డైలీ సీరియల్

బంగారుకల - 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నా బొందిలో ప్రాణం వున్నంతవరకు నేను నిన్ను వదులుకోలేను మంజూ! మనది జన్మజన్మల బంధం’’ ఆమెను కౌగిట చేర్చుకున్నాడు చంద్రప్ప.
మంజరి అతన్ని వదలలేక వదలలేక వెళ్లింది.
అది దేవదాసీల వీధి. ఆ భవనాల్లోంచి అనుక్షణం నృత్యగానాలు విన్పిస్తూ ఉంటాయి. మంజరి తల్లి కృష్ణసాని ఆ వీధిలోకెల్లా సంపన్నురాలు. మంజరికి చిన్నతనంనుంచి నృత్యం, గానం, నేర్పింది. మంజరి భగవంతుని కైంకర్యంగా నర్తిస్తున్న కృష్ణసాని కళ్ళు మాత్రం ధనవంతుల కోసం వెదుకుతున్నాయి. ఈమధ్య మంజరి చంద్రప్పతో పొద్దుపుచ్చటం కృష్ణసాని దృష్టికి రాకపోలేదు. సమయం సందర్భం చూసి కుమార్తెను హెచ్చరించాలనుకుంది.
తల్లి నుంచి ఎటువంటి పెడసరపు మాటలు వినాల్సి వస్తోంనోనన్న భయంతో మంజరి మెల్లగా తన కక్ష్యవైపు నడిచింది. పర్యంకం మీద కృష్ణసాని అరుణ నేత్రాలతో కుమార్తెకేసి తీక్షణంగా చూసింది.
మంజరి భయభీత అయి కంపించింది.
‘‘అమ్మా! ఈవేళప్పుడు’’ అర్థోక్తిలో ఆగిపోయిందా బేల.
‘‘అదే అడుగుతున్నాను.. ఈ వేళప్పుడు ఎవరితో తిరుగుళ్ళు? ఎక్కడ నించి?’’ కృష్ణసాని తీవ్ర స్వరంతో అడిగింది.
మంజరి మాట్లాడలేదు. తల వంచుకుని నిలబడింది.
‘‘ఆ చంద్రప్ప దగ్గర్నుంచేనా’’ కరకుగా ఉందా స్వరం.
అవునన్నట్లు తలూపింది మంజరి.
‘‘నేను నీకు గతంలో ఒకసారి చెప్పాను. ఆ ఉన్మత్త గాయకుడితో తిరిగితే లాభం ఏముండదని. ఇదే నీకు ఆఖరుసారి చెప్తున్నాను. నువ్వు అతన్ని మర్చిపో! చిన్నాదేవిలా నీక్కూడా ఓ ప్రభువు లేదా ప్రభువంతటివాడు’’ తల్లి మాటలు పూర్తి కాకుండానే మంజరి ఆపింది.
‘‘నేను చంద్రాని ఇష్టపడుతున్నానమ్మా! అతనే నా జీవితేశ్వరుడు’’ ఆమె స్వరం మెల్లగా ఉన్నా దృఢంగా వుంది.
కృష్ణసాని తోక తొక్కిన కృష్ణతాచులా లేచింది.
‘‘కళ్ళు పైకెక్కినాయా! చిన్నాదేవి వైభోగం చూశావా! శ్రీకృష్ణదేవరాయ ప్రభువు తాను రాజు కాకముందే ఆమెను కోరాడు. మాట ఇచ్చాడు. ప్రభువైతే కూడా ఆమెని మరువడు. పట్ట్భాషేకం జరుపుకోబోతున్న రాయల మనసులో పట్టమహిషి చిన్నాదేవే! ఎంత అదృష్టవంతురాలామె. నేనెంత కలలు కంటే మాత్రం ఏం లాభం!’’ నిట్టూర్చింది నిస్సహాయంగా కృష్ణసాని.
‘‘అమ్మా! ఇతరులతో మనకెందుకు? అది ప్రభువు ఆదరం. నన్నూ, చంద్రాని ఆశీర్వదించు. కళాపోషకుడైన ప్రభువు నీడలో మా జీవితాలు తరిస్తే నాకదే పదివేలు’’ మంజరి నచ్చచెప్పింది.
‘‘నీ మాట నీదేనా! ఇక పడుకో! రేపటినుంచి నేను చెప్పినదే జరగాలి. మరో ఆలోచనకు తావు లేదు’’ విస విసా బయటకు నడిచింది కృష్ణసాని.
మంజరి విశ్రమించిందే గానీ మనోహర వేణుగానం మదిలో ఆ గదిలో విన్పిస్తూనే ఉంది. ఆమె కదే ఏకాంత సేవాభాగ్యం.
****
నర్సప్ప నాయకుని మరణకాలానికి కృష్ణరాయని పట్ట్భాషేక కాలానికి, విజయనగర సామ్రాజ్య రాజకీయ పరిస్థితులు అంత బాగా లేవు. సరిహద్దు రాజ్యభాగాలు కోల్పోయి రాజ్యం అంతఃబహిర్ శత్రువులతో, అంతఃకలహాలతో, బహ్మానీ గూఢచారులతో నిండి సంక్షోభంలో వుంది. ఈ పరిస్థితులలో ప్రబల రాజాధిరాజ, రాజ పరమేశ్వర, వీర ప్రతాప శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరసు ధీయుక్తితో చక్రవర్తిగా పట్ట్భాషిక్తుడౌతున్నాడు.
ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల పట్ట్భాషేక మహోత్సవం జరుగుతున్నది.
శ్రీజయంతినాడు జరుగుతున్న ఉత్సవానికి కర్ణాటకాంధ్ర దేశాల ఏలికలకు ఆహ్వానాలు అందాయి.
ఆనాడు విజయనగరం వికసించిన వనవాటికలా సుగంధ పరిమళాలతో విలసిల్లుతున్నది. అనేకమంది రాజులు, పండితులు, కవులు, జ్యోతిష్కులు విచ్చేశారు. నగరాన్ని అరటి బోదెలతో, మామిడి తోరణాలతో అలంకరించారు. బ్రాహ్మణ శ్రేష్టులు గ్రహశాంతి, హోమయజ్ఞాలు చేశారు. శుద్ధోదక స్నానం చేసిన రాయలు నూతన వస్త్రాలంకార భూషితుడై మరో విష్ణువులా భద్రాసనంపై శోభిల్లుతున్నాడు. వేద పండితుల మంత్రోచ్ఛాటనంతో బంగారు కలశంలోని సకల నదీ జలాలతో రాయలకు సంప్రోక్షణ చేశారు. అందరి జయజయధ్వానాల మధ్య శ్రీకృష్ణదేవరాయల కిరీట ధారణ జరిగింది.
రాజోద్యోగుల పరిచయం, రాజధానీ సందర్శనం అయినాక రాయలు తల్లికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నాడు. మహామంత్రి, పితృసమానులు అప్పాజీ, గురువు వ్యాసరాయల ఆశీస్సులు పొందాడు. కవులు పద్యాలతో ఆశీస్సులందించారు. శ్రీకృష్ణదేవరాయల పట్ట్భాషేక మహోత్సవం జరిగాక అప్పాజీ మరోసారి రాయల్ని గౌరవించి కౌగిలించి ఆశీర్వదించాడు. ఈ ఉత్సవానికి గుర్తుగా విరూపాక్ష మందిరంలో ‘రంగనాథ మందిర గోపురం’ నిర్మించబడింది.
ప్రజలంతా అప్పటికే కృష్ణరాయని గురించి విన్నారు. అతనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. దక్షిణాపథాన మహత్తర గిరి దుర్గం విజయనగరం. ఆ పేరును సార్థకం చేయటానికి రాయలు అనేక చర్యలు తీసుకున్నాడు.
రాచకార్యాలతో వ్యస్తుడైనా రాయలకు చిన్నాదేవి అనుక్షణం గుర్తువస్తున్నది. ఆమెని పట్టమహిషిని చేస్తానన్న తన వాగ్దానం పదే పదే ఆయన స్మృతి పథంలో మెదుల్తూ అది నెరవేర్చటానికి వేగిరిపడుతోంది.
***
‘‘చిన్నా! ఏమిటి ఈ బేలతనం!’’ చిన్నాదేవికి చేరువగా వచ్చి ఆమె మునిగడ్డం పట్టి ఎత్తి కళ్ళలోకి చూసింది మంజరి. ఆ కళ్ళు తామర కొలనులా ఉన్నాయి.
‘‘అవును మంజరీ! నీవీవేళ బాగా గుర్తొస్తున్నావు సుమా! మనిద్దరం ఒకే గురువు దగ్గర నాట్యం నేర్చాం. నా పాదాలు నేడెందుకో మొరాయిస్తున్నాయి. మనం నేర్చకున్న కృష్ణ నృత్యాన్ని ఓసారి ప్రదర్శిస్తావని’’.
చిన్నాదేవి స్వరంలో తెలియని ఆవేదన, అలసట.
నిరంతరం రాయల గురించిన ఆలోచనలతో ఆమె మనసు వడిలిపోయింది.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి