జాతీయ వార్తలు

విమాన ప్రమాదంలోనే నేతాజీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై 70 ఏళ్లుగా వివాదం కొనసాగుతున్నప్పటికీ, 1945 ఆగస్టు 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్టు 20 ఏళ్ల క్రితమే భారత్ ఒక నిర్ధారణకు వచ్చింది. ‘తాయ్‌హోకు (తైవాన్)లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించాడనే దానిలో అనుమానానికి ఎలాంటి తావూ లేదు. భారత ప్రభుత్వం ఈ వాదనను ఇప్పటికే అంగీకరించింది. దీనికి భిన్నంగా ఎలాంటి సాక్ష్యాధారమూ లేదు’ అని 1995 ఫిబ్రవరి 6న అప్పటి కేంద్ర హోం శాఖ కార్యదర్శి కె పద్మనాభయ్య సంతకంతో కూడిన ఒక కేబినెట్ నోట్ స్పష్టం చేసింది. ‘ఒకవేళ కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలకు భిన్నాభిప్రాయం ఉంటే హేతుబద్ధమైన ఆధారాలతోకాక సెంటిమెంట్ కారణంగానే వారు అలా భావిస్తూ ఉండవచ్చు’ అని కూడా నోట్‌లో పేర్కొన్నారు. ఇదిలావుంటే, నేతాజీ 119వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విడుదల చేసిన వంద రహస్య ఫైళ్లలో ఈ కేబినెట్ నోట్ కూడా ఉంది. 16600 పేజీలకు పైగా ఉండే ఈ డాక్యుమెంట్లలో అప్పటి బ్రిటీష్ కాలం మొదలుకొని మొన్న మొన్న అంటే 2013 దాకా ఉన్న అనేక చారిత్రక డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ప్రధాని మోదీ శనివారం నేషనల్ ఆర్కివ్స్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఏఐ)లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ పత్రాలను బహిర్గతం చేసినప్పుడు నేతాజీ కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రులు మహేశ్ శర్మ, బాబుల్ సుప్రియో కూడా ఉన్నారు. బోస్‌కు సంబంధించి బహిర్గతం చేసిన పత్రాలన్నిటినీ భద్రపరచడం కోసం ఎన్‌ఏఐ ఒక ప్రత్యేక వెబ్‌సైట్ కూడా తెరిచింది. మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు బహిర్గతం చేసిన రహస్య ఫైళ్లను పరికిస్తూ, మొత్తం భవనమంతా తిరిగి చూస్తూ దాదాపు అరగంట సేపు ఎన్‌ఏఐలో గడిపారు. ప్రధాని నేతాజీ కుటుంబీకులతో మాట్లాడారు. గత ఏడాది అక్టోబర్‌లో ప్రధాని నేతాజీ కుటుంబీకులను కలిసి ఆయనకు సంబంధించిన రహస్య పత్రాలను ప్రభుత్వం బహిర్గతం చేస్తుందని ప్రకటించిన తర్వాత, ఈ రహస్య దస్త్రాలను బహిర్గతం చేయడం గమనార్హం. గత డిసెంబర్ 4న మొదటి విడతగా 33 రహస్య పైళ్లను ప్రధాని బహిర్గతం చేసిన అనంతరం వాటిని ఎన్‌ఏఐకి బదిలీ చేయడం తెలిసిందే. కాగా, ప్రధాని తీసుకున్న చర్యను తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని, ఇది భారత దేశంలో పారదర్శకతకు సంబంధించి చిరస్థాయిగా నిలిచిపోయే రోజని కార్యక్రమంలో పాల్గొన్న బోస్ కుటుంబం తరఫు ప్రతినిధి, నేతాజీకి వరసకు మునిమనవడైన చంద్రకుమార్ బోస్ చెప్పారు. అయితే వాస్తవాన్ని దాచి ఉంచడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొన్ని ఫైళ్లను ధ్వంసం చేశారని తాము భావిస్తున్నామని, అందువల్ల రష్యా, జర్మనీ, బ్రిటన్, అమెరికాలోవున్న ఫైళ్లను కూడా విడుదల చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తాము భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. గత ఏడు దశాబ్దాలుగా ఈ క్షణం కోసం బోస్ కుటుంబం, మొత్తం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని కార్యక్రమంలో పాల్గొన్న నేతాజీ మరో సన్నిహిత బంధువు అర్ధేందు బోస్ వ్యాఖ్యానించారు.
ఈ పరిణామంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ నేతాజీకి జాతి నేత హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. నేతాజీ అదృశ్యం గురించి నిజాలు తెలుసుకునే హక్కు దేశ ప్రజలకుందని డార్జిలింగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు. కాగా నేతాజీకి సంబంధించిన అన్ని రహస్య పత్రాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తూ, ప్రధాని ఈ ఫైళ్లను బహిర్గతం చేసిన తీరు ఆయన ఉద్దేశాలపై అనుమానాలను లేవనెత్తుతోందన్నారు. అన్ని రహస్య ఫైళ్లను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ ఇదివరకే డిమాండ్ చేసిందని, ఎందుకంటే ఒక వివాదాన్ని సృష్టించి, తప్పుడు రాజకీయ ప్రచారం ద్వారా దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ అన్నారు.