వంలో లేదే పరికరం!

- డా. వంగల రాజ్యలక్ష్మి
కామారెడ్డి
సెల్.నం.9493391636

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్.
merupuknr@andhrabhoomi.net

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

- బి.కళాగోపాల్