డైలీ సీరియల్

బంగారుకల - 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణదేవరాయల ప్రభువు జన్మదినోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నది. యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు ముగిశాయి.
ఐదుగురు సామంతరాజులు ప్రభువుకు కానుకలు సమర్పించారు. ప్రజలంతా ఇష్టమైన అందమైన కొత్త బట్టలు ధరించారు. సామంతులంతా తమ కిందివారికి రంగు రంగుల బట్టలు బహూకరించారు. ప్రతి రాజ ప్రముఖునికి ప్రత్యేక లాంఛనాలందాయి.
రాజుగారికి సామంతులంతా విలువైన బట్టలు కానుకలు నగలు, ధనం అందజేశారు. ఆ ఒక్కరోజే రాజుగారికి పదిహేను లక్షల బంగారు పర్దావులు బహూకరించబడ్డాయి. ఒక్కొక్క పర్దావు విలువ మూడు వందల అరవై రైస్‌లు. విజయనగర ప్రజలు నెలను పౌర్ణమి నుండి పౌర్ణమికి లెక్క వేసుకుంటున్నారు.
విజయనగర ప్రభువులు గత అనేక సంవత్సరాలుగా ఒక కోశాగారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ప్రభువు మరణం తర్వాత దానికి తాళం వేసి ఉంచుతారు. అది ఎవరికీ కనపడకుండా తెరవకుండా ఉండేట్లు చూస్తారు. తర్వాత వచ్చిన రాజులు కూడా దానిని తెరవటం చేయరు.
ఏ రాజుకయినా తప్పనిసరి అవసరం అయితే తప్ప ఆ కోశాగారాన్ని తెరిచే ప్రసక్తి లేదు. ప్రతి రాజ, తన కోశాగారంలో కోటి పర్దావులదాకా నిల్వ చేస్తాడు. తన రాజభవనం ఖర్చును మించి ఒక పర్దావు కూడా ఇందులోనించి తీయడానికి లేదు. ప్రతి రాజభవనంలో పనె్నండు వేల స్ర్తిలకు పైగా పోషించబడతారు. ప్రతి పర్దావు బంగారు నాణెంమీద ఒకవైపు రెండు బొమ్మలు రెండోవైపు ఆ రాజు పేరు ఉంటుంది.
జన్మదిన వేడుకలు పూర్తయ్యాక కృష్ణదేవరాయలు హంపీ వెళ్లారు. ఈ నగరమంటే ఆయనకి చాలా ప్రీతి. రాజుకు నగర పౌరులు మహావైభవంగా స్వాగతం పలికారు. వీధుల్లో విజయతోరణ ద్వారాలు నిర్మించారు. ఈ ద్వారాల గుండా రాజు ప్రవేశించారు. వీధులన్నీ విలువైన వస్త్రాలతో వున్నాయి. రాజు రక్షక దళాలను సమీక్షించారు. కృష్ణరాయప్రభువు సంవత్సరానికోసారి చెల్లించే వేతనాన్ని అందరికీ పంచారు. పరివారాన్ని రాజధికారులు తనిఖీ చేసి వాళ్ళ పేర్లు, ముఖం, శారీరక గుర్తులు రాసుకున్నారు. దళసేనానులు కాపలాకి వెళ్ళటానికి వంతుల వివరాలు తెలియజేయబడ్డాయి.
శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేక ఉత్సవ సందర్భంగా ఆనాటి సాయంకాలం భువన విజయంలో కొలువు తీరాడు. నగరం సర్వాలంకారాలతో శోభాయమానమై దివ్యమణి ప్రభలతో చూపరుల కళ్ళు మిరుమిట్లు గొల్పుతున్నది. ఈ రోజు రాయలవారి ముఖ మండలం ఆనందాతిరేకంతో పూర్ణచంద్ర కాంతిని ప్రతిఫలిస్తున్నది. ఒక ప్రత్యేక కారణంతో సిద్ధం చేయబడిన ఆ కొలువుకు శ్రీరంగ దేవరాయలు ఆహ్వానించబడ్డాడు. ఆయనతోపాటు వారి కుమారుడు రామరాయలు దుందుభి ధ్వానాలమధ్య సభలో ప్రవేశించాడు.
సభలో అందరూ లేచి గౌరవ పురస్సరంగా నిలబడ్డారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే శ్రీకృష్ణదేవరాయలు కూడా సింహాసనం నుంచి లేచి నిలబడ్డాడు. శ్రీరంగ దేవరాయలు దిగ్భ్రాంతి చెందాడు. రాయలు మందహాసంతో శ్రీరంగ దేవరాయలను చూశాడు. రాయలవారు సింహాసనం నుండి ఎందుకు లేచారో అతని కర్థం కాలేదు. తన ఆసనంమీద కూడా ఈ రోజు మరెవ్వరో కూర్చున్నారు. శ్రీరంగదేవరాయలు ఆలోచనాపరుడై నిశ్చలంగా అలాగే నిలుచున్నాడు. ఒక నిమిషం తర్వాత మళ్లా భేరీ నినాదం విన్పించింది. శ్రీకృష్ణదేవరాయలు ఆనంద మందహాసంతో శ్రీరంగదేవరాయలకేసి చూస్తూ ముందుకు నడిచాడు. అతని దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని తన సింహాసనం పక్కనే ఉన్న ఉన్నతాసనాన్ని చూపాడు. దాని పక్కనే ఉన్న ఉచితాసనంపై రామరాయలును కూచోమని సైగ చేశాడు. రాయలు తన సింహాసనాన్ని అధిష్టించగానే భేరీ నినాదం ఆగిపోయింది. అంతటా ఆశ్చర్య నిశ్శబ్దం. రాయల ప్రవర్తన అందరికీ నేడు కొత్తగా కన్పిస్తున్నది.
శ్రీకృష్ణదేవరాయలు ఆ నిశ్శబ్ద వాతావరణంలో జల ధర ధ్వాన సమాన గంభీర స్వరంలో ఇలా అన్నారు.
‘‘నేటినుండి కందవోలు రాజ్యాధినేత శ్రీరంగదేవరాయలుగారు మాకు సామంతులు కారు. వారిని సర్వ స్వతంత్రులుగా ప్రకటిస్తున్నాం’’
సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. శ్రీరంగ దేవరాయలు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు. రాయలవారి కృపకు కారణం అనూహ్యంగా వుంది.
తిమ్మరుసు మహామంత్రి లేచారు. చిరునవ్వుతో సభనంతా పరికించాడు. అందరి మనసుల్లోని ప్రశ్నను అవగతం చేసుకున్నాడు. ధీర గంభీరంగా ఇలా అన్నారు.
‘‘సభాసదులారా! ఈనాడు మరో ముఖ్యమైన అంశాన్ని తెలియజేస్తున్నాను. శ్రీమన్మహామండలేశ్వర శ్రీ శ్రీకృష్ణదేవరాయల వంశానికి ఏనాటి నుండో అర్వీటి వంశంవారు పరమాప్తులు, మిత్రులు. శ్రీ రాయలవారు విజయనగర రాజ్యాధినేతలయే సమయంలో దక్షిణ పూర్వ దిగ్విజయ యాత్రల సమయంలో ఎంతో తోడ్పడినవారు ఆర్వీటివారు. అందరిలో రాయలవారి ఆదరాభిమానాలు చొరగొన్నవారు శ్రీశ్రీశ్రీ శ్రీరంగదేవరాయలవారి తృతీయ పుత్రుడు చిరంజీవి రామరాయలవారు.
వీరు అన్ని దండయాత్రల్లో పాల్గొని అరివీర భయంకర శౌర్య ప్రతాపాలను ప్రదర్శించారు. అవక్ర పరాక్రమంతో ఉదయగిరి దుర్గంలో శత్రు మూకల్ని సంహరించారు. కోటను స్వాధీనం చేసుకొని రాయలవార్కి అందించారు. కందవోలును ముట్టడించిన ఆదిల్‌షాతో పోరాడి వారి అశేష సేనావారాన్ని నిశే్శషం చేశారు. పరాక్రమశాలి, ధీమంతుడు అయిన రామరాయలవారు శ్రీకృష్ణదేవరాయల అభిమానం చూరగొన్న అదృష్టవంతులు. అందుకు అభినందనగా సూచకంగా శ్రీవారు ఈ యువరత్నానికి తమ పుత్రికా రత్నమైన తిరుమలాంబికను కన్యాదానం చేయటానికి నిశ్చయించారు. నేటికి ఎనిమిదో రోజు వైశాఖ శుద్ధ త్రయోదశి వివాహానికి అనుకూలమని దైవజ్ఞులు నిర్ణయించారు. ఈ సభ ఇవ్వాళ ముగిసింది. మరలా ఏకాదశి రోజున దర్శనం ఉంటుంది’’ అని విరమించారు తిమ్మరుసు మంత్రి.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి