డైలీ సీరియల్

బంగారుకల- 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శ్రీరంగ దేవరాజసుత చిరంజీవి రామయ రాజా జయ జయహో!
సమస్త సద్గుణాస్తోత్ర భద్రా రామయ రాజా జయ జయహో!
భూసుత సాహస దుర్యా రామయ రాజా జయ జయహో!’’
వరునివైపు వారి నాగారాలు ఒక్క పర్యాయం మోగి ఆగాయి.
అటువైపునుంచి శ్రీకృష్ణదేవరాయలు ఇటువైపునుంచి శ్రీరంగ దేవరాయలు భద్రగజావరోహణ గావించారు. ఆ వెనుక రామరాయలు ఉభయ వర్గాల రాజబంధువులు కిందికి దిగారు. వధువువైపు వాళ్ళు పరిపించిన రత్నకంబళ్ళపై వరుని పక్షమువాళ్ళు కూర్చున్నారు. ముత్తయిదువులు, గంధాక్షతలు కురిపించారు. విలాసినీ జనులు పన్నీరు జల్లారు. ఇటువంటి ఉచిత మర్యాదలకు ఇరుపక్షాల వాళ్లు ఆనందించారు.
ముహూర్తానికి సర్వం సిద్ధమైంది. వివాహ మండపంలో వధూవరుల్ని ఒక చోట కూర్చోబెట్టి దిష్టి తీశారు. ఇద్దరికీ మంగళ స్నానాలు చేయించారు. మంత్రయుక్త ఆవాహనతో సకల శుభదేవతల పూజ జరిగింది. వరుడు వధూపక్షం వాళ్ళిచ్చినవి వధువు వరునిపక్షం వాళ్ళిచ్చినవి పట్టువస్త్రాలు ధరించారు.
రాజాధిరాజ రాజ పరమేశుడు శ్రీ శ్రీకృష్ణదేవరాయలు సమంత్రకంగా కాళ్ళు కడిగి రామరాయలకు కన్యాదానం చేశారు. మంత్రోచ్ఛాటన కొనసాగింది. వధూవరులచే వివాహ ప్రతిజ్ఞ జరిపించారు.
మంగళతూర్యారవాలు మిన్నంటగా రామరాయలు తిరుమలాంబిక మెడలో మూడుముళ్ళు వేసి సూత్రధారణ చేశాడు. బ్రహ్మణోత్తములు వేదమంత్రాలతో ఆశీస్సులందించారు. సకల ప్రపంచం వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించింది. తలంబ్రాలు పోసుకోవడం పూర్తి అయింది.
రామరాయలవంటి ధైర్య శౌర్యవంతుని భర్తగా పొంది తిరుమలాంబిక ఉప్పొంగిపోయింది. వీరాధివీరుడు అల్లుడయ్యాడని రాయలు ఆనందించాడు. ఆదరించి ఎన్నో కానుకలు ఇచ్చాడు. సర్వసేనాధ్యక్ష పదవినిచ్చి గౌరవించాడు. అల్లునికి వివాహ కానుకగా సిద్ధవటం, పొత్తపి, ఉదయగిరి దుర్గాలనిచ్చి సత్కరించారు రాయలు.
****
మంజరి, చంద్రప్పలు వ్యాసరాయలవారి ఆశ్రమానికి వెళ్ళారు. తమ వివాహ ముహూర్తం నిర్ణయించమని కోరారు.
ఆయన వాళ్ళిద్దరికేసి సందిగ్ధంగా చూశాడు.
‘‘మీ ఇద్దరికీ వివాహయోగం లేదు నాయనా. ఒకవేళ జరిగినా వియోగం తప్పదు’’.
‘‘ఎందుకు స్వామీ’’ చంద్రప్ప అడిగాడు.
‘‘లోగడ కూడా మీరిద్దరూ వివాహ ప్రయత్నం చేసినట్లు అది భగ్నమైనట్లు మీ జాతకాలు చెప్తున్నాయి’’
‘‘అంటే మేము ఒకరినొకరు కాకుండా వేరొకరిని చేసుకుంటామా’’ చంద్రప్ప మళ్లీ అడిగాడు. వ్యాసరాయలు వౌనం వహించాడు.
మంజరి లోలోపల పరితాపం చెందుతున్నది. స్వామి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ప్రతిసారీ ఏదో ఒక అవాంతరమెదురౌతున్నది. తిరుమలాంబిక రాకుమారి వివాహమయ్యాక మంజరికి తన వివాహం గురించి చింత పట్టుకుంది.
ఆమె గతంలో మరో జ్యోతిష్కునికి తన జాతకం చూపించుకుంది. తాను చంద్రప్పను వివాహమాడితే అతనికి మృత్యువు సంభవిస్తుందని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. అప్పటినించి మంజరి క్షుభితురాలయింది. తనపట్ల చంద్రప్ప కన్పరిచే అనురాగాన్ని కాదనలేదు. అలాగని చేతులారా అతని మరణాన్ని కోరలేదు.
‘‘్భగవంతుడా! ఏమిటీ విషమ పరీక్ష. ఈ విషయాన్ని చంద్రాతో ఎలా చెప్పగలను’’ అని లోలోపల వేదన పడుతున్నదామె. అతని బలవంతంమీదే వ్యాసరాయలవారిని కలవటం జరిగింది.
రాజగురువైన వ్యాసరాయలంటే కృష్ణరాయలకు అమిత గౌరవం. రాయలకు పదవీ గండం ఉన్నపుడు కొద్దికాలం విజయనగర సింహాసన మధిష్ఠించిన జ్ఞాని ఆయన. అటువంటి వ్యాసరాయల మాట పొల్లు కాదు. తమ వివాహం జరగదు. వ్యాసరాయలవార్కి నమస్కరించి ఇద్దరూ ఆశ్రమం బయటికి వచ్చారు.
వౌనంగా నడుస్తున్నాడు చంద్రప్ప. ఆమె చేతిని బిగించి పట్టుకున్నాడు.
‘‘మంజూ! నీవు లేనిది నేను జీవించలేను’’ తమకంగా కౌగిలించుకున్నాడు. ఇద్దరి కళ్ళు నిండుకున్నాయి.
‘‘బుస్..’’మనే శబ్దం విని చటుక్కున ఆమెను వదిలేశాడు.
నాలుగు బారల నల్లత్రాచు పడగ విప్పి తీక్షణంగా వీళ్ళకేసి చూస్తున్నది. మంజరి కొయ్యబారిపోయింది. శరీరమంతా గజగజా వణికిపోతున్నది. ఇద్దరిలో ఎవరు కదిలినా పడగ విసరటానికి సిద్ధంగా ఉంది త్రాచు.
‘కదలకు’ పెదవులు కూడా కదలకుండా అన్నాడు చంద్రప్ప.
ఇద్దరూ బొమ్మల్లా నిలబడిపోయారు.
కాసేపు విప్పిన పడగను అలాగే ఉంచి ఎలాంటి అలికిడి లేకపోవటంతో జరజరా పాక్కుంటూ పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది త్రాచు.
మంజరికి దడ తగ్గలేదు. అది అపశకునంలా తోస్తున్నది. తనెంత నష్టజాతకురాలు. తల్లిని పోగొట్టుకుంది. ప్రేమించిన చంద్రప్ప కూడా తనకి దూరం కాక తప్పదు. వీరేంద్రుని అసభ్య ప్రవర్తన మరింత బాధిస్తోంది. అది ఎవ్వరికీ చెప్పుకునేది కాదు. అతడు రాజబంధువు. అతని కంటపడకుండా ఉండగలగటమే తను చేయగలిగిన పని. అది కూడా చాలా కష్టతరంగానే ఉంది.
తిమ్మరుసు వారి కుమారుడు గోవిందరాయలు తన పట్ల చూపించే ప్రత్యేక శ్రద్ధకు కారణం తనూహింపలేదు. చంద్రప్ప తనూ ఎన్ని వెనె్నల రాత్రులు విజయనగర శిల్పారామాల్లో విహరిస్తూ ఎనె్నన్ని కలలు కన్నారో!

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి