భక్తి కథలు

హరివంశం - 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమిత వేగంతో పరమ రభసంతో మీదికి ఉఱుకుతున్న పెద్ద పులిని నివారించలేని జింక కదుపుల్లాగా ఆ రాక్షసులు విహ్వలించిపోయారు. తత్తరపాటు చెందారు. అపుడు మహాబాహుడైన శ్రీమహావిష్ణువు తన చక్ర, గదా, ఖడ్గాలు ప్రయోగించి ఆ రాక్షసులందరినీ చీల్చి చెండాడి చంపివేశాడు.
ఈ విధంగా కాలనేమి అనుచరులైన అసురగణం కూడా హతులైనారు. ఇట్లా తారకామయం అనే ప్రసిద్ధినొందిన దేవాసుర యుద్ధం ముగిసింది. తారకాసురుడు, మయాసురుడు మొదలైన దుష్ట రాక్షసులు తమ పూర్వుల తోవతొక్కారు. మహారాక్షస సంహారం చేసి తన విశ్వరూపాన్ని వెలయించి దీప్తిమంతుడైన ఆదినారాయణుణ్ణి అభినందించటానికి, స్తుతించడానికి బ్రహ్మదేవుడు మహా తపస్వులు, సిద్ధులు తన వెంటరాగా అక్కడకు వచ్చాడు. అపుడు చతుర్ముఖుడు నారాయణుణ్ణి ఎంతో ప్రశంసించాడు.
దేవతలను, సన్మునీశ్వరులను ఎన్నో కష్టాల పాలు జేసే రాక్షసులను సంహరించటంలో నీవు తప్ప మరొకడు సమర్థుడు కాడు. ఈ ఘోర రాక్షసుడు నన్ను కూడా లెక్కపెట్టాడు. ఈ కాలనేమి అనుచరులు కూడా ఇందుకు తీసిపోయేవాళ్ళేమీ కారు. నారాయణమూర్తి! మూడు లోకాలను వీళ్ళు గడగడలాడించారు.
దేవలోకం కష్టాలు పోగొట్టావు. మళ్లీ ఇంద్రుణ్ణి స్థిరంగా నిలిచేట్లు చేశావు. ఈ మహాద్భుతమైన నీ పూనిక నాకెంతో మోదం కలిగించింది. నిన్ను సంప్రీతుణ్ణి చేద్దామని ఈ సిద్ధ సంయమి సమేతంగా వచ్చాను. అయితే నిన్ను సంప్రీతుణ్ణి చేయడం నా సాధ్యమా! త్రిలోకాలకు దిక్కు నీవేకదా! రక్షణ నీవల్లనే కదా లభిస్తుంది.
నిన్ను ఎట్లా సంతోషపెట్టగలను నేను? నీకు మనః ప్రీతి కలిగించాలని చెప్పుకోవటానికి నాకు సిగ్గుగా ఉంది. ఓ దేవాది దేవా! బ్రహ్మలోక వాసులైన మునులు నిన్ను దర్శించాలని వాంఛిస్తున్నారు. పరాత్పరా! వాళ్ళ కోరిక తీర్చాలి నువ్వు. కాబట్టి నా వెంట నిన్ను తీసుకొని పోతాను. రావల్సింది అని శ్రీమన్నారాయణుణ్ణి అరవిందాసనుడు ప్రార్థించాడు.
శ్రీమహావిష్ణువు ఇందుకు అంగీకరించాడు. అక్కడకు చేరిన ఇంద్రుడు, ఇంకా ఇతర దేవతాధీశ్వరులను విష్ణుమూర్తి ఇట్లా ఉద్బోధించాడు. కాలనేమితో సహా ఎందరో ఘోర రక్కసులు ఈ యుద్ధంలో హతులైనారు.
ఏ విధంగా తప్పించుకున్నారో బలి, రాహువు మాత్రం తప్పించుకున్నారు చావకుండా! లోకాలన్నీ ఇక సంతోషంతో ఉండుగాక!
లోకపాలురంతా తమ పూర్వపు బలప్రాభవాలతో వర్థిల్లుతారుగాక. ఇక ధర్మదేవత నాలుగు పాదాలతో నడుస్తుందిగాక! హవ్య కవ్యాలతో యజ్ఞాలు నిర్విఘ్నంగా సాగుగాక! అయితే మీరు నిరంతరం అప్రమత్తులై ఉండాలి. కుటిలురైన రాక్షసులు సమయం కోసం నిరీక్షిస్తూనే ఉంటారు. రాక్షస మాయలను ఒక కంటితో కనిపెట్టి ఏమరకుండా ఉండండి.
మీరు సాత్వికులు, సరళ స్వభావులు, అమాయకులు. మాయలో పడవద్దు అని దేవతలను ఊరడింపజేసి నారాయణుడు, పద్మసంభవుడితో బ్రహ్మ లోకానికి వెళ్లాడు. ఆ లోకంలో యజ్ఞ నిరతులైన మహా తపస్వుల నెందరినో ఆయన అభినందించాడు. సతత వేదనాదాలు ఆలించి పరమ సంతుష్టుడైనాడు. వాళ్ళందరికీ ప్రియం పలికాడు.
యజ్ఞాగ్నులకు ప్రదక్షిణించాడు ఆ పరమ పురుషుడు. బ్రహ్మలోకంలో యజ్ఞ నిష్ఠులైన యజమానులు, ఋత్విక్కులు, అక్కడ పరివేష్టించి ఉన్న దేవతలు సాక్షాత్తు యజ్ఞపురుషుడే అక్కడికి వేం చేయడం చూసి ప్రముదితులై పరవశించారు. ఆ జగన్నాథుణ్ణి భక్తి ప్రపత్తులతో అర్చించారు.

- ఇంకా ఉంది

-అక్కిరాజు రమాపతిరావు