భక్తి కథలు

హరివంశం 46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతలో రాత్రి అయింది. మెల్ల మెల్లగా చీకట్లు ఆవరించాయి.
హరి వచ్చాడని తెలుసుకున్నాయి ఆంబోతులు. అవి క్రోధంతో రెచ్చిపోయినాయి. ఆగ్రహంతో ఘూర్ణిల్లాయి. కుంభకుడి ఆలమందలలో భీతాహం సృష్టించాయి. చూడి ఆవులను, పాడి ఆవులను, ఈన మోసిన ఆవులను, కెయ్యలను, ఇంకా పచ్చి గడ్డికూడా కొరకనేరని పసిదూడలను కొమ్ములతో పొడిచి, గిట్టలతో మట్టి, రక్తపుటేరులు పారించి మహాభయంకర ఆర్తరవాలు సృష్టించాయి. పశుల గోష్ఠాలతో తనివి చెందక, వ్రజంలోని గోపాలుర ఇళ్ళపై దాడిచేశాయి. వాళ్ళ ధన ధాన్య కనక వస్తు వాహనాదులను ధ్వంసంచేశాయి. తలుపులు కూలదోశాయి. పందిళ్ళు భగ్నం చేశాయి. గరిసెలు విరగదోసాయి. గాదెలు కుమ్మివేశాయి. ఇళ్ళ వాళ్ళంతా హాహారవాలు చేసేట్లు రంకెలు పెట్టాయి. నీలను పెళ్ళాడుదామని వచ్చిన వీరులంతా సందులు గొందులు వెదుక్కొని ఒదిగిపోయినారు. ఎట్లానో తెల్లవారింది.
అపుడు కుంభకుడు దేశ దేశాలనుంచి వచ్చిన గోపవీరులనంతా సమావేశపరచాడు. తన కూతురును పెళ్లికూతురులాగా చక్కగా అలంకరింపజేశాడు. ఆ తల్లిని కూడా సభ వారంతా చూసేట్లు ఒక వేదికపై నిలువచేశాడు. నంద గోప కుటుంబంతో కృష్ణ బలరాములు కూడా అక్కడ ఒకవైపున అధివసించి ఉన్నారు. అపుడు కుంభకుడు గంభీరంగా ఇట్లా ప్రకటించాడు ‘సకల గోపవీరులారా! మీరంతా చూశారు కదా! రాత్రి జరిగిన బీభత్సం. అవి ఆంబోతులు కావు. భూమిని భరించే దిగ్గజాలు భూమిమీదికి వచ్చినట్లున్నాయి. మహా పర్వత గుహలలో నిర్భయంగా వసించే క్రూర సింహాలో ఏమోను! విలయ కాలాగ్నులు ఈ రూపం ధరించి వచ్చాయేమో! వీటిని దమింపచేయటం మా తరం కాలేదు. ఇంతవరకు ఎవరి తరమూ కాలేదు. ఇవి వృషభాలు కావు, మహారాక్షసులు. మాయారూపం ధరించి వచ్చిన యక్షులో, గంధర్వులో, పిశాచాలో, జగద్విలయం పుట్టించటానికి దాపురించాయి. వీటిని అదుపు చేయకపోతే, వీటివల్ల కలుగుతున్న మహాక్షోభం నివారింపచేయలేకపోతే మిథిలాపురాధీశుడు నాకు దండన విధిస్తానని హెచ్చరించాడు. నాకు ఏం చేయటానికీ పాలుపోలేదు. అందువల్ల మిమ్ములందరినీ ఇక్కడకు ఆహ్వానించాను. ఈ నా తల్లి వీర్యశుల్క. ఎవరైతే ఈ ఆంబోతులను అణచివేస్తాడో ఆ వీరాధివీరుణ్ణి పెళ్ళాడుతుంది నా బంగారు తల్లి అని’’ కుంభకుడు పలకగానే సభలో ఉన్నవారందరికీ జనక మహారాజు అలనాడు సీతా స్వయంవరం వేళ పలికిన పలుకులు గుర్తువచ్చాయి.
అపుడేమో ఆయన శివుడి విల్లును మోపెట్టటం పణంగా విధించాడు. ఇపుడీయన ఆబోతులు ఉక్కణచటం షరతుగా విధిస్తున్నాడు అని ఒకరితో ఒకరు గుజగుజలు పోయినారు. అయితే నీలను చూస్తుండగా వాళ్ళ మతులు పోతున్నాయి. గుండెలు దడ దడలాడుతున్నాయి. నీలను చూసికాదు, ఆంబోతులు తమను ఏం చేస్తాయోనని, అవి చూడబోతే యముడి కాల పాశాలలాగా ఉన్నాయి. ప్రచండ గదాదండాలాగా ఉన్నాయి. వాటిని ఎదిరించి ప్రాణాలతో బతికి బయటపడటం దుర్లభం. ఒకవైపు ఆశ, మరొకవైపు హతాశ.
ఈ విధంగా డోలాందోళన చిత్తుడైనారు నీల మీద ఆశ పెట్టుకున్నవారు. ఏవేవో కలలు కన్నవారు. వాళ్ళంతా చిత్ర ప్రతిమలైపోనారు. స్తంభీభూత దేహులైనారు. నిరుత్సాహం వాళ్ళను నిలువెల్లా వశం చేసుకుంది. నిశే్చష్టులైపోయినారు. నిర్గుండె పడిపోయినారు.
అపుడు ఘోషవంతుడనే నందగోపుడి బంధువు ఒకడు ముందుకు వచ్చాడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు