డైలీ సీరియల్

బంగారుకల 13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిల్పరాగాలకు పులకించిన మంజరి మరింత తన్మయ సమ్మోహనంగా విఠల మండపంలో నృత్యం చేస్తున్నది.
ఆమె అందాల రవళికి ప్రతిస్పందించిన శిలావాయిద్యాలు చంద్రప్ప అంగుళీ స్పర్శతో ప్రాణం పోసుకుని మరింత చైతన్యాన్ని ప్రసారం చేశాయి. ఆ రాత్రి నాద మాధురీ మహిమ ఎంతసేపు పరిసరాలను రసప్లావితం చేశాయో వాళ్ళకే తెలీదు. ఒకరి కౌగిలికి ఒకరు పరవశించి ఆదమరచిపోయిన ఆ జంట హృదయాలు తొలికిరణ స్పర్శకు జాగ్రదవస్థకు వచ్చాయి.
విఠల మండపం మెట్లు దిగి తూర్పువైన తేజరిల్లుతున్న ఏకశిలారథం ఎదుట నిలిచారు.
ఒకే శిలలోంచి శిల్పీకరించినట్లుండే ఈ ఏకశిలారథం పెద్ద రాతివేదికపై చెక్కబడింది. నాలుగు రాతి చక్రాలు వృత్తాకారంలో రాతి ఇరుసులతో పూన్చబడ్డాయి. ఇవి కదులుతాయని కూడా ప్రతీతి. గుండ్రని రాతి చక్రాలపై ఇరుసు కేంద్రంగా వలయాకారంలో చెక్కడపు రేఖలు తీర్చబడ్డాయి. ఆ రేఖల వలయాల్లో లతలు, కళాకృతులు చూసిన వాళ్ళకి కనుల పండుగే! దాదాపు ఎనిమిది అడుగుల ఎతె్తైన పీఠం పైన రథం రకరకాల శిల్ప స్తంభాలతో కన్పిస్తున్నది. రథానికి నాల్గువైపులా పీఠాన్ని మోస్తున్న సింహవాహికలు, బలాఢ్యులున్నారు. రథ శిఖరంపై రాతితో రథం. ఆపైన గోపురం.. ఇదంతా ఒకే శిలలోంచి మలిచారంటే నమ్మలేనట్లు అన్పిస్తుంది.
రాతిరథాన్ని చూస్తుంటే మంజరికి నోట మాటే రాలేదు.
‘‘మనిషి ఎంత గొప్పవాడు. శక్తిమంతుడు. అలవిగాని గండశిలలను సైతం చిన్న ఉలితో లోబరచుకుని ఇంతటి శాశ్వతత్వాన్ని ప్రసాదించిన ఆ శిల్పుల పేర్లు కూడా తర్వాతి తరాలకు తెలియకపోవచ్చు. అటువంటిప్రజ్ఞావంతులైన శిల్పకారులను పోషించి తన కీర్తితోబాటు వారి ప్రవీణ్యతకు శాశ్వతత్వాన్ని కల్పించిన కృష్ణరాయప్రభువెంతటి ధన్యుడు. రాజులు, రాజ్యాలు శాశ్వతం కాకపోవచ్చు. కానీ చెదరని ఈ శిల్పనగరం ఎప్పటికీ ప్రభువును చిరంజీవిని చేస్తుంది’’. తనలో తాను అనుకున్నట్లుగా మంజరి మాట్లాడుతుంటే చంద్రప్ప సంతోషభరితుడయ్యాడు.
‘‘మంజూ! నీవింతటి భావుకురాలవని తెల్సు. ఈ స్థలం, ఈ శిల్ప సౌందర్యం నీ రసపిపాసను మరింతగా ఇనుమడింపజేస్తుందని తెలిసే శిల్పాచార్యుల అనుమతిలో నిన్నీనాడు ఇక్కడికి తీసుకువచ్చాను. నా ఆలోచన ఫలించింది. ఈ సంగీత మండపంలో నిత్య నృత్య గాన వినోదాలు జరగాలనే సత్సంకల్పంతోనే ప్రభువీ సరస్వతీ నిలయాన్ని రూపొందింపజేశారు’’ చంద్రప్ప మాటలు శ్రద్ధగా విన్నదామె.
సంగీత మండపంలో బోర్లాపడుకుని అరచేతుల్లో పద్మం లాంటి వదనాన్ని ఉంచి ప్రేమంతా కుప్పబోసి చంద్రప్ప వైపే చూస్తూ పారవశ్యంతో వింటున్న మంజరిని రహస్యంగా వెంటాడుతున్నాయి అవే జత కళ్ళు. ఆ కళ్ళలో చంద్రప్ప పట్ల అసూయ, కసి కన్పిస్తున్నాయి.
‘‘మంజూ! నడిరాత్రి దాటింది. ఇక పోదాం. రేపు మరికొన్ని చూద్దాం’’
చంద్రప్ప మంజరి చేయి పట్టుకొని మెట్లు దిగుతున్నాడు.
‘‘చంద్రా! నీకో మాట చెప్పాలి. మా అమ్మ ఎవరితోనో రహస్యంగా చర్చలు చేస్తున్నది. నేను వెళ్ళగానే ఆపేస్తున్నది. నాకేదో అనుమానంగా ఉంది. మొదట్నుంచీ మన స్నేహం అమ్మకి ఇష్టం లేదు. ఈమధ్య సేనానాయకుడు గండమనాయకుని కుమారుడు మా యింటికివచ్చి అమ్మను కలిసి ఏవో మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆ కంటకుని చూపులు, చేష్టలు నాకంతగా రుచించటంలేదు’’ దిగులుగా అంది. చంద్రప్ప వౌనంగా విన్నాడు.
వాళ్లిద్దరూ విఠలస్వామి దేవాలయ ప్రాంగణం దాటి మెట్లు దిగుతున్నారు. వెనె్నల విరగకాస్తున్నది. ప్రైమైక జీవుల హృదయాలపట్ల వెనె్నలకీ ఆసక్తి ఎక్కువేమో అన్నంత ప్రకాశవంతమైన రాత్రి అది.
‘‘మంజూ! ఇంటిదాకా వస్తాను పద’’ ఆమె చేతిని వదల్లేదు చంద్రప్ప.
‘‘అహ.. వద్దు.. అమ్మకి తెలిస్తే, ఇంత పొద్దుపోయి రావటానికి కారణాలు చెప్పాలి. ఇంక నీతో చూస్తే?’’
‘‘మరేం చెప్తావు’’
‘‘మా నేస్తం మలయద్వతి ఇంట నృత్యారాధన చేసి వస్తున్నానని’’
‘‘ఎంతటి జాణవు. నీ ఆరాధన నృత్యానికా! నాకా!’’ కొంటెగా నవ్వాడు చంద్రప్ప.
‘‘చంద్రా! నిజం చెప్పనా! నీవు గాయకుడివి. నీ స్వరాలు నా అందెలు చేస్తున్న స్నేహం మనది’’. అతని చేతిని మృదువుగా నొక్కి ముందుకు కదిలింది. ఆమె కనుమరుగయేంతవరకు చూసి చంద్రప్ప వడివడిగా కదిలాడు.
చంద్రప్ప అటు నాలుగడుగులు వేశాడో లేదో ఇటు తన గృహాన్ని సమీపిస్తున్న మంజరిని వెనకనించి ఎవరో నోరు మూసేసి రెండు చేతులు వెనక్కి బిగించి పట్టుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి ఆమె దిగ్భ్రాంతి చెందింది. కీచుగా అరవబోయింది. కానీ గొంతు భయంతో పెగలలేదు.
ఆమెను పట్టుకున్న వ్యక్తి కొంత నీడలో ఉండటంవల్ల ముసుగేసుకోవటంవల్ల అతనెవరో తెలీటంలేదు.
‘‘ఆ చంద్రప్పను మర్చిపో! లేదంటే’’ బొంగురు గొంతుతో హుంకరించాడు ముసుగు మనిషి.
ఇంతలో మరో వ్యక్తి చెంగున దూకి ముసుగు మనిషిని గట్టిగా మెడమీద కొట్టాడు. ఊహించని దెబ్బకు ముసుగు మనిషి మంజరి నొదిలేశాడు. ఆమె అతనికేసి తీక్షణంగా చూస్తున్నది. ఎవరో తెలీటంలేదు. కొత్త వ్యక్తి వదలకుండా కొడుతున్న దెబ్బలకు ముసుగు మనిషి తట్టుకోలేకపోయాడు. దూరంగా పరుగులు పెట్టాడు. కొంతసేపట్లో కొత్త వ్యక్తిని తిమ్మరుసు మహామాత్యుని కుమారుడు గోవిందరాయలుగా గుర్తించిన మంజరి అతనికి వినమ్రంగా నమస్కరించింది.
‘‘మంజరీ! ఇంతరాత్రివేళ ఇలా రావటం మంచిదేనా! త్వరగా వెళ్లిపో!’’ అంటూ గోవింద రాయలు చకచకా కదిలి నీడల్లో కలిసిపోయాడు.
అతని సంస్కారానికి మనుసులోనే అంజలి ఘటించిందామె.
శ్రీకృష్ణదేవరాయల రాజ్యం తిమ్మరసు శక్తిమీదే ఆధారపడిందనుకున్నా, తిమ్మరుసు కుటుంబీకులంతా రాజు గౌరవాన్ని కాపాడేవారేననిపించింది.
ఆమె నివాసం మొన్నటిదాకా చిన్నాజీ భవనంలోనే!

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి