డైలీ సీరియల్

యమహాపురి 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుందరం నాప్‌కిన్‌తో చెయ్యి తడుచుకుంటూ, ‘‘నీది నిజంగా కుతూహలమా? లేక నేనడిగానని మొక్కుబడికి ఓసారి అడిగేవా?’’ అన్నాడు.
‘‘అదేంటండీ- నరసింహంగారు మన కాంప్లెక్సులోనే ఉంటున్నారు. అర్జంటని మరీ కబురంపారు. ఆపైన ఆడదాన్ని- కుతూహలముండదా?’’ అంది రేవతి.
అంతవరకూ లేని కుతూహలం ఇప్పుడామె కళ్లలో స్పష్టంగా కనబడింది సుందరానికి.
‘‘సరే, అయితే ఇప్పుడు నేనూ నీకోసం టైం చేసుకోవడం న్యాయం! ముందీ ఉత్తరం నువ్వే చదువు. తర్వాత మాట్లాడుకుందాం’’ అంటూ సుందరం తన జేబులోంచి తీసి ఉత్తరాన్నామెకు అందించాడు.
అతడు వెళ్లి డ్రాయింగ్ రూంలో ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నాడు.
ఆమె ఉత్తరం చదువుతూ వచ్చి అతడి పక్క కుర్చీలో కూర్చుంది. ఉత్తరం చిన్నదే- చదవడానికి రేవతికి రెండే నిముషాలు పట్టింది. కానీ అందులో విశేషం మాత్రం ఆమెకి చాలా పెద్దది.
‘‘ఏమిటీ- తులసి ఎవరితోనో వెళ్లిపోయిందా? నమ్మలేకపోతున్నా’’ అందామె ఆశ్చర్యంగా.
‘‘ఎవరితోనో కాదు- స్కూల్ బస్ క్లీనరుతో. వెళ్లిపోలేదు- లేచిపోయింది’’ అన్నాడు సుందరం.
‘‘అబ్బా- అలా మోటుగా మాట్లాడకండీ, పాపం ఇంట్లో వాళ్ళెంత అప్సెట్టయ్యారో!’’ అంది రేవతి. ఇందాకటి ఆశ్చర్యం ఇప్పుడు జాలిగా మారింది.
‘‘చూడు రే! మన ఎమోషన్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాటిని పొదుపుగా వాడాలి. అవసరమైన చోటే వాడాలి. ఇప్పుడు నువ్వు జాలిపడాల్సింది నరసింహం కుటుంబంమీద కాదు, నా మీద! ఎందుకంటే- తులసిని వెదికి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాకప్పగించాడాయన. అదీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా చెయ్యాలిట’’ అన్నాడు సుందరం.
‘‘ఔనండీ! విషయం బయటపడితే వాళ్లు నలుగురిలో తలెత్తుకోలేరు కదా, పాపం!’’
‘‘అందుకే ఆయన ఉత్తరం రాసి కొడుకు చేత పంపాడు. స్వయంగా వచ్చి చెప్పడానికి ముఖం చెల్లదు. కొడుకు ద్వారా నోటిమాటగా చెప్పిద్దామంటే- చిన్న కుర్రాడికి రహస్యం దాచడం తెలియక- ఊరంతా టాంటాం చేస్తాడని భయం. ఫోన్లో చెబితే- టాప్‌ఔతుందని భయం. విషయం ఆయనకీ, ఆయన పెళ్లానికీ మధ్యే ఉండిపోవాలనుకున్నాడు. ఆపైన నిన్నూ నన్నూ నమ్మాడు’’ అన్నాడు సుందరం.
‘‘ఔనండీ, ఇలాంటి విషయాలు ఆత్మీయులకి తప్ప చెప్పుకోలేరు. మీరు ఎలాగోలా ఆ అమ్మాయిని వెతికి పట్టుకోండి! ప్లీజ్’’ అంది రేవతి.
‘‘నేనెందుకు వెతికి పట్టుకోవాలీ- ఆ పనేదో ఆయనే చెయ్యొచ్చుగా!’’ అన్నాడు సుందరం చిరాగ్గా.
‘‘మీది పోలీసు డిపార్టుమెంటు. మీరు తెలిసిన వాళ్లు. అందుకే ఈ పని మీకు చెప్పారు..’’
రేవతి ఏదో అనబోతూండగా, ‘‘ఆగు రే! నేను పోలీసు కానిస్టేబుల్నయినంత మాత్రాన అందరి పనులూ నెత్తిమీదేసుకోను కదా! నాకు రిటెన్‌గా కంప్లయింట్ కావాలి. అది డిపార్టుమెంట్లో నమోదు చెయ్యాలి. పై ఆఫీసురు డ్యూటీ వెయ్యాలి. ఈయనేమో- విషయం ఎవరికీ చెప్పొద్దు, రహస్యంగా ఉంచు- అంటాడు. ఎలా కుదురుతుంది?’’ అన్నాడు సుందరం.
‘‘ఊరికే అలా అంటారు కానీ- మీరు తల్చుకుంటే- ఇది మీకు కష్టమా? మొన్నటికి మొన్న ఊరి చివర శివాలయం కొండ మెట్లమీద అడుక్కు తినే బిచ్చగాడు చచ్చిపోతే- మీరేం చేశారు? దానిమీద దర్యాప్తు జరిపి బిచ్చగాడి శవాన్ని పోస్టుమార్టంకి పంపే ఏర్పాటుచేశారా, లేదా? ఎవరో బిచ్చగాడు కుక్కచావు చస్తే దానికంత హడావుడెందుకూ- అనుకున్నారా, లేదే! ఇంకా కూపీ లాగుతూనే ఉన్నారు. మరి మనకి బాగా తెలిసిన నరసింహంగారి విషయంలో ఇలా అనొచ్చా? పాపం, తులసి. మనకి రోజూ కనబడే పిల్ల. కనబడితే చాలు. ఆంటీ అని ఇంత మొహం చేసుకుని నవ్వుతూ పలకరిస్తుంది. మీ గురించి కూడా అంకుల్ని చూస్తే ఐజీలా అనిపిస్తారు. కానిస్టేబులంటే నమ్మబుద్ధి కాదంటుంది అభిమానంగా!’’ అంది రేవతి. ‘‘నా మొహం చూసి ఐజీ అనుకుంటే ఐపోతానా? నేనూ అనుకున్నాను. తులసి మొహం చూసి- ఇంజనీరో, డాక్టరో ఔతుందని! అయ్యేదేమో- ఇప్పుడా క్లీనరు కుర్రాడితో లేచిపోకపోతే! ఐజీని కాకపోయినా ఎప్పటికైనా నేను ఇన్స్‌పెక్టరునైనా ఔతానేమో- ఆ పిల్ల విషయంలో మాత్రం ఇక అంతే సంగతులు’’.
‘‘అదేంటండీ. తులసిని వెతికి పట్టుకుని- ఉపకారం చేస్తారనుకుంటే- ఇలా శాపనార్థాలు పెడతారేంటి? ఓ ముష్టాడికిచ్చిన విలువ- మన ఇరుగూ పొరుగూకివ్వరా?’’ మందలించింది రేవతి.
‘‘మాటిమాటికీ ఆ ముష్టాడి మాట తెస్తావేం? ఇద్దరి కథలకీ ఎక్కడా పోలిక లేదు’’ విసుక్కున్నాడు సుందరం.
‘‘పోలికుందని నేనన్నానా? వాడి గురించే అంతలా పట్టించుకునే మనిషి, మన తులసిని వెంట్రుక ముక్కకన్నా హీనంగా తీసిపారేయటడం బాగోలేదంటున్నా’’ అంది రేవతి.
‘‘చూడు రే! ఆ ముష్టాడు ఆకలితో పట్టడన్నం కావాలని అడిగాడు. ఆ కుర్రాడు విషమిచ్చి చంపేశాడు. అది అన్యాయంగా లేదూ?’’ ఆ కుర్రాడు శాడిస్టేనా అయుండాలి. లేదా వాళ్ళిద్దరిమధ్యా ఏదో మిస్టరీ ఐనా ఉండాలి. అందుకే నాకా కేసుమీద ఇంట్రస్టు. ఏళ్లు పదహారైనా నిండకుండా ఒళ్లు కొవ్వెక్కి, ఎవడో ఒకడు మగాడైతే చాలని లేచిపోయేవాళ్లని నేనెందుకు పట్టించుకోవాలి?’’ అన్నాడు సుందరం.
‘‘తులసి అమాయకురాలండీ! ఆ క్లీనరుగాడు ఆమెని మాయమాటలతో...’’
ఆమె ఇంకా ఏదో అనబోతుండగా, ‘‘ఆగు రే!’’ అన్నాడు సుందరం కాస్త గట్టిగా.
అతడి గొంతులోని తీవ్రతకు ఆశ్చర్యపడి ఆమె మాట్లాడ్డం ఆపేసింది.
‘‘తులసి అమాయకురాలు కాదు. నన్ను అంకులని పలకరించేదా? కానీ నాకేసి చూసే చూపులు ఎలా ఉండేవో తెలుసా- నన్నిష్టపడే ఆ ఆడపిల్ల చూపుల్లా! తను వేసుకునే డ్రెస్సులెలాగుండేవో తెలుసుగా- చూడగానే వయసులో ఉన్న ఆడపిల్ల అని స్పష్టమయేటంతలా...’’
రేవతి దెబ్బతిని, ‘‘కాలాన్నిబట్టి వేషం మారుతుంది. ఈ రోజుల్లో ఆడపిల్లలంతా ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారో తనూ అలాంటివే వేసుకుంటోంది’’ అంది.

ఇంకా ఉంది

వసుంధర