డైలీ సీరియల్

యమహాపురి 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేను చెప్పేదాకా నేనెవర్నో తెలియదంటావ్? అవతల నల్ల తేలొచ్చి కుట్టబోతుంటే నిన్ను కాదన్నట్లు కూర్చున్నావ్- ఏమయిందత్తా నీకు?’’ అంది లతిక ఆశ్చర్యంగా.
‘‘అదా, చిన్న తప్పు చేశానే్ల, దేవుడు బాబు కళ్లు తీయించేశాడు’’ అంది లచ్చమ్మ.
లతికకి కళ్లలో నీళ్లు తిరిగాయి. కళ్లుండీ లేని దౌర్భాగ్యం. కళ్లున్నట్లు ఏ మాత్రం ప్రవర్తించినా చిన్న తప్పు పెద్ద తప్పవుతుంది. ఆ తప్పుకి శిక్ష చాలా పెద్దగా ఉంటుంది.
‘‘ఇదీ నా ఊరు’’ అనుకుంది లతిక బాధగా. ‘‘జననీ జన్మభూమిశ్చ...’’ అన్న ఫీలింగ్ తనకెందుకు కలగడంలేదో లతికకు అర్థవౌతోంది.
లతిక ఇల్లు చేరేసరికి తల్లి బుచ్చమ్మ ఎసట్లో బియ్యం పోస్తోంది. కూతుర్ని చూడగానే ఆమె చకచకా బియ్యం పోసి, అన్నం గినె్నమీద చిల్లుల మూత పెట్టి గబగబా ఆమె వద్దకొచ్చింది. లతిక చెయ్యి పట్టుకుని గట్టిగా నొక్కి, ‘‘అరే, సెలవులిచ్చేశారేంటే- చాలా బాగుంది, ఈ రోజు నుంచి నీ సెలవులయ్యేదాకా ఈ ఇంట్లో పండగే పండగ’’ అంది ఇంత మొహం చేసుకుని.
అమ్మ స్పర్శకి లతికకు ఒక్కసారిగా తనువెల్లా పులకరించింది. పరవశంలో నోట మాట రాలేదు.
‘‘బాగా చిక్కిపోయావే- హాస్టల్లో తిండి బాగోలేదా?’’ అంది బుచ్చమ్మ కూతురి చెయ్యి వదిలి.
‘‘ఏ తిండయినా నీ వంటకి సాటిరాదు కానీ, నేనేం చిక్కలేదు. ఇందాకా భీమయ్య మామ కనిపించి- నాకు పట్నం నీళ్లు బాగా వంటబట్టాయని కూడా అన్నాడు’’ అంది లతిక.
‘‘వాడు చెప్పింది నిజమే మరి. నీకు వంటబట్టినవి నీళ్లే లాగుంది. ఎక్కడా తిండి తిన్న మనిషిలా లేవు. పద- కూర్చుని మాట్లాడుకుందాం’’ అంటూ చాప తెచ్చి పొయ్యికి కాస్త దూరంగా పరిచింది బుచ్చమ్మ.
ఇద్దరూ చాపమీద కూర్చున్నారు.
పట్నం వెళ్ళేక లతికకి అదే మొదటిసారి ఇంటికి రావడం. ఆమెకి తల్లితో పట్నం విశేషాలు పంచుకోవాలని ఆత్రంగా వలుంది. ‘‘పట్నం చాలా బాగుందమ్మా!’’ అంది ఉపోద్ఘాతంగా.
ఆమెతో మాట్లాడుతూనే పొయ్యివైపు చూస్తున్న బుచ్చమ్మ, ‘‘ఉండు, మూత ఎగిరెగిరి పడుతోంది. అన్నం ఉడికినట్లుంది. గంజి వార్చాలి’’ అంటూ లేచింది. లతిక తనూ లేచి వెళ్లి- తల్లి పనులు చేసుకుంటుంటే తను చెప్పుకుపోతోంది.
‘‘అమ్మా- మనమిక్కడ పొయ్యిలో కట్టెలు పెట్టి వంట చేస్తున్నామా? అక్కడంతా గ్యాస్ పొయ్యిలమ్మా! ఇలా మీట తిప్పి అలా మంట వెలిగించొచ్చు’’ అంది లతిక.
‘‘మన పొయ్యి మంట చూశావుగా- ఇది గ్యాసు మంటకేం తక్కువ కాదు’’ అంది బుచ్చమ్మ మామూలుగా.
‘‘అదేంటీ, అంత సింపుల్‌గా అనేశావ్- అసలు నువ్వెప్పుడైనా గ్యాసు పొయ్యి చూశావా?’’ అంది లతిక.
‘‘నాకు గ్యాసు పొయ్యి తెలియకేం- నాకే కాదు, మనూళ్లో చాలామందికి తెలుసు’’ అంది బుచ్చమ్మ.
‘‘ఔనా, ఎలా?’’ అంది లతిక ఆశ్చర్యంగా.
‘‘ఈ ఊళ్ళో నువ్వొకత్తివేనా చదువుకు పట్నం వెళ్లిందానివి. ఎన్నో ఏళ్లుగా ఎందరెందరో వెడుతున్నారు. వచ్చి చూసినవి చెబుతున్నారు. తప్పనిసరైతే తప్ప మేమా విశేషాలు పిల్లలదాకా రానివ్వం...’’
‘‘ఐతే పట్నం గురించి నీకింకా ఏమేం తెలుసో చెప్పు’’ అంది లతిక.
‘‘అక్కడ కరెంటు ఉంటుంది. టీవీలుంటాయి. సినిమాలుంటాయి..’’
‘‘ఇవన్నీ నీకు తెలుసు. చాలామందికి తెలుసు. మరి ఇవన్నీ మనూళ్లో ఎందుకు లేవు?’’ అంది లతిక.
‘‘మనూళ్లో ఏం కావాలన్నా మనమనుకుంటే చాలదు. దేవుడు బాబు అనుకోవాలి. ఆయనింకా అనుకోలేదు మరి..’’ అంటూ బుచ్చమ్మ అన్నం గినె్న మూత మీద కాసిని నిప్పులు వేసి వెళ్లి చాపమీద కూర్చుంది.
లతిక తనూ ఆమె పక్కన కూర్చుని, ‘‘అమ్మా, మరి పట్నంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు- బోలెడుమంది దేవుళ్లున్నారు. ఆ దేవుళ్లు మన యమ బాబులా మనిషిలా ఉండరు. బొమ్మల్లా ఉంటారు. వాళ్లకి మనుషులు పూజలు చేస్తారు. కానీ వాళ్లు మనుషులు చెప్పినట్లు వింటారు. అక్కడలా, ఇక్కడిలా, ఎందుకిలా?’’ అంది.
‘‘మనం మనిషిని దేవుణ్ణి చేస్తే, ఆ మనిషి దేవుడై తనకి మనని బానిసని చేసుకుంటాడు. మనం బొమ్మని దేవుణ్ణి చేస్తే ఆ దేవుడు మనం చెప్పినట్లు విని మనకి బానిసగా పడుంటాడు. అంతా మనసులోనే ఉంది’’ అంది బుచ్చమ్మ.
లతిక క్షణమాగి ‘‘ఐతే మనకి మనిషి దేవుడొద్దమ్మా! మనూళ్లోనూ బొమ్మనే దేవుణ్ణి చేసుకుందాం’’ అంది.
బుచ్చమ్మ నిట్టూర్చింది. ‘‘నేనన్నది నీకర్థం కాలేదు. ఐతే ఇలా అనుకోవు. బొమ్మని దేవుణ్ణి చెయ్యడం అందరికీ చేతకాదమ్మా! ఆ విద్య తెలిసినవారు కొందరే వుంటారు. వాళ్లు బొమ్మని దేవుణ్ణి చేసి- ఆ దేవుణ్ణి నమ్మిన వారందర్నీ తమకి బానిసలుగా చేసుకుంటారు. దేవుడంటూ ఉండాలి కానీ- మనిషి దూరంలో ఉన్నా ఒక్కటే, బొమ్మ రూపంలో వున్నా ఒక్కటే! మనిషి మనిషికి బానిస కాక తప్పదు. అదీ విషయం’’ అంది బుచ్చమ్మ.
‘‘ఐతే ఎప్పుడూ ఎక్కువమంది మనుషులు బానిసలుగా ఉండిపోవాల్సిందేనా?’’ అంది లతిక దీనంగా.
‘‘మనిషి బ్రతుకంతేనమ్మా! మొదట మనుషులు తమ బాగోగులు చూడ్డం కోసం ఒక రాజుని పెట్టుకున్నారు. ఆ రాజు తను బాగుపడి, తన తర్వాత తన వాళ్లందరూ తరతరాలుగా రాజ్యమేలే ఏర్పాటుచేసుకున్నాడు. అది జయప్రదంగా కొనసాగడానికి మిగతా మనుషులందర్నీ బానిసలుగా మార్చేశాడు. అలా కొన్నాళ్లు జరిగేక మనుషులు తిరగబడ్డారు. రాజరికాన్ని తొలగించి వారసత్వంతో నిమిత్తం లేకుండా తామే తమ నాయకుణ్ణి ఎన్నుకునే ప్రజాస్వామ్య వ్యవస్థని ఏర్పరచుకున్నారు. కానీ కొన్నాళ్లకు ఆ నాయకుడూ పూర్వపు రాజుల్లాగా తయారయ్యాడు. అప్పట్నించీ ఎవడు నాయకుడైతే వాడు మిగతా వాళ్లని బానిసలుగా చూడ్డం సంప్రదాయమైంది’’.

ఇంకా ఉంది

వసుంధర