డైలీ సీరియల్

పూలకుండీలు - 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడ్నుంచి తొమ్మిది నెల్లపాటు బీజ రూపంలో వున్న తమ బిడ్డలను ఆ గద్దె గర్భంలో పెరగనిచ్చి కాన్పు కాగానే అనుకున్న ప్రకారం వాళ్ళ డబ్బులు వాళ్ళకిచ్చి ఎవరి పిల్లను వాళ్ళు తీసుకుపోతారు. ఇదంతా మూడో కంటికి తెలియకుండా జరిగిపోతుంది. అందుకే ఇందాకటినుంచి నీకు వెంటనే చెప్పడానికి భయపడ్డాను’’ అద్దె గర్భాలను గురించి తనకు తెలిసిన విషయాన్ని, తనకు తెలిసిన పరిభాషలో శాంతమ్మకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ చెప్పుకొచ్చాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘ఇదంతా నీకెట్లా తెలుసు?’’ నమ్మలేని నిజాన్ని మొదటిసారిగా వినడంతో దిగ్భ్రాంతికిలోనైన శాంతమ్మ ఓ విధమైన గందరగోళంలో పడిపోతూ అడిగింది.
‘‘ఆర్‌ఎంపి డాక్టర్‌గా నేను సంచిపట్టి ఇప్పటికి దగ్గిర దగ్గిర పాతికేండ్లు కావస్తుంది. ఈ జిల్లాలో నాకు తెలియని డాక్టర్ లేడంటే నమ్ము. వాళ్ళ ద్వారా నాకు కచ్చితంగా విషయం తెలుసు కాబట్టే చెబుతున్నా. నా మాట నమ్ము పిల్లలుగలదానివి బాగుపడతావు. నువ్వు హైదరాబాద్ పోగానే హాస్పిటల్‌కు తీసుకపోయి ఇంజెక్షన్ చేయించి కాన్పు అయిందాకా అక్కనే్న వుంచుతారు. అక్కడ నీకు కోరిన తిండి పెడతారు. కట్టిన బట్ట ఇస్తారు. కాన్పు అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు నీ చేతికి మూడు లక్షల రూపాయలిస్తారు.
చెప్పగూడదు గాని నేనిప్పటికే నలుగురైదుగురు ఆడవాళ్ళను ఈ పనిమీదనే హైదారాబాద్ పంపించాను!’’ అంటూ ఆర్‌ఎంపి లింగయ్య ఇంకా ఏదో చెప్పబోతుండగా అతనికి అడ్డుపడిన శాంతమ్మ ‘‘నీ ఇంట్లో పీనిగెల్ల లోఫర్ ముండాకొడకా! నీగ్గూడా అక్కచెల్లెలున్నారుగదరా! వాల్లను పంపరాదు ఆ లక్షలెయ్యో నీకే వస్తాయి గదా’’ అంటూ అతని మీదకు రేచుక్కలా లేచింది.
అప్పటిదాకా తను చెప్పిందంతా శాంతంగా వినుకుంటూ వచ్చిన శాంతమ్మ కాస్త ఒక్కసారిగా అడ్డం తిరగడంతో బిక్కచచ్చిపోయిన ఆర్‌ఎంపి లింగయ్య రెప్పవాల్చడం కూడా మర్చిపోయి భయం భయంగా ఆమె వంకే చూడసాగాడు.
శాంతమ్మ నోరు పట్టని తిట్లు తిడుతూనే వుంది.
శాంతమ్మ మాటలు వినలేక చెవులు మూసుకున్న ఆర్‌ఎంపి లింగయ్య ‘‘ఇదుగో చెల్లే! నేను నీకు ముందే చెప్పాను. నేను చెప్పేదంతా విని నీకు నచ్చితే చెయ్యి, నచ్చకపోతే వదిలెయ్యమని. దానికి సరేనన్నావు. తీరా చెప్పాక నీ నోటికొచ్చినట్టు మాట్లాడ్డం ఏంబాగోలేదు’’ మర్యాద తప్పి మాట్లాడుతున్నావన్న హెచ్చరికతో మాట్లాడాడు.
అతని మాటలు విన్న శాంతమ్మ కోపం, పొంగుమీద నీళ్ళు చిలకరించినట్టుగా చప్పున చల్లారిపోతుంటే ‘‘సరే ఏందో చెప్పు’’ అన్నట్టు చూసింది.
‘‘వేరే చెప్పేదేముంది? నువ్వు గనుక నేను చెప్పినట్టు విని నడుచుకుంటే మూడు లక్షల రూపాయలు ఒక్కసారిగా వచ్చి నీ ఒళ్ళో పడతాయి. ఒక్కసారే అంత డబ్బు ఇప్పటిదాకా నీ జీవితంలో చూసి కూడా వుండవు. హైదరాబాద్ పొయ్యి ఒక పదినెల్లు కళ్ళు మూసుకున్నావంటే మీ అప్పులన్నీ తీరిపోవడమే గాదు, ఇన్నాల్లుగా నువ్వనుకుంటున్నట్టు ఇంటిమీద స్లాబ్ గూడా పడిపోద్ది.
అంతేగాదు నీ పిల్లలకు మూడు పూటలా కడుపునిండా అన్నం పెట్టుకోవచ్చు. వంటినిండా ఆయమన్న గుడ్డలు తొడగవచ్చు. నా మాట కాదని వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకొని నువ్విక్కడ ఎన్ని ఇండ్లల్లో ఎనే్నండ్లు పాచిపన్లు చేసినా, నీ పెనిమిటి వంటరిగా ఎక్కడో కానని రాజ్యంలో రెక్కలు ముక్కలు చేసుకున్నా అంత డబ్బు రాదు.
పైగా ఒక్కమాట అర్థం జేసుకో నువ్వు పరాయి మగాడితో కలిసి తప్పు చెయ్యడంలేదు. జ్వరమొస్తే ఇంజెక్షన్ చేయించుకున్నట్టు ఓ ఇంజెక్షన్ చేయించుకొని పదినెల్లపాటు దొరసాని మాదిరిగా బతికి వాళ్ళ బిడ్డను వాళ్లకు కని ఇచ్చేస్తే చాలు. ఇందాక చెప్పినట్టు మూడు లక్షలొచ్చి నీ చేతిలో పడతాయి. నా మాటలు బాగా ఆలోచించుకొని ఏ సంగతీ ఎల్లుండికల్లా వచ్చి చెప్పు’’ అంటూ శాంతమ్మకు పదే పదే లక్షల గురించి ఊదరగొడుతూ వివరించి మళ్లా ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వగూడదన్నట్టు బైక్ స్టార్ట్ చేసుకుని దుమ్ము రేపుకుంటూ భద్రాచలం రోడ్డు వైపుగా దూసుకుపోయాడు ఆర్‌ఎంపి లింగయ్య.
ఒక్కసారిగా వల్లంతా నిస్సత్తువ ఆవహించినట్టుగా పది నిమిషాల పాటు ఆ తెల్లతుమ్మ చెట్టు కిందనే నిలబడిపోయిన శాంతమ్మ ‘‘వీడి డబ్బులమీద వీడిమీద గత్తరబడ. ఇల్లు, పిల్లలను విడిచిపెట్టి పట్నం బొయ్యి ఎవలకో ఇంజెక్షన్ బిడ్డను గని ఇచ్చిరావల్నంట! వాడు ననే్నమనుకుంటున్నాడో ఏందో? నేను కూటికి పేదదానే్నమోగాని గుణానికి పేదదాన్నిగాను.
ఆ పనిమీద వాడు ఇప్పటికే నలుగురైదుగుర్ని హైదరాబాదు పంపించానంటున్నాడు. వాళ్ళదగ్గరెంత కమీషన్ గుంజాడో!? వీడి సంపాదన వీడు పాడుగాను ఎన్ని రకాలుగా సంపాయిస్తాడో! ఇంత ఆగావుగా సంపాదించిందంతా వాడు సచ్చిన్నాడు బొంద మీదేసుకుపోతాడా?’’ అంటూ పరి పరివిధాలుగా ఆలోచిస్తూ నిలబడిపోయిన శాంతమ్మ తన చుట్టూ చీకటి ముదురు రంగు నల్ల దుప్పటిని నిండుగా కప్పుకున్న విషయాన్ని కూడా గమనించలేదు.
సరిగ్గా అదే సమయంలో...
శాంతమ్మ వాళ్ళ ఇంటికి రెండిండ్ల ఆవల వుండే ఖాసీంబీ నవభారత్ సెంటర్లోని ఓ ఫ్యానీ షాప్‌లో సేల్స్‌గర్ల్‌గా డ్యూటీ చేసుకుని ఇంటికి తిరిగివస్తూ తెల్ల తుమ్మ చెట్టు కింద నిల్చున్న శాంతమ్మను చూసి ‘‘ఏంది బాబీ! ఇంత చీకట్లో చెట్టుకింద ఇట్లా వంటరిగా నిలబడ్డావేంది?’’ అంటూ పలుకరించింది.
ఖాసీంబీ మాటలతో ఆలోచనల్లోనుండి ఉలిక్కిపడుతూ బయటకొచ్చిన శాంతమ్మ ‘‘ఏం లేదు బాబీ! ఇప్పుడే పెద్దతాసుపామొకటి బుస్ బుస్‌మని బుసలు కొట్టుకుంట నా దారికి అడ్డమొచ్చింది.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు