డైలీ సీరియల్

బంగారుకల 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయంత్రం యుద్ధ విరమణానంతరం ప్రభువు కవి పండిత గోష్ఠితో మానసోల్లాసం పొందుతారు. అల్లసాని పెద్దన, నందితిమ్మన వంటి కవులు కూడా వస్తున్నారు. నా గానంతో ప్రభువు అలసట ఉపశమిస్తే అంతకంటే మనకి కావలసినదేముంటుంది మంజరీ!’’ ఆమె చుబుకం పట్టి చెప్పాడు చంద్రప్ప మృదువుగా.
కళ్ళల్లో నీళ్ళు కనపడకుండా తల దించుకుంది మంజరి.
‘‘నేనూ వస్తాను. నా నాట్యంతో ప్రభువుల్ని అలరిస్తాను’’ బింకంగా అంది.
‘‘స్ర్తిలని తీసుకెళ్ళటం లేదు’’ చంద్రప్ప అర్థవంతంగా నవ్వాడు.
‘‘ఓహో! ప్రభువు స్ర్తిలను తగు రీతిగా గౌరవిస్తారనీ విన్నామే!’’
‘‘అది ఆస్థానంలో! శత్రువుల మాయోపాయాలతో ద్వేషం బుసలుకొట్టే రణరంగంలో కాదు’’
ఆమె నిరుత్సాహపడింది. చంద్రప్పతో వియోగం సహింపరానిదిగా ఉంది. అతనామె మనస్థితిని గ్రహించాడు.
మరుక్షణం మొదలైన అతని వేణుగాన మాధురీ తరంగాలు ఆమెను చుట్టుముట్టేశాయి.
ఆమె ఉన్మత్త నాగినిలా ఉంది. ఆ రాత్రి శరీరమంతా వేయి నాగులు చుట్టుకున్నట్లు మంజరి నర్తించింది. కారణం ఆ ప్రకృతికి తెలుసు. చంద్రప్పకీ తెలుసు. రాత్రి రెండవ జాము నగారా మోగింది.
చిన్నాదేవి మందిరంలో ఆమెను వక్షస్థలానికి చేర్చుకుని నిద్రిస్తున్న శ్రీకృష్ణరాయలకి లీలగా మెలకువ వచ్చింది. చిన్నాదేవి ప్రభువు హృదయంపై తలవాల్చి ‘రాయలే లోకం’ అన్నట్లు నిద్రిస్తోంది.
దూరంగా గాలి తరంగాలు భారంగా మోస్తున్న వేణుగానం వింటుంటే ఆ కళాకారుడు ఆనంద పరవశంతో పాడుతున్నట్లు అన్పించదు. ఏదో హృదయ తాపాన్ని గాన రూపంలో వెలిబుచ్చుతున్నట్లనిపిస్తుంది. ఎవ్వరో ఆ గాయకుడు?
మునె్నన్నడూ విన్నట్లు లేదు. నడిజామున ఈ విరహాగానాలాపన ఏంటి? కృష్ణరాయలకు నిద్రాభంగమైంది. కాపలా వారిని పిల్చి ఆ గానాన్ని ఆపించుదామనుకున్నాడు కానీ మనసొప్పలేదు. ఒకనాడు చిన్నాదేవి కోసం తాను పడిన వేదనను గుర్తుచేస్తున్న గానం అది. ఆ వేణుగానం మెల్లగా మంద్రస్థాయికి దిగింది. క్రమంగా గాలిలో వీలీనమయింది. ప్రభువుకు కలతగానే నిద్రపట్టింది.
‘‘ఇక నేను వెళ్లివస్తాను మంజూ!’’
‘‘అప్పుడేనా’’ దిగాలుగా అందామె.
‘‘ఉదయానికే ప్రయాణానికి సన్నద్ధం కావాలి మరి’’ ఆమెను మరోసారి సందిట చేర్చి ముద్దాడి వీడ్కోలు పలికాడు చంద్రప్ప.
***
శ్రీకృష్ణదేవరాయలకు దేవేరులిద్దరూ హారతిచ్చి వీరతిలకం దిద్ది యుద్ధరంగానికి సాగనంపారు. రాయల దక్షిణ దిగ్విజయ యాత్ర మొదలైంది. కాలం నడక వేగం పుంజుకుంది.
అంతఃపురంలో చిన్నాదేవి దిగులుగా ఉంది. ఆభరణాలు, అలంకారాలు లేవు. మంజరి రావటం చూసింది.
‘‘రా మంజరీ!’’
‘‘ఏంటి చిన్నాజీ! ఇంతటి వైరాగ్య వేదన! నిరాలంకరణ దేనికి?’’
‘‘ప్రభువు దగ్గర లేని అలంకరణ దేనికి మంజరీ! నేటికి పది నెలలు గడిచింది ప్రభువు యుద్ధానికి వెళ్లి’’
‘‘చంద్రప్ప వెళ్ళి’’ మనసులో మంజరి అనుకుంది.
‘‘ఆ వార్తలు తెలుస్తున్నాయి గదమ్మా! అంతా జయమే’’ పైకి బింకంగా అంది.
‘‘కానీ నాకు మాత్రం క్షణమొగ యుగంలా ఉందే!’’
‘‘పాద సంవాసన చేయించనా’
‘‘వద్దు! ఓ పాట పాడు’’
మంజరి గొంతు సవరించుకుని ఓ గీతాన్ని ఆలపించింది.
‘‘మోహన మురళి ఊదవోయి కృష్ణా!
తేనెలొలికే పాట మధువు
ఓపలేదీ రాధ బ్రతుకు’’
‘‘మంజరీ నా బాధ పెంచే పాటేట పాడుతున్నవే’’ చిన్నాదేవి వారించింది.
‘‘మనిద్దరిదీ ఒకే బాధ గదా చిన్నాజీ’’
‘‘అంటే చంద్రప్ప కూడా’’ ప్రశ్నార్థకంగా అడిగింది చిన్నాదేవి.
మంజరి అవునన్నట్లు తలాడించింది. నిట్టూర్చింది చిన్నాదేవి. మంజరిని పంపేసిందిగానీ మనసు కుదుటపడలేదు. రాజులకి యుద్ధాలు తప్పవు. అలాగే వారి ప్రియసతులకీ వేదనా తప్పదనుకొంది.
***
యాభై వేల కాల్బలం, రెండువేల అశ్వికదళంతో గంగరాజు పాలిస్తున్న శత్రుదుర్బేధ్య్యమైన ఉమ్మత్తూర్ కోటను రాయలు ముట్టడించాడు. భీకర పోరాటం సాగుతున్నది.
యుద్ధ శిబిరంలో కృష్ణరాయలకి నిద్ర రావటంలేదు. శే్వతాంబరధారిణి అయిన చిన్నాదేవి జ్ఞప్తికి వస్తోంది. ఆమె బాహువుల్లో ఒదిగి హాయిగా నిద్రించే రోజెన్నడో! ఏదైనా గానం వింటే మనసుకి కొంత ఊరట. చంద్రప్పకు కబురందింది.
అతని బాధతప్త గానం రాయల హృదయానికి ఊపిరులూదుతోంది. ఇదివరలో రాత్రివేళ విన్న గానమిదే! ఇతనికీ ఓ ప్రేయసి ఉందేమో! లేదంటే ఎందుకింత విరహ వ్యధ? ఈ యుద్ధంవల్ల లాభమా! నష్టమా! హిందూ సామ్రాజ్య సంస్థాపన కోసం కంకణంగట్టుకున్న తాను ఇలాంటి ఆలోచన చేయొచ్చా.
ప్రభువు నిద్రించారని గ్రహించిన ఆలాపన ఆపేశాడు చంద్రప్ప.
***
సంవత్సరంపాటు జరిగిన పోరులో గంగరాజు మరణంతో ఉమ్మత్తూర్‌పై విజయం సిద్ధించింది. శ్రీరంగపట్నం జయించి విజయుడై వస్తున్న రాయలకు విజయనగర ప్రజలు హర్షధ్వానాలతో జేజేలు పలికారు.
మంజరి మనసు పాల సముద్రంలా ఎగిసిపడుతోంది. వార్తాహరుని ద్వారా చిన్నాదేవి మందిరంలో అందరికీ తెల్సిన వార్త ఆమెలో నూతనోత్సాహాన్ని నింపుతోంది. చిన్నాదేవి కూడా పరవళ్ళు తొక్కే నదిలా పూజా మందిరంలో నృత్యం చేయటం చూసి మంజరి చాలా సంతోషించింది. ఎవరికైనా మనసు ప్రతిబింబించేది ఆరాధించే కళలోనే గదా!
తిరుమలదేవి, చిన్నాదేవులతో కొలువుతీరిన ప్రభువు రుక్మిణీ సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణునిలా భాసించాడు. నాటి కొలువులో చంద్రప్ప గానానికి మంజరి నాట్యం కళాకోవిదుల ప్రశంసలు పొందింది.

- ఇంకా ఉంది

- చిల్లర భవానీదేవి