డైలీ సీరియల్

యమహాపురి 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లతిక ఆశ్చర్యంగా తల్లి వంక చూసి, ‘‘మన వ్యవస్థ గురించి అరటి పండు వలిచిచ్చినట్లు చెప్పావు. ఇవన్నీ నీకెలా తెలుసమ్మా!’’ అంది.
‘‘కాస్త చదువుకున్న ఎవరికైనా ఈ మాత్రం తెలుస్తుంది. నా రోజుల్లో నేనూ ఇంటర్ దాకా చదివాను’’ అంది బుచ్చమ్మ.
‘‘నువ్వు ఇంటర్ చదివావా? మరి నాకెప్పుడూ చెప్పలేదే?’’ అంది లతిక ఆశ్చర్యంగా.
‘‘నేనూ నీ వయసులో పట్నం వెళ్లి ఇంటర్ చదివాను. మంచి మార్కులతో ప్యాసయ్యాను. ఇంకా ఇంకా చదవాలనుకున్నాను. కానీ దేవుడు బాబు ఒప్పుకోలేదు. అప్పుడిక పట్నంనుంచి వెనక్కి రాకూడదనకున్నాను. దానికీ దేవుడు బాబు ఒప్పుకోలేదు. నేను వెనక్కి రాకపోతే- మా అమ్మా నాన్నా చచ్చిపోతారని తెలిసి, వాళ్లని రక్షించుందుకు ఇక్కడికొచ్చాను. దేవుడు బాబు చెప్పాడని, మీ అయ్యని చేసుకున్నాను. అంతవరకూ నా పేరు భూమిక. దేవుడు బాబు చెప్పాడని, పెళ్లయ్యాక నా పేరు బుచ్చమ్మగా మార్చుకున్నాను’’.
ఈ కథ మొదటిసారిగా విందేమో, లతికకి షాక్ తగిలినట్లై నిశే్చష్టురాలైంది.
‘‘కాలుండీ లేనట్లు, కళ్లుండీ లేనట్లు నటించడం కంటే- ఓ భూమిక బుచ్చమ్మగా నటించడం ఎంత దారుణం!’’ అనుకుకందామె తేరుకున్నాక. బుచ్చమ్మ లతికనే నిశితంగా చూస్తూ, ‘‘నువ్వు పట్నం వెళ్లావు. అక్కడ మరో ప్రపంచం చూశావు. ఎప్పటికీ ఆ ప్రపంచంలోనే ఉండిపోవాలని నీకనిపించింది. కానీ నువ్వా ప్రపంచంలోకి వెళ్లాలనుకుంటే నేనూ, అయ్యా నీకీ ప్రపంచంలో మిగలం. ‘మేమేమైపోయినా ఫరవాలేదు- నువీ నరకపురి నుంచి వెళ్లిపో’ అనేటంత పెద్ద మనసు నాకు లేదు. నవమాసాలూ మోపి నిన్ను కన్నాను. ఈ చేతులతో పెంచాను. ఎప్పటికీ నిన్నొదులుకోలేను. అదీ నా పరిస్థితి. నాలాంటివాళ్లీ ఊళ్ళో ఇంకా కొందరున్నారు’’ అంది బుచ్చమ్మ.
‘‘నేనూ నిన్నొదులుకోలేనమ్మా!’’ అంది లతిక అప్రయత్నంగా. తల్లి గతం పూర్తిగా ఆమెకు తెలియకపోవచ్చు. కానీ నరకపురిలో పుట్టి పెరిగిన ఆమెకి తల్లి చెప్పిన మాటలు చాలవా- వాస్తవాన్ని అవగాహన చేసుకుందుకు!
‘‘అన్నట్లు అయ్యేడీ, పొలమెళ్లాడా?’’ అంది లతిక మాట మార్చుతూ.
‘‘వారానికోరోజు సెలవుగా మనకి. అదీ రోజయింది. అయ్యదేవుడు బాబింటికెళ్లాడు- కూరకి బీరకాయలు తెస్తానని! నీకు వంకాయ కూర మహా ఇష్టంగా, నువ్వొస్తావని తెలిస్తే అయ్యకి చెప్పేదాన్ని- బీరకాయలొద్దూ- వంకాయలడిగి తెమ్మని!’’ అంది బుచ్చమ్మ నొచ్చుకుంటూ.
అప్పుడు లతికకి గుర్తొచ్చింది. ‘‘అన్నట్లు- మన పెరట్లో వంగనారు వేశారుగా- ఇంకా కాపుకి రాలేదా?’’ అంది కుతూహలంగా.
‘‘ఇంకా కాపుకి రావడమా- విరగకాస్తుంటే! పద చూద్దువుగాని’’ అంటూ పెరట్లోకి నడిచింది బుచ్చమ్మ.
లతిక తల్లిని అనుసరించింది. ఇద్దరూ పెరట్లోకి వెళ్లారు.
వంగ మొక్కలు ఒత్తుగా ఎదిగాయి. వాటి ఆకుపచ్చని ఆకుల మాటున ఊదారంగు లేత వంగ పిందెలు- నోరూరిస్తూ కనులకు విందు చేస్తున్నాయి.
‘‘అబ్బ- నోరూరిపోతోందే! మంచి పిందెలు చూసి కోస్తానుండు’’ అంటూ కిందకి వంగబోయింది లతిక.
బుచ్చమ్మ కంగారుగా, ‘‘ఏయ్, ఏం చేస్తున్నవ్’’ అని ఆమె చెయ్యి పట్టుకుని వెనక్కు లాగింది.
‘‘ఏమయిందమ్మా?’’ అంది లతిక ఆశ్చర్యంగా బుచ్చమ్మని చూస్తూ.
బుచ్చమ్మ బదులివ్వలేదు. కానీ ఆమె చూపుల్లో లతికకి సమాధానం కనబడింది.
ఆ ఊళ్ళో పెరట్లో కాయలైనా సరే, ఎవరూ స్వంతానికి కోసుకోకూడదు. కోస్తే వెంటనే తీసుకెళ్లి దేవుడి బాబుకివ్వాలి. అవి తమకూ కావలనిపిస్తే ఆయన్ని ప్రాధేయపడి అడగాలి. ఆయన దయ తల్చి ఇస్తే తీసుకోవాలి.
అలా కాకుండా చొరవ చేసి కాయ కోసుకుంటే అది తప్పు. తప్పుకి శిక్ష అనుభవించాలి.
‘‘పట్నం వెళ్లి చదువుకోవాల్సిన పిల్లవి. కన్నో కాలో చెయ్యో లేకుండా అక్కడెలా మసలుతావమ్మా!’’ అంటున్నాయి బుచ్చమ్మ కళ్లు.
ఇస్సురంటూ వెనక్కి తిరిగింది లతిక.
‘‘ఏమనుకోకే- రేపెలాగో అలా నీ అయ్య- దేవుడు బాబు నొప్పించి వంకాయలు తెస్తాడు’’ అంది బుచ్చమ్మ, ఓదార్పుగా కూతురి భుజం నిమురుతూ. లతిక వెనక్కి తిరిగి మరోసారి వంగ మొక్కల్ని చూసింది.
ఆ మొక్కలు ఆమెని ఆప్యాయంగా చూస్తున్నాయి. వాటికి వ్రేలాడుతున్న కాయలు ‘‘మమ్మల్ని నీ చేతులతో తెంపుకుని నీ స్వంతం చేసుకో’’ అని ఆహ్వానిస్తున్నాయి.
అక్కడ మడి కట్టి, నారు నాటి, నీరు పోసింది తాము. ఆ మొక్కల మధ్య కలుపు తీసి శుభ్రం చేసింది తాము. ఆ ఫలితం తన కళ్లముందుంది. అనుభవించే స్వేచ్ఛ లేదు. లతిక తల్లి వైపు తిరిగి, ‘‘మా అమ్మ చదువుకున్నదనీ, ఇంతలా ఆలోచించగలదనీ నాకు తెలియదు. నువ్వూ నీలాంటివాళ్లూ కలిసి ఒక చోట చేరి మాట్లాడుకోవాలి. ఇప్పుడున్న ఈ పరిస్థితి మారేందుకు విప్లవం తీసుకురావాలి. మీరు ముందుంటే నేనూ నా వయసు పిల్లలం అంతా మీ వెనక ఉంటాం. అందుకు తగిన ఏర్పాట్లు చేసే బాధ్యత నాది’’ అంది.
బుచ్చమ్మ అనంగీకార సూచకంగా తల అడ్డంగా ఊపింది.
‘‘చూడమ్మా! ఇప్పుడు మనమున్నది ఇరవై ఒకటో శతాబ్దం కావచ్చు. కానీ ఇప్పటికీ మనని శాసించేది చదువు, వివేకం లేని మెజారిటీ జనం. వాళ్లని కాదని విద్యావంతులూ, వివేకవంతులూ కూడా ఏమీ చెయ్యలేరు. మన ఊళ్ళో కూడా అలాంటి జనానిదే మెజారిటీ. వాళ్లు దేవుడు బాబుకి నీరాజనం పడుతున్నారు. వాళ్లని అనుసరించడం మినహా మిగతా వాళ్లకి గత్యంతరం లేదు. ఐతే చీకటి వెనుక వెనె్నలలాగా- ఆ మెజారిటీ జనాన్ని ప్రభావితం చేసి, మన జాతకాలు మార్చగల అసాధారణ వ్యక్తి ఎక్కడో ఉండకపోడని నా ఆశ. ఆయన కోసం ఎదురుచూడ్డం మినహా ప్రస్తుతానికి మనం చెయ్యగలిగినదేం లేదు’’ అంది బుచ్చమ్మ.

ఇంకా ఉంది

వసుంధర