డైలీ సీరియల్

బంగారు కల - 12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆ కన్ను మూతలో ............................
...........................................
విజయనగరాంధ్ర దేవుడవే నిజంబు’’
అంటున్న చంద్రప్పతో కలిసి ఆ స్వామికి నమస్కరించింది మంజరి.
‘‘దేశ బాధ చూసి తపస్సు మాని రాజకీయాలలో ప్రవేశించి హంపీలో తెలుగు రాజ్యాన్ని పునఃప్రతిష్ఠించి సంస్కర్తయై మతోద్ధారకుడై ముక్తిపొందిన ఈ విద్యారణ్యస్వామి గుడి తెలుగు ప్రజలందరూ చూసి తరించాల్సినది’’ మంజరి ప్రస్తుతించింది.
మనసులోని భావోద్వేగాలను సమన్వయపరచుకుంటూ గుడిమెట్లు దిగివస్తున్న మంజరి చంద్రప్పలను చాటునుంచి చండ్రనిప్పుల్లాంటి రెండు కళ్ళు ఆగ్రహజ్వాలలతో గమనించడం వారికి తెలియదు. ఆ క్షణం నుంచి ఆ కళ్ళు వారి జీవితాలపై నిప్పుల వర్షం కురిపించబోతున్నాయని తెలిస్తే ఆ జంట అంత ఆనందంగా ఉండగలదా?
***
శ్రీకృష్ణ దేవరాయలు ఆలోచనామగ్నుడై మందిరంలో పచార్లు చేస్తున్నారు. వార్తాహరుడొచ్చాడు. తిమ్మరసు మహామంత్రి రాక గురించిన సమాచారాన్ని నివేదించి నిష్క్రమించాడు. విజయనగర సామ్రాజ్యమే తిమ్మరసు తయారుచేసిన చిత్రపటం. ఆయనకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆంక్షలుండవు. ముఖ్యంగా రాయలను కలవాలంటే కూడా కబురు పంపటం అనుమతి పొందటం అవసరం లేదు. అయినా రాచమర్యాదలు తప్పని సంస్కారి ఆయన. తిమ్మరసు ప్రవేశించగానే కృష్ణదేవరాయలు ఎదురేగి ఆహ్వానించారు.
‘‘రండి అప్పాజీ! మీకోసమే ఎదురుచూస్తున్నాను’’
ఇరువురూ ఆశీసునులైనారు. అప్పాజీవారు ఎప్పటిలాగే గంభీర ముద్రతో ఉన్నారు.
‘‘అప్పాజీ! మన సామ్రాజ్య విస్తరణకు దక్షిణ జైత్రయాత్ర దిగ్విజయంగా సాగింది. ఇక ఉత్తర విజయయాత్ర గురించి ఏమాలోచించారు’’
‘‘రాయా! కృష్ణకు ఉత్తరాన మనకున్న బలమైన శత్రువు గజపతి. గతంలో విజయనగర సామ్రాజ్య ఆధీనంలో వున్న ఉదయగిరి కొండవీడులను జయించి తన అధీనం చేసుకొన్నాడు. అవి తిరిగి విజయనగర సామ్రాజ్యంలో చేరాలి’’ యుద్ధానికి తిమ్మరసు అనుమతి లభించినట్లే!
వెంటనే సేనానాయకులకు సమాచారం అందింది. శత్రు దుర్బేధ్యమైన ఉదయగిరి కోట ముట్టడి ప్రారంభమైంది. నెలల తరబడి జరిగిన ముట్టడివల్ల ఉదయగిరి రాయల వశమైంది. ఉదయగిరికి రాయసం కొండ మరుసును పాలకుడిగా నియమించి రాయలు తిరుమల శ్రీనివాసుని దర్శనానికి పయనమయ్యారు. తిరుమల వెంకటేశునికి అనేక కానుకలు సమర్పించి మళ్లీ కొంతకాలానికి కొండవీడుపై దండెత్తారు. దారిలో అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ వంటి ఉప దుర్గాలను జయించి కొండవీడును ముట్టడించి గజపతి కుమారుడు వీరభద్రజగపతిని ఇతర సామంతులతో బందీలుగా పట్టుకున్నారు. ధరణికోటలోని అమరేశ్వరుడ్ని, శ్రీశైల మల్లన్ననూ దర్శించి భక్తిమీర అర్చించారు రాయలు.
అనంతరం కొండపల్లి, అనంతగిరి, నల్గొండ, కంభంమెట్టు, కనిగిరి కోటలు ఆక్రమించి సింహాచలం చేరారు. విజయస్తంభం నాటారు. కృష్ణరాయని విజయయాత్ర శ్రీకూర్మం, పూరి కటకం దాకా సాగింది. కృష్ణరాయ గజపతుల మధ్య ఎడతెగని యుద్ధాలు జరుగుతూనే వున్నాయి. తిమ్మరసు భేదోపాయం, రాయల అసాధారణ ప్రజ్ఞాపాటవాలు విజయనగర విజయానికి దోహదపడ్డాయి. రాయల కీర్తి పతాక నీలి గగనంలో రెపరెపలాడింది.
నిర్వీర్యుడైన గజపతి రాయలతో సంధి చేసుకుని అయిష్టంగా అయినా తప్పని పరిస్థితులలో తన కుమార్తె అయిన అన్నపూర్ణాదేవిని రాయలకిచ్చి వివాహం చేశాడు.
తనను దాసీపుత్రుడని అవమానించిన గజపతిచే కాళ్ళు కడిగించుకొని కన్యాదానం పొంది సంతృప్తుడైన కృష్ణరాయలు కృష్ణకు ఉత్తరాన ఉన్న భూములన్నీ గజపతి అధీనం చేసి తన సహృదయతను ప్రకటించారు. అన్నపూర్ణాదేవిని బెదిరించి వారి తొలిరేయి రాయలను హత్య చేయించాలనుకున్న గజపతుల కుట్ర ఫలించలేదు. రాయలు అన్నపూర్ణాదేవిని క్షమించి జంటగా విజయనగరానికి చేరారు.
చల్లని వెనె్నల రాత్రి చంద్రికల వెలుగులో మెరిసిపోతున్న మంజరిని తదేకంగా కొన్ని నిమిషాలు చూశాడు చంద్రప్ప. ప్రేమగా ఆమెను కౌగిలించాడు. నిర్మాణం దాదాపు పూర్తవుతున్న విఠల మండపంలోకి తీసుకెళ్ళాడు.
మానవుడికి విశ్వకర్మకు జరిగిన పోటీయా అన్నట్లుండే విజయ విఠల దేవాలయం విఠల స్వామి విష్ణువుకు అంకితంగా నిర్మితమవుతోంది. కృష్ణరాయప్రభువు ప్రారంభించిన ఈ కట్టడం పూర్తికావటానికి ఎన్నాళ్ళు పడుతుందో మరి! గర్భగుడిలో మూల విరాట్, ఉత్సవ విగ్రహాలుండాలి. విఠలస్వామి మందిరం మూడు వైపులా ద్వారాలతో పెద్ద రాతి గోడలమీద నిర్మాణమవుతోంది. బలమైన శిలావేదికను సైనికులు నర్తకీమణులు మోస్తున్నట్లు తీరుస్తున్నారు. మూలల నిర్మాతవౌతున్న నృత్య మందిరాలు, కల్యాణ మండపాలు పూర్తిగా తయారయ్యాక ఎంత సుందరంగా ఉంటాయో!
ఒక్కొక్క శిల్పాన్ని చూస్తూ నడుస్తున్నారు. ఏమి అందమా కళాకృతులది! నాట్యభంగిమలు నాట్యశాస్త్రాన్ని లిఖిస్తున్నాయి. ప్రతి భంగిమ మన్మోహనంగా నృత్యానికి ప్రేరణ ఇస్తోంది. మంజరి పదాలు లయగా మండపమంతా తిరుగాడుతున్నాయి. చంద్రప్ప మురళీ మాధురులు పున్నమి పరిమళంతో కలసి అల్లనల్లన గాలి తరంగాలుగా వ్యాపిస్తున్నాయి. విఠల స్వామి దేవాలయంలోని శిల్ప విన్యాసం చూస్తుంటే మంజరి మనసు ఆనందార్ణవంలో ఉరకలు వేస్తున్నది. అక్కడక్కడ స్తంభాలకు పాక్షికంగా అమర్చిన సంగీత శిలలను స్పృశించాడు చంద్రప్ప.
సరి.. గమ.. ప.. ద.. ని..
సప్తస్వరాలు పలుకుతున్న కొన్ని సంగీత స్తంభాలు స్వర సంచారం చేస్తున్నాయి. మీటగల కళాకారునికి, సంగీతజ్ఞునికి ఎదురుగా నిలిచి హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాయి. కొన్ని శిలాస్తంభాలు మృదంగ ధ్వానాన్ని, కొన్ని వీణాస్వనాన్ని, కొన్ని సారంగిని.. ఓహ్.. సకల సంగీత ప్రపంచమంతా విఠలస్వామి మందిరంలో కొలువుదీరింది. చేతిలోని వెదురు వేణువును పక్కన బెట్టి శిలావాయిద్యాలలోనే రకరకాల మేలకర్తలు రంగరించిన వాద్యాలాపన చేశాడు చంద్రప్ప.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి