భక్తి కథలు

హరివంశం -106

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృ ష్ణుడికి చాలా ఆగ్రహం కలిగింది. తన కౌమోదకిని (గద) చేత ధరించి జరాసంధుడిని పరిమార్చాలని ముందుకురికాడు. గదతో మోదాడు. పిడికిటి పోట్లు పొడిచాడు. అరచేతితో వాడి ఎదురురొమ్ము బలంగా తాటించాడు.
అప్పుడు జరాసంధుడు మోకరిల్లినట్లు ముందుకు తూలి నేల మీద కూలి ఊగిసలాడాడు. చేతిలోని గద జారిపోయింది. సజ్యం చేసిన విల్లు చేతినుంచి జారిపోయింది. రథం వైపు చూసే ధైర్యం కూడా లేకపోయింది అతడికి. ప్రాణాలు దక్కించుకోవటానికి అటూ ఇటూ చూసి నక్కి పలాయన మంత్రం పఠించాడు.
జరాసంధుడి పాటు చూసి ఆయనకు సహాయం చేయటానికి వచ్చిన రాజులు తత్తరపాటు చెంది పిక్క బలం చూపారు. ఇట్లా యుద్ధ రంగం నాటకం ముగిసిన బోసిపోయిన రంగస్థలం అయిపోయింది. మాధవుడు తన పాంచజన్యం అరివీర భయంకరంగా పూరించాడు. బలరాముడు సింహనాదం చేశాడు. దేవతా గణాలన్నీ ప్రహర్షం చెందాయి.
బలరాముడూ, కృష్ణుడు మళ్లీ మానుష రూపాలతో గోమంతం చేరి కొన్ని రోజులు విశ్రాంతి ననుభవించారు. అంతట చేది భూపతి, కారూశ దేశాధిపతితో కూడి కొంత పరివారాన్ని, రెండు రథాలను తీసుకుని వారున్న చోటికి వచ్చాడు.
‘కృష్ణా! నేను నీ మేనత్త పెనిమిటిని. చేదిరాజును. తమఘోషుణ్ణి. జరాసంధుడికి నేను హితవు చెప్పాను. వాసుదేవుడితో వైరం వద్దు అని ఎంత చెప్పినా వినలేదు జరాసంధుడు. మగధేశుడి గర్వం బాగా అణచివేశావు. నాకు వాడి పట్ల సద్భావం కాని, సఖ్యత కానీ ఏమీ లేవు. ఎప్పుడో వాణ్ణి పరిత్యజించి ఉండాల్సింది. ఇప్పుడందుకు సమయం కూడా సానుకూలమైంది. వాడు బాగా భంగపడ్డాడు. కాని నీ మీద కక్ష సాధింపు వాడు వదులుకోడు. నేను నీ పక్షమే. అందువల్ల నీకు మేలు కలగాలని వచ్చాను. జరాసంధుడు పాపాత్ముడు. పగ సాధిస్తూనే ఉంటాడు. మళ్లీ అదను చూసుకొని వస్తాడు. అది అట్లా ఉంచు. ఇప్పుడీ ప్రదేశమంతా అడుగు మోపటానికి కూడా వీలు లేనంత కశ్మలంగా ఉంది. ఎటు చూసినా జంతు కళేబరాలు, గుట్టలు గుట్టలు మనుష్య శవాలు. ఇక్కడ మనం ఉండవద్దు.
ఇక్కడకు దగ్గరలోనే కరవీరపురం ఉంది. దానిని స్వగాల వాసుదేవుడనే వాడు ఏలుతున్నాడు. నీ పట్ల వాడికి మాత్సర్యం ఇంతా అంతా కాదు. వాడొట్టి దుష్టుడు. నీ మీద అక్కసుతో తానే వాసుదేవుణ్ణి అనిపించుకోవటానికి తాను కూడా తన పేరుకు వాసుదేవుడనే పేరు తగిలించుకున్నాడు.
శత్రు శేషం ఉంచటం ఎందుకు? ఈ దురాత్ముణ్ణి కూడా ఈ సందర్భంలోనే పరిమార్చటం నీకు అవశ్య కర్తవ్యం. దీనికోసం నేను శ్రేష్ఠమైన రధాలు రెండు తీసుకొని వచ్చాను. చాలా వడిగా పోతాయి వీటి గుర్రాలు. చాలా మేలు జాతికి చెందినవి అని దమఘోషుడు అనునయంగా, ప్రియంగా కృష్ణ బలరాములను కోరాడు.
శ్రీకృష్ణుడికి తమ మేనత్త మగడి పట్ల చాలా ఆదరం కలిగింది. ప్రియావలోకనంతో అతణ్ణి ఆదరించాడు. ‘మామా! నీవు చుట్టరికం పాటించటమే కాక మా పట్ల ప్రేమ కూడా చూపావు. నీ ఆలోచన మాకు నచ్చింది. నీవు మాకు అండగా రావటం మాకెంతో శుభప్రదం. అవశ్యం మేము నీ మాట పాటించాలి. చూశావు కదా! ఇపుడు ఈ రణరంగంలో మా వీర విక్రమ విహారం. ఈ సృగాలుడంటే మాకొక లెక్కా పత్రమా! ఇక ఆలస్యమెందుకు, నీవు మాకు తోడు నీడై ఉండగా! బయలుదేరుదాము’ అని దమఘోషుణ్ణి ఉత్సహపరిచాడు మధుమధనుడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు