రచ్చ బండ

విపక్షాల విలవిల..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో విపక్షాలు విలవిలలాడాయ. ఎన్నికల ముందు ప్రచార సమయంలో ప్రతిపక్షాలన్నీ డాంబీకాన్ని ప్రదర్శించాయి. గ్రేటర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టిఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని విపక్షాలన్నీ మండిపడ్డాయి. గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లు గెలుపొందుతామని, మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు అంటే వంద సీట్లు గెలువకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని విపక్షాల నేతలు సవాళ్ళు విసిరారు. వంద సీట్లు గెలుపొందుతామని కార్యకర్తల్లో నూతనోత్సహం నింపేందుకు మంత్రి కెటిఆర్ చెప్పిన మాట నిజం. మేయర్ స్థానాన్ని టిఆర్‌ఎస్ సాధిస్తుందన్న విషయంలో సవాలు విసిరిన మాట కూడా నిజం. కానీ కెటిఆర్ వంద సీట్లు అన్నారంటూ విపక్షాలు ప్రతి సవాల్ చేశాయి. దీనిపై మంత్రి కెటిఆర్ వివరణ ఇచ్చినా, విపక్షాలు వినిపించుకోలేదు. ఏదైతేనేం వందకు ఒక్క సీటు తక్కువగా టిఆర్‌ఎస్ విజయదుందుభి మోగించింది.
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా విపక్షాల పరిస్థితి మారింది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ పరిస్థితి మరీ దారుణం. 2014 సంవత్సరంలో అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి 15 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకోగా, ఇప్పుడు ఆ పార్టీ సంఖ్య ఐదుకు పడిపోయింది. అందులో ఒక ఎమ్మెల్యే (ఆర్. కృష్ణయ్య) పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగానే ఉన్నారు. ఫలితాలు వెలువడగానే పార్టీ శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే వివేక్ గులాబీ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీని రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ ముఖ్యులతో చర్చించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి ఆటు-పోట్లు ఎన్నో చూశాం, పార్టీ నేతలు వెళ్ళినా, ఒక్క కార్యకర్త కూడా వెళ్ళడం లేదని చంద్రబాబు వారందరికీ మనోధైర్యం నింపేందుకు ప్రయత్నం చేశారు. సమావేశంలో అద్భుతంగా ప్రసంగించిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సమావేశం ముగిసిన వెంటనే రాష్ట్ర మంత్రులు కె. తారక రామారావు, టి. హరీష్ రావుతో మంతనాలు జరిపి ‘కారు’ ఎక్కి, చంద్రబాబుకు, టిడిపి నేతలకు షాక్ ఇచ్చా రు.
హవ్వ! రాజకీయాలంటే ఇంత దారుణంగా ఉంటాయా? మాట్లాడిన మరుక్షణమే శతృపక్షంలో చేరిపోతారా? అనే విమర్శలు టిడిపి నేతలు, కార్యకర్తల నుంచి లేకపోలేదు. గత ఏడాది ఎమ్మెల్యేల కోటా నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే వద్దకు డబ్బులతో వెళ్ళి పట్టుబడినప్పుడు ఇదేమి రాజకీయం అని సొంత పార్టీ నేతలు వ్యాఖ్యానించి ఉంటే, ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యకు బలం చేకూరేది. తన వరకు వస్తేగానీ తెలియదన్నట్లు ఇప్పుడు టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఇప్పుడు పార్టీ నేతలను, కార్యకర్తలను కాపాడుకోవడంలో నిమగ్నమయ్యారు. పార్టీని ఎప్పుడు ఎవరు వీడుతారో తెలియని పరిస్థితి నెలకొంది. పార్టీని వీడి వెళుతున్న వారి వెనుక అసలు కారణం ఉందని, చంద్రబాబుకు తెలిసే ఇదంతా జరుగుతున్నదన్న వాదన కూడా ఉంది. చంద్రబాబు రాజనీతిజ్ఞుడని, ఏ కారణం లేకుండా ఇలా జరగదని పార్టీ నాయకులు కొందరు చెప్పుకుని తృప్తి పడుతున్నారు. సొంత పార్టీ నాయకులు వెళుతుంటే, పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం పెరుగుతుంటే ఇంకా రాజనీతిజ్ఞత ఏమి ఉంటుంది?
కాంగ్రెస్ పార్టీ ఒకడుగు ముందుకేసి మేయర్ స్థానానికి అభ్యర్థినీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తమ ఓటమిని అంత ఈజీగా అంగీకరించలేదు. ఈవీఎంలపై అనుమానాన్ని వ్యక్తం చేసింది. బిజెపి తమ ఓటమిని ఓటర్లపై నెట్టింది. తాజాగా కాంగ్రెస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ గూటిలో చేరకపోయినా, ఆ పార్టీ ముఖ్య నేతల్లో భయం లేకపోలేదు. టిడిపి తర్వాత టిఆర్‌ఎస్ దృష్టి కాంగ్రెస్ పైనే ఉంటుందన్న అనుమానం ఆ పార్టీ వారిని వెంటాడుతోంది. ఇప్పటికే దానం నాగేందర్ అలకపాన్పు ఎక్కారు. కాంగ్రెస్‌కు బడుగు, బలహీనవర్గాలు దూరమయ్యాయని, అందుకే టిఆర్‌ఎస్ విజయం సాధించిందని దానం మనోభావం. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రెండు పడకల గదుల ఇళ్ళ వంటి వాటితో ప్రజలు ఆకర్షితులయ్యారని ఆ పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. బిజెపికి గతంలో జిహెచ్‌ఎంసిలో ఐదు సీట్లు ఉంటే, ఈ దఫా ఒక్క సీటు తగ్గింది. గ్రేటర్ పరిథిలో ఎమ్మెల్యేలు ఐదుగురు గెలుపొందినా, కార్పొరేటర్లు నలుగురే విజయం సాధించారు. గతం కంటే ఈ దఫా కార్పోరేటర్ల సంఖ్య తగ్గడానికి ఓటింగ్ శాతం తగ్గడమేనని ఆ పార్టీ సమర్థించుకుంది. బిజెపి నేతలు కూడా తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకోవడంలో నిమగ్నమయ్యారు. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్నందున తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు సమకూర్చడంలో తమ వంతు ప్రయత్నం చేసి, ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటామన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలు ముందడుగు వేస్తున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు చిర్రెత్తిందంటే ‘కిలో మీటరు అడుగున పాతి పెడతాం..’ అంటూ హెచ్చరిస్తుంటారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత విపక్షాల నాయకులు కొందరు ఆ మాటలను గుర్తు చేసుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో నూతన విజయోత్సవంతో ఉన్న టిఆర్‌ఎస్ వరంగల్ కార్పొరేషన్ తదితర ఎన్నికలపై దృష్టి సారించింది.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి