యువ

కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరీక్షల్లో వందకు వంద మార్కులు సాధించడం ఈ రోజుల్లో పెద్ద ఘనతేమీ కాదు. మార్కులు అలా సాధించకపోతేనే వింత. అయితే ఇందుకూ మినహాయింపు ఉంది. అన్ని పరీక్షలూ అంత తేలిక కాదు. అలాంటి వాటిలో జిఆర్‌ఇ, జెఇఇ మెయిన్స్ వంటివి కొన్ని. వీటిలోనూ వంద శాతం మార్కులు సాధించి, అందర్నీ అబ్బురపరిచిన ఇద్దరు చిచ్చర పిడుగుల కథ ఇది.

360/360
జెఇఇలో కల్పిత్ ఘనత

కల్పిత్ వీర్‌వాల్...
గత వారం ఏ పేపర్‌లో చూసినా మొదటిపేజీలో ఇతని పేరే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన ఈ పదిహేడేళ్ల కుర్రాడు జెఇఇ మెయిన్స్‌లో 360కి 360 మార్కులు సాధించి ఔరా అనిపించాడు. ఈ ఘనత సాధించిన మొదటి విద్యార్థి ఇతనే కావడం విశేషం.
జెఇఇ మెయిన్స్‌లో సునాయాసంగా పాసవుతానని, మంచి మార్కులే సాధిస్తానని అనుకున్నాగానీ, నూటికి నూరు శాతం మార్కులు వస్తాయని మాత్రం అనుకోలేదన్నాడు కల్పిత్. తరగతి గదిలో పాఠాలను శ్రద్ధగా వినడం, టీచర్లు ఇచ్చిన నోట్స్‌ను అంతే శ్రద్ధగా చదవడం తన సక్సెస్‌కు కారణాలుగా అభివర్ణిస్తాడు కల్పిత్.
చిన్నప్పటినుంచీ కల్పిత్ చదువులలో ముందే ఉండేవాడు. గతంలో అతను ఇండియన్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌లో టాపర్‌గా నిలిచాడు. అలాగే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టిఎస్‌ఇ)లోనూ కల్పిత్ అగ్రస్థానం సంపాదించాడు. కల్పిత్ తండ్రి పుష్కర్ లాల్ వీర్‌వాల్ ఉదయ్‌పూర్ మహారాణా భూపాల్ గవర్న్‌మెంట్ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్నారు. తల్లి పుష్పా వీర్‌వాల్ ప్రభుత్వ టీచర్. కల్పిత్ అన్న ఏఐఐఎంఎస్‌లో మెడిసిన్ అభ్యసిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఐఐటిలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జెఇఇ మెయిన్స్ ఈసారి 11.8 లక్షల మంది విద్యార్ధులు రాశారు. సెకండ్ రౌండ్‌కూ, ఫైనల్ రౌండ్ (జెఇఇ అడ్వాన్స్‌డ్)కు 2.2లక్షల మంది ఎంపికయ్యారు.

340/340
జిఆర్‌ఇ టాపర్ మిహిర్

గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్..పొడి అక్షరాల్లో జిఆర్‌ఇ. అమెరికాకు ఎగిరిపోదామనుకుని కలలు కనే కుర్రకారుకి కలలో కూడా భూతంలా వెంటాడే అగ్ని పరీక్ష ఇది. అంతో ఇంతో మార్కులు సంపాదించి, అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకునే బాపతే ఎక్కువమంది. చెమటోడ్చినా మార్కులు రాలని ఈ పరీక్షలో నూటికి నూరుశాతం సాధించిన విద్యార్థుల్ని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. నాలుగేళ్ల కిందట అశ్విని నెనె అనే అమ్మాయి 340కి 340 మార్కులు సాధిస్తే, మళ్లీ ఇన్నాళ్లకి గత ఏడాది మిహిర్ జోషి అనే 21 ఏళ్ల కుర్రాడు ఈ ఘనత సాధించాడు.
ముంబయిలోని జెకె సోమయా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేసిన మిహిర్ జోషి చిన్నప్పటినుంచే చదువులో చురుకు. పైగా అపారమైన ఆంగ్ల భాషా పరిజ్ఞానం అతని సొంతం. స్వతహాగా చదువుపై ఆసక్తి ఉండటంతో అన్ని తరగతుల్లోనూ అతనే టాపర్. గత ఏడాది జులై 22న జరిగిన జిఆర్‌ఇ పరీక్షలో మిహిర్ 340కి 340 మార్కులు సాధించడంతో ఒక్కసారిగా అతని పేరు మార్మోగిపోయింది. అరుదైన ఘనత సాధించిన కుర్రాడిగా పత్రికలు అతన్ని ఆకాశానికి ఎత్తేశాయి. జులైలో జరిగిన పరీక్షకు జూన్ నుంచే మిహిర్ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. రోజుకు నాలుగు గంటల చొప్పున కేటాయించి, జిఆర్‌ఇకి వివిధ సబ్జెక్టులు ఔపోసన పట్టాడట. ఓవైపు కంప్యూటర్ సైన్స్‌లో ఫైనల్ ఇయర్‌కి ప్రిపేర్ అవుతూనే మరోవైపు జిఆర్‌ఇ మీద దృష్టి పెట్టడంతో ఒత్తిడి బాగా ఉండేదంటాడు మిహిర్. అయితే రెండింటికీ మధ్య సమతుల్యం సాధించడంతో ఆ ఒత్తిడిని అధిగమించగలిగానంటాడు. ‘జిఆర్‌ఇలో నెగ్గుకురావడం అంత తేలిక కాదు. పట్టుదల, ఆత్మవిశ్వాసం అవసరం. కష్టించే మనస్తత్వం ఉండాలి. నా వరకూ జిఆర్‌ఇ గట్టెక్కడానికి మాక్ టెస్టులు బాగా ఉపయోగపడ్డాయి. దాదాపు ఎనిమిది పూర్తిస్థాయి మాక్‌టెస్టులు రాశాను. ఈ అనుభవం ఎంతో ఉపకరించింది’ అంటూ వివరించాడు.
ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న మిహిర్, ఎమ్మెస్ పూర్తయ్యాక పిహెచ్‌డి చేస్తానంటున్నాడు. అమెరికాలో ఉండాలన్నది నా అభిమతం కాదు.. కాస్త అనుభవం సంపాదించాక మళ్లీ ఇండియాకు వచ్చేస్తాను. ఎందుకంటే నా మూలాలు ఇక్కడే ఉన్నాయి’ అనడం జీవితం పట్ల అతనికి గల సానుకూల దృక్పథాన్ని, మాతృభూమి పట్ల ప్రేమాభిమానాలను తేటతెల్లం చేస్తున్నాయి.