యువ

ఉద్యోగం వదిలి... సమాజ సేవలో తరిస్తూ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరిలాగే నివేదిత కూడా బిటెక్ చేసింది.
అందరిలాగే ఆమెకూ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
అందరిలానే ఉద్యోగం చేస్తూ, నా దారి నేను చూసుకుంటే సమాజానికి సేవ చేసేవారు ఎవరుంటారని భావించింది.
ఉద్యోగం వదిలి, సమాజ సేవలో పడింది.
అంతులేని మానసిక సంతృప్తిని సొంతం చేసుకుంది.
************
నివేదిత సొంత ఊరు బెంగళూరు. ఓ ఇంజనీరింగ్ కాలేజీనుంచి పట్టా పుచ్చుకుంది. వెంటనే ఉద్యోగమూ వచ్చింది. అయితే అపాయింట్‌మెంట్ ఆర్డర్ రావడానికి ఏడాది సమయం పడుతుందని కంపెనీ యాజమాన్యం ముందే చెప్పింది. దాంతో ఖాళీగా ఉండటమెందుకని నివేదిత ఏదైనా సమాజానికి ఉపయోగపడే పని చేయాలనుకుంది. బెంగళూరులో నడిచే ‘యూత్ ఫర్ సేవ’ అనే స్వచ్ఛంద సంస్థలో వలంటీర్‌గా చేరింది. చిన్నారులను తీర్చి దిద్దడం, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. నివేదిత అక్కడ పనిచేస్తుండగానే ఆమెకు మైసూర్‌లో పోస్టింగ్ ఇస్తున్నట్టు సదరు సాఫ్ట్‌వేర్ కంపెనీనుంచి పిలుపు వచ్చింది. వెంటనే నివేదిత మైసూరు వెళ్లి ఉద్యోగంలో చేరిపోయింది. అయితే వారాంతాల్లో మాత్రం బెంగళూరుకు వచ్చి, యూత్ ఫర్ సేవ కార్యక్రమాల్లో పాల్గొనేది. ఇలా ఏడాదిన్నర గడిచాక ఆమెలో ఏదో అసంతృప్తి మొదలైంది. తప్పు చేస్తున్నామనే భావన మనసును తొలిచివేయసాగింది. సమాజ సేవను వదిలిపెట్టడమే తాను చేస్తున్న తప్పుగా ఆమె తెలుసుకున్న మరుక్షణం నిమిషమైనా ఆలోచించకుండా ఉద్యోగం వదిలిపెట్టి, బెంగళూరు వచ్చేసింది. మళ్లీ యూత్ ఫర్ సేవ కార్యకలాపాల్లో పూర్తిస్థాయిలో నిమగ్నమవడం మొదలుపెట్టింది. అయితే నివేదిత చేసిన పనికి ఇంటా బయటా ఆమెకు అవమానాలు ఎదురయ్యాయి. బంగారం లాంటి ఉద్యోగం వదిలిపెట్టినందుకు తల్లిదండ్రులు మందలించారు. స్నేహితులు ఛీత్కరించారు. కానీ, నివేదిత తాను నమ్మిన దారిలోనే నడిచింది. ‘నాకు సమాజ సేవలోనే అంతులేని తృప్తి లభిస్తుందనే విషయం ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే తెలిసివచ్చింది. వారాంతాల్లో యూత్ ఫర్ సేవలో పనిచేస్తుంటే నాలో నాకే తెలియని ఉత్సాహం వచ్చేది. వారం రోజులూ పనిచేస్తే ఇంకెంత సంతోషం కలుగుతుందోనని భావించా. ఇప్పుడు ఉద్యోగం వదిలేసినందుకు నాకేం బాధగా లేదు. పైగా సమాజానికి అంతో ఇంతో సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పింది నివేదిత.
‘యూత్ ఫర్ సేవ’లో ఏడుగురు సభ్యుల బృందానికి నివేదిత నాయకత్వం వహిస్తోంది. మరికొన్ని బృందాలకు ఆమె మార్గనిర్దేశనం చేస్తోంది. యూత్ ఫర్ సేవలో మూడువేలమందికి పైగా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. వీరికి నైపుణ్యాలు మెరుగుపరచడం, విద్యా బోధన వంటి కార్యకలాపాల్లో నివేదిత ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
ఇప్పుడు నివేదిత ఆమె స్నేహితురాళ్లకు కూడా ఓ రోల్ మోడల్‌గా మారింది. ఆమెను చూసి, అనేకమంది ఆమె స్నేహితురాళ్లు కూడా సమాజసేవలో పాలుపంచుకుంటున్నారు.
తమ సంస్థ పేరులో ఉన్న యూత్ అనే పదానికి నివేదిత అర్థం చెబుతూ వాస్తవానికి ‘యూత్ ఫర్ సేవ’లో వలంటీర్‌గా చేరడానికి యువతే అవసరం లేదనీ, ఏ వయసు వారైనా రావచ్చనీ, కాకపోతే వారి మనసు ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉంటే చాలని అంటుందామె.

విద్యార్థులకు పాఠాలు చెప్తున్న నివేదిత