డైలీ సీరియల్

బంగారుకల- 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నాదేవికి నిద్రపట్టడంలేదు. కళ్ళు మూసినా, తెరిచినా ప్రభువు సుందర రూపమే మెదులుతోంది. కదిలితే తల్లికి నిద్రాభంగం అవుతుందని అలాగే కళ్ళు మూసుకొని పడుకుంది.
వాతావరణం వసంత మనోహరంగా వుంది. కిటికీలోంచి పిల్లగాలి అల్లరి పెడుతోంది. అది కొంత ఊరట కల్గిస్తున్నా మరింత నిట్టూర్పుకు కూడా కారణమవుతోంది. నిండు పేరోలగంలో కొలువుతీరిన రాయలమూర్తి గంభీర రాజసంతో ధీర విలసితంగా ఉంది. నాడు తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో తన నృత్యం చూసిన కృష్ణరాయని కళ్ళల్లో తొణికిసలాడిన ఆ భావం ఏమిటో పూర్తిగా అర్థం కావటంలేదు.
అది ప్రేమా? ప్రశంసా, అనురాగమా, అభిమానమా? భగవానుని సన్నిధిలో ప్రభు దర్శనంవల్ల తన జీవితంలో ఎటువంటి మార్పు జరగనున్నదో ఆ నాట్య మయూరికి అవగతం కాలేదు.
ఏమో! చల్లని తల్లి అలివేలు మంగమ్మ అనుగ్రహంతో రాయలు తనను అంగీకరిస్తే ఈ జన్మకదే వరం. ఇదంతా శ్రీకృష్ణదేవరాయలు ప్రభువు కాకముందు. కానీ ఇప్పుడు ఆయన విజయనగర సామ్రాజ్యాధీశుడు. ఒక దేవదాసి చేయి పట్టుకుంటాడా? ఒకవేళ ప్రభువు అలా అనుకున్నా అప్పాజీ అంగీకరిస్తారా! అప్పాజీ మాటను ప్రభువు శిరసావహిస్తాడు కదా. ఎపుడు నిద్ర పట్టిందో ఆమెకే తెలీదు.
చిన్నాదేవి పారవశ్యంతో నృత్యం చేస్తున్నది. దేవాలయ ప్రాంగణంలో పలువురు ప్రముఖులున్నారు. ఆమె దృష్టి మాత్రం మురళీ మోహనుడి మీదే కేంద్రీకృతమై వుంది. ఇదేమిటి! స్వామి స్థానంలో కృష్ణరాయలు చిరునవ్వులతో తనకేసి చూస్తున్నాడు. రారమ్మని చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు.
‘‘స్వామీ పూజా ప్రసూనమై నీ
పద పద్మముల వ్రాలెదను
ఎన్ని జన్మలైన నినె్నడ బాయను స్వామీ!’’
చిన్నాదేవి నర్తిస్తూ మురళీ మోహనుడి వెపు అడుగులేస్తోంది. అందరికీ ఈ వేళ చిన్నాదేవి ధోరణి కొత్తగా ఉంది. సమ్మోహనకరంగా ఆరాధనా నృత్యం చేస్తూ అటు స్వామిని, ఇటు దేవాలయ ప్రేక్షకులను అలరించే ఆ కళాతపస్విని ఇవ్వాళ పూర్తిగా స్వామి తప్ప మరో ప్రపంచం పట్టనట్లు ఏదో మైకం కమ్మినట్లు ప్రవర్తిస్తున్నది.
విగ్రహంలోంచి కృష్ణదేవరాయలు తనకేసి చేతులు చాపి వచ్చేశాడు. ఆమె అతని విశాల వక్షస్థలంపై వాలిపోయింది. పెదవులు పాటను గుసగుసలాడుతున్నాయి. స్వామి చేతుల్లో బందీ అవటం హాయిగా ఉంది. సిగ్గుతో తలెత్తి రాయల మొహం కేసి కూడా చూడలేకపోతున్నది. ఆమె అణువణువూ అతని వశమై మనసు పరవశమైంది. కళావతంసుడు రాయలు కళాకారిణి చిన్నాదేవి మనసులు ఐక్యమయిన అద్భుత అనుభూతి. చుట్టూ ఎందరున్నా ఎవ్వరూ లేని ఏకాంత భావనా ప్రపంచం అది.
కల చెదిరింది. ఆశ్చర్యపడి చుట్టూ చూసింది చిన్నాదేవి. పక్కన తల్లి గాఢ నిద్రలో వుంది. ఆమెకీ అనుభూతి కొత్తది. తాను ఎవరి బిడ్డో ఏమో ఈ తల్లి పెంచి నాట్యం నేర్పింది. చిన్నతనం నుంచి ‘నీ జన్మ కృష్ణార్పణం’ అన్న అమ్మ మాట తలదాల్చి జీవిస్తున్న చిన్నాదేవి మనసీనాడు చెదిరిపోతున్నది. రాయలు ఎంత అందగాడు. అచ్చు కృష్ణునిలా.. తప్పు తప్పు! కృష్ణుడు భగవంతుడు. మరి రాయలు కూడా భగవంతుని అంశే! ప్రభువు అంటే విష్ణువే కదా! తన పిచ్చిగాని ప్రభువు తనని స్వీకరిస్తాడా! తన జన్మ ఎలాంటిదో ఆయనకి తెలుసా? దేవదాసీ వ్యవస్థలో దేవాలయాలలో ప్రభువుల సమక్షంలో మాత్రం నాట్యం చేసే నర్తకిని ప్రభువు రాణిగా చేసుకుంటాడా! కలతగా నిద్ర పట్టింది చిన్నాదేవికి.
***
‘‘ఏయ్ మంజరీ ఆగు!’’ చంద్రప్ప మంజరిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
మంజరి అతనికి చిక్కినట్లే చిక్కి జారిపోతోంది.
‘‘ఇలా అయితే నేను నీతో మాట్లాడను’’ అతను బుంగమూతి పెట్టుకొని ఓ చంద్రకాంత శిల మీద కూర్చుండిపోయాడు. దిగువగా ఉన్న శిలమీద కూర్చుని అతని ఒడిలో తన్మయంగా తలవాల్చి కూర్చుంది మంజరి.
ఆ ఉద్యానవనంలో వెనె్నల్లో చెట్ల పూలు కొత్తగా మిలమిల్లాడుతున్నాయి. చంద్రప్ప వేణువును తీసి పాడటం మొదలుపెట్టాడు. అతనికి తెలుసు మంజరినెలా అలరించాలో! నాగస్వరానికి వివశరాలైన నాగినిలా ఆమె శరీరమంతా ప్రకంపనలే.
చంద్రప్ప సమక్షంలో.. మంజరి నర్తనం ముందు ఇంద్రసభలో అప్సరసల నృత్యాలు కూడా సరిచాలవు.
అతని వేణువు నింపుకుంటున్న ఊపిరి విన్పించే పాటను ఆమె కాలి అందియెలు నాట్యంగా అనువదించుకుంటున్నాయి. ఆ నాదానికి ఈ పాదం తోడయి ఇరువురి శరీరాలు తన్మయంగా పరవశిస్తున్నాయి. అలా ఎంతసేపు గడిచిందో వాళ్ళకే తెలీదు. రెండు నాగుపాములు జంటగా పెనవేసుకున్నట్లు.
రాత్రి ఒక జాము దాటింది.
పహారా నగారా మోగింది. చంద్రప్ప ఒళ్ళో తలపెట్టి పడుకున్న మంజరి ఉలిక్కిపడింది.
‘‘చంద్రా! చాలా పొద్దుపోయింది.. నీ దగ్గర ఉంటే కాలం ఆగిపోతుంది. ఇపుడు ఇంటికి వెళ్ళాక అమ్మ నన్ను చంపేస్తుంది’’ అంది భయంగా.
‘‘్భయమెందుకు? నువ్వు నా దానివి.. నా నుండి నినె్నవరూ దూరం చేయలేరు. మంజరీ! నీ నృత్యం నా గానానికి ఊపిరి. మీ అమ్మకి చెప్పేయి మనం వివాహం చేసుకుందాం’’ చంద్రప్ప ఆమె ముంగురులు సవరిస్తూ వెనె్నల కాంతిలో తళతళలాడే ఆమె కనుపాపల్లో తన బింబాన్ని చూసుకుంటూ చిలిపిగా నవ్వాడు.
ఆ నవ్వు ఆమె మనసులో పులకింతలు రేపింది. పెళ్లి మాట వింటూనే మంజరి నిటారుగా అయింది.
‘‘నీకు తెలీదు చంద్రా! చిన్నాదేవిగారిని ప్రభువు కోరుకుంటున్నారని తెలిసినప్పటినుంచి మా అమ్మకి కూడా అదే ఆశ పుట్టింది. ననే్న రాజప్రముఖుడెవరైనా చేసుకుంటే రాజవైభోగాలన్నీ దక్కుతాయని ఆమె ఆలోచన. నీ లాంటి సంగీతకారుడికి నన్నిచ్చి పెళ్లి చేయదుగాక చేయదు’’ నిరాశగా అంది మంజరి.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి