డైలీ సీరియల్

యమహాపురి 11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురాపురిలో నేర నిరోధక నిధి ఇప్పుడు కోట్లలో వుంది. కొంత సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌లో వున్నా ఎక్కువ భాగం ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనూ, ప్రభుత్వ బాండ్ల రూపంలోనూ ఉంది. ఆ డబ్బు దుర్వినియోగం కాకుండా నియమావళి ఏర్పాటుచెయ్యబడింది.
దేనికైనా డబ్బు అవసరమైనప్పుడు- వినతి పత్రాన్ని ముందుగా పదిమంది సభ్యులున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ ముందుంచాలి. కమిటీ సిఫారసు చేశాక- చెక్కు డ్రా చెయ్యడానికి కమిటీ సభ్యుల్లో ముగ్గురి సంతకాలు చెక్కుమీద ఉండాలి. ఆ ముగ్గురిలోనూ కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలి. ఇంతవరకూ ఈశ్వర్ కార్యదర్శి. ఇక ముందు కార్యదర్శి శ్రీకర్.
నిధిని దుర్వినియోగం చెయ్యాలనుకుంటే ముందుగా కమిటీ సభ్యులు ఒకరితో ఒకరు లాలూచీ కావాలి. ఆ తర్వాత వారు ఈశ్వర్‌తో లాలూచీ కావాలి. కమిటీ సభ్యులు వివిధ రంగాలకు చెందినవారు. అందరికీ ఈశ్వర్ వ్యక్తిత్వం పట్ల భయగౌరవాలున్నాయి. అందువల్ల ఇంతవరకూ నిధి నిర్వహణ సక్రమంగా ఉంది. ఇకమీదట ఆ నిర్వహణ సక్రమంగా కొనసాగించాల్సిన బాధ్యత శ్రీకర్‌ది.
‘‘ఇందులో భయపడాల్సిందేం లేదు. నిజాయితీని నమ్ముకుంటే చాలు- నిర్వహణలో ఏ సమస్యా ఉండదు. నిజాయితీ గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నాకు తెలుసు. నేనిప్పుడు నీకు చెప్పబోతున్నది మన ఇన్‌ఫార్మర్సు గురించి’’ అన్నాడు ఈశ్వర్.
పోలీసు శాఖ సమర్థవంతంగా పని చెయ్యాలంటే డిపార్టుమెంటుకి చెందని కొందర్ని ఇన్‌ఫార్మర్సుగా నమోదు చేసుకోవాలి. అలా ఈశ్వర్ మధురాపురిలో కొందరిని పోలీసు ఇన్‌ఫార్మర్లుగా నమోదు చేసుకున్నాడు. వారి వివరాలు ఈశ్వర్‌కి తప్ప మరెవ్వరికీ తెలియదు. అతడా జాబితానిప్పుడు శ్రీకర్‌కి అందజేస్తాడు. శ్రీకర్ ఆ వ్యక్తుల వివరాలు రహస్యంగా ఉంచాలి.
మరో విషయమేమిటంటే ఈశ్వర్ బదిలీ మీద వెళ్లిపోతున్న విషయం. స్టేషన్లో స్ట్ఫాకి తెలుసు కానీ- మధురాపురి వాసులెవ్వరికీ తెలియదు. తెలిస్తే కలకలం రేగుతుంది. రేపు ఉదయం - మధురాపురం నేర పర్యవేక్షక సమితి కమిటీ సభ్యుల్ని స్టేషన్‌కి రప్పించి, కార్యదర్శిగా తన స్థానంలో శ్రీకర్‌ని నియమించి వెళ్లిపోతాడు ఈశ్వర్.
‘‘బదిలీ అనగానే పెద్ద హడావుడి. సన్మాన సభలు. ఇవన్నీ నాకు నచ్చవు. నేను వెళ్లిపోతున్నట్లు ప్రచారమైతే నేరస్థులు మళ్లీ విజృంభిస్తారని వాళ్లకి నచ్చచెబుతాను. చాపకింద నీరులా నువ్వు నా స్థానం తీసుకుంటావని వివరిస్తాను. ఐనా వాళ్లు నా వీడ్కోలుకి ఏమైనా చెయ్యాలని ప్రయత్నించినా ఏర్పాట్లకు వ్యవధి ఉండదు. నా ప్రయాణం కూడా రేపే’’ అన్నాడు ఈశ్వర్.
శ్రీకర్ ముఖంలో రవంత కలవరం. ‘‘మీ వంటివారి స్థానాన్ని తీసుకోవాలంటే భయంగా ఉంది నాకు, ఐనా ఇక్కడింత పేరు తెచ్చుకున్న మిమ్మల్ని వేరెక్కడికో బదిలీ చెయ్యడమేంటి సార్- అన్యాయంగా’’ అన్నాడు.
‘‘నా బదిలీ నాకన్యాయం చెయ్యడానికి కాదు. వ్యాఘ్రపురికి న్యాయం చెయ్యడానికి. దాన్ని మరో మధురాపురిగా తయారుచెయ్యడం నాకిచ్చిన మిషన్!’’ అని, ‘‘వ్యాఘ్రపురి గురించి వినే ఉంటావ్!’’ అని నవ్వాడు ఈశ్వర్.
‘‘వ్వాట్?’’ అన్నాడు శ్రీకర్. అతడికి వ్యాఘ్రపురి తెలుసు.
వ్యాఘ్రపురి నేరస్థులకు శిక్షణ కేంద్రం లాంటిది. అక్కడ కరడు కట్టిన నేరస్థులున్నారు. వారిలోంచి పుట్టుకొచ్చిన మహానేతలున్నారు. వారు దేశభక్షకులు. వ్యాఘ్రపురి రక్షకులు. అక్కడ సంస్కరణలకు ప్రయత్నిస్తే- మనిషి సంస్మరణకు కూడా మిగలడని చెప్పుకుంటారు.
‘‘ఇది చాలా అన్యాయం సార్!’’ అన్నాడు శ్రీకర్.
‘‘వ్యాఘ్రపురిలో నేరస్థులే కాదు ప్రజలూ ఉన్నారు. నేతలనెన్నుకుందుకు వారికి ఓట్లున్నాయి కానీ తమకి న్యాయం చేసే వారిని ఎన్నుకుందుకవి పనికిరావు. తమకి న్యాయం చెయ్యాలనుకునేవారికివ్వడానికి వారి వద్ద దీవెనలున్నాయి. ఉత్త దీవెనలేనా అనుకోకుండా వాటికి విలువిస్తే- సామాన్యుడు కూడా శ్రీరాముడంతటివాడై స్నేహానికి కోతిమూకలే దొరికినా, వాటి సాయంతోనే రాక్షసుల్ని కూడా మట్టుపెట్టగల్గుతాడు’’ అన్నాడు ఈశ్వర్.
శ్రీకర్ ముఖంలో కలవరం. ‘ఏమో సార్! ఇంతవరకూ వ్యాఘ్రపురి రాక్షసుల్ని ఎవరూ ఏం చెయ్యలేకపోయారు. అంటే ఆ జనం దీవెనలు పనికిరానివి అనుకోవాలి. లేదా ఇంతవరకూ వారెవర్నీ దీవించలేదనుకోవాలి. మరిప్పుడు మీ విషయంలో ప్రత్యేకంగా ఏదో జరుగుతుందని ఎలా అనుకోగలను? మీరు సామాన్యుడు కాదు సార్! కానీ వ్యాఘ్రపురికి వెడితే సామాన్యుడికంటే తగ్గిపోతారు. మిమ్మల్ని వ్యాఘ్రపురికి బదులు మరెక్కడికైనా పంపడం న్యాయమని నాకనిపిస్తోంది. నా అనుమానం- మనసులో మీకూ అలాగే అనిపిస్తోందని..’’ అన్నాడు.
ఈశ్వర్ ముఖం గంభీరంగా అయిపోయింది. కుర్చీలో వెనక్కి జారగిలబడి కళ్లు మూసుకున్నాడు. కాసేపు అడ్డంగా, కాసేపు నిలువుగా తల ఊపాడు. తర్వాత కళ్లు తెరిచి, ‘‘ఇప్పుడు నీ ముందు నేనో బాంబు పేలుస్తున్నాను. గుండె చిక్కబట్టుకో’’ అన్నాడు.
శ్రీకర్ ఆశ్చర్యపోయాడు. ‘‘బాంబా’’ అన్నాడు ఏమనాలో తెలియక. అతడి బుర్ర మాత్రం చురుగ్గా పనిచేస్తోంది. ఈశ్వర్ చెప్పబోయే ఆ బాంబులాంటి వార్త ఏమిటోనని!
‘‘మధురాపురిలో సాధించినదానికి నాకు పూర్తి సంతృప్తి కలిగింది. కానీ మధురాపురి ఒక సామాన్య ప్రాంతం. ఇక్కడ శాంతిభద్రతలు సాధించడానికి- గట్టి పట్టుదల ఉంటే చాలు. జనం నియమాలకు లోబడి ఉంటారు. సామాన్యమైన ప్రలోభాలకు లొంగి నియమోల్లంఘనకు పాల్పడరు. ఎటొచ్చీ చుట్టుప్రక్కల ఎక్కడైనా సరే అసామాన్య శక్తులుండి, వాటి దృష్టి వాళ్లమీద పడితే- మళ్లీ శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుంది.

ఇంకా ఉంది

వసుంధర