మంచి మాట

దైవమే సాక్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరికలు మానవ సహజం. కొన్నిసార్లు మన తాహతుకు మించి కోరికలు మరికొన్నిసార్లు ఇరుగుపొరుగు వారితో పోల్చుకుని పుట్టగొడుగుల్లా పుట్టే కోర్కెలను తీర్చుకోవడానికి ఆరాటపడి ఆయాసపడుతు వుండడం సాధారణం. ఈ సాధనలో చాలామంది జాతకాలు, శాంతులు, దోషాలు నివారణలు అంటూ దేవులాడడం సహజాతి సహజంగా ప్రతిచోటా కనిపిస్తుంది. ఈమధ్య టీవీ ప్రసారాల్లో ధనలక్ష్మీ యంత్రాలు, అక్షయ పాత్రలు వగైరాలు చాలామందిని వారి ఆశలను, బలహీనతలను రెట్టింపు చేస్తున్నాయి.
అర్హత లేకుండా కష్టపడకుండా కోరికలు సిద్ధించుకోవడమనే ప్రయత్నంలో విఫలం అయితే నిరాశా నిస్పృహలకు గురి కావడం అనేది కద్దు.
నిత్యం భగవంతుని మనసున నిలుపుకుంటూ మనం పడే శ్రమకు ఆయనే ప్రత్యక్ష సాక్షిగా భావిస్తూ ఏ కార్యాన్ని అయినా నిర్వర్తిస్తే చక్కటి ఫలితం రావడం ఖాయం.
ఆత్మకు ఆత్మయే బంధువు మరియు శత్రువు కూడా అయింది. మార్గాన్ని మలుచుకునే శక్తి మన మనసుకే ఉంది. అట్టి మనసుని సర్వం ఆ సర్వేశ్వరుడికి సమర్పించి మన పనిని మనం చేసుకొనిన నాడు ఈ జాతకాలు, శకునాల గురించి అనవసర ఆందోళన అవసరం లేదు.
దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వరుని స్తుతిస్తూ మానవులు తమ బలహీన మనస్తత్వం ద్వారా ఏవిధంగా వృధా కాలయాపన చేస్తున్నారో తెలియజేసారు. పరధనాశాపరులైన గ్రహచార, శకునాలను గురించి చెప్పే వారు దోష నివారణ నిమిత్తం శాంతిక్రియలు ఆచరిస్తుంటారు. సర్వ కల్యాణదమైన శివనామం జపించేవారికి ఏ దుష్ట శక్తులు బాధించలేవు అని అంటారు దూర్జటి.
భగవంతుని పట్ల అచంచల విశ్వాసం, మనం చేసే పనిపట్ల నిబద్ధత, ధర్మాచరణ ఉన్ననాడు ఎటువంటి దుష్ట శక్తులకు భయపడాల్సిన అవసరం లేదు. ఏ జాతక చక్రముల వెంట భ్రమించవలసిన అగత్యం లేదు.
బేరసార పద్ధతిలో భగవంతుని కొలిచే విధానం మాని నిష్కామ భక్తితో దైవాన్ని ఆరాధించి, మన కర్తవ్యాన్ని బాధ్యతని నిర్వర్తించుకుంటూ మన సంతోషంపట్ల ఇతరులకు హానికలుగకుండా నడుచుకొనిన నాడు సదా ఈశ్వరానుగ్రహం ఉంటూనే ఉంటుంది.
భక్తులల్లో ఏ అగ్రగణ్యునితీసుకున్నా వారంతా మన జీవితానికి ఆదర్శంగా నిలుస్తారు. ఎందుకంటే నిజభక్తులెపుడూ పేరు ప్రతిష్ఠలకోసం పోరాడలేదు. మనుగడ సుందరంగా ఆర్భాటంగా ఉండాలని అనుకోలేదు.. నలుగురి మంచిచేయాలని చూచేవారు కాని ఎక్కడా తమ తమ గొప్పతనాన్ని చాటాలను అనుకున్నట్టు కనిపించదు. ఎందుకంటే తుకారామ్ నిజానికి పాండురంగభక్తుడు. ఆ పాండురంగడే తుకారామ్‌కు సర్వులలోను కనిపించాడుకాని నరమానవులు ఎవ్వరూ కనిపించలేదు. అంతేకాదు తన వద్ద నున్న సంపదంతా కేవలం పాండురంగనిదిగానే భావించాడు. తనకున్న ది పరులకు ఇవ్వడానికి ఏమాత్రం జంకులేకుండా వ్యవహరించాడు.
అట్లే భక్త సక్కుబాయ కూడా తన అత్తమామలకు సేవలూ చేయడం ఏమాత్రం అలక్ష్యం కాని నిరుత్సాహం కాని చేసేది కాదు.. కాని నిరంతరం కృష్ణనామామృతం ఆస్వాదించడంలో ముందుండేది. ఇట్లా ప్రతి భక్తుడూ సర్వం విష్ణుమయంగా భావించేవారు. వారికి శివకేశవులకు భేదం కనిపించేదికాదు. ప్రాణికోటి అంతా భగవంతుని రూపుగా భావించేవారు కాని ఎక్కడా మరో ప్రాణి ఉందని అనుకొనేవారు కాదు. అట్లాంటి నిర్మలత్వాన్ని ప్రసాదించే భక్తిని ప్రతివారు అలవర్చుకుంటే భగవంతుని పైన ప్రేమను అంకురింపచేసుకొంటే సృష్టి యావత్తు ప్రేమమయంగా కనిపిస్తుంది. కనుక భక్తి సామ్రాజ్యంలోకి అడుగులు వేయడానికి ప్రయత్న పూర్వకంగా అడుగులు వేయాలి.

- చావలి శేషాద్రి సోమయాజులు