భక్తి కథలు

హరివంశం 159

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు చూశావు కదా జలార్గవాన్ని, మహా పర్వతాలను శాసించి అల్పకాలంలో వాళ్ళను తెచ్చి ఆ బ్రాహ్మణుడికిచ్చాను అని చెప్పాడు కృష్ణుడు. తన పట్ల ప్రీతితో ఇంకా ఈ విషయాలు బోధించాడని కూడా అర్జునుడు అన్నగారికి చెప్పాడు.
పరమేశ్వరుడు, పరబ్రహ్మ, పరమాత్మ నాకంటే వేరు కాడు. ఆదిపురుషుణ్ణి నేనే. అంభోధులు, గిరులు, భువనములు, దిశలు కాలమునే నేను. సృష్టి స్థితి లయాలకధీశుణ్ణి నేను. చతుర్వేదాలు నేనే. యజ్ఞాలు నేనే. ప్రణవం మొదలైన మంత్రాలు నేనే. యమ నియమాలు భూగగన వాయు నీరవహ్ని సూర్య చంద్ర అగ్నులు నా స్థూల రూపాలు. నా తేజస్సు ఈ లోకాలన్నిటినీ ఆవరించి ఉంది. శ్రుతి శాస్త్ర మధిత విజ్ఞానం ఆశ్రయించిన సాధనపరులు నిత్య సిద్ధి ప్రాప్తింపజేసుకుంటారు. ఆ విజ్ఞానం నేనే లోకంలో ప్రవర్తింపజేశాను. బ్రాహ్మణులను, బ్రహ్మము, సత్యము, తపస్సు, లోకంలో ధర్మానికి స్థానంగా నేను సృష్టించాను. నాకు ప్రియసఖుడివి, నిర్మలుడివి కాబట్టి నీకు గోప్యమైన ఈ విజ్ఞానాన్ని బోధించాను. ఈ విధంగా గోవిందుడి మాహాత్మ్యం స్వయంగా చూశాను, ఆయనవల్లనే విన్నాను అని ధర్మరాజుకు, అర్జునుడు తెలిపాడు. ఇది వేద రహస్య విజ్ఞానం,. అధ్యయనంవల్ల ఉపాసనవల్ల, మనస్సంయమంవల్ల, అంతర్బాహ్య శౌచ దయాంతఃకరణవల్ల మాత్రమే ఈ పరమార్థం ఎవరికైనా బోధపడుతుంది. శ్రీకృష్ణుడి దివ్యగాథ హరివంశంలో విస్తృతంగా వర్ణితం. నరకాసురుడి సంహారానంతరం ద్వారకలో ఆయన కేళీ విలోలుడై ఉండగా రుక్మిణీ దేవి తన నాథుణ్ణి ఒక విలక్షణమైన కోర్కెనర్థించింది. దేవా! నాకు ప్రద్యుమ్నుడి లాంటి కొడుకులు ఇదివరకే ఉన్నారు. మళ్లీ సంతానవతిని కావాలని నా మనసు కాంక్షిస్తున్నది. ధనధాన్యాలతో సంతానంతో ఇక చాలు అని తృప్తి ఎవరికీ ఉండదు కదా! మనోజ్ఞా! అందువల్ల నాకింకో పుత్రుడు కావాలని మనసు పోతున్నది. సౌందర్యవంతుడు, బలపరాక్రముడు, తేజోవిద్యా వినయ సంపన్నుడు, శ్రీమంతుడు అయి అన్ని విధాలా నీ వంటివాడు నాకింకో కుమారుడు కావాలి అని మధుర లజ్జావనత వదనయై ఆయనను వేడుకున్నది రుక్మిణి. ఆయనకు ఈ కోరిక విని నవ్వు వచ్చింది. ప్రసన్న సుందర దరస్మిత వదనుడై తన ప్రియురాలితో ఆయన ఇట్లా అన్నాడు. ‘కొడుకుల కన్నదే సౌఖ్యం, కూతుళ్ళ గన్నదే సౌభాగ్యం’ అని లోకోక్తి ఉంది. పుణ్యం చేసినవారికి పుత్రులు విద్య వినయ సంపన్నులు పుడతారు. సంపదలన్నిటా పుత్ర సంపద శ్రేష్ఠం అన్నారు ఆర్యులు. చూడూ! భర్తే భార్యయందు పుత్రుడిగా పుడతాడు. కొడుకున్నవాడి జోలికి రావటానికి ఇంద్రుడు కూడా భయపడతాడు. సంతానవంతులకు ఉత్తమ లోకాలు లభిస్తాయి. నీవు కోరిన పుత్రుణ్ణి ఇవ్వాలంటే ఎంతో తపస్సు చేయాలి. ప్రద్యుమ్నుడు పుట్టటానికి కూడా నేను హిమగిరిలో గొప్ప తపస్సు చేశాను కదా! తపస్సుకు అసాధ్యమైంది ఏముంది కనుక! కనుక నేను శంకరుణ్ణి ఆరాధిస్తాను. రజతాచలం వెళ్లి అచల కన్యాసమేతుణ్ణి కొలుచుకుంటాను. తపస్సు చేస్తాను. అమేయమైన బ్రహ్మచర్యం పాటిస్తాను. జగన్నాథుడు ప్రసన్నుడై నీ, నా మనోరథం ఈడేరుస్తాడు. అజ మహేంద్రాది వంద్యుడు ఇందుశేఖరుడు. ఇందువల్ల ఎన్నాళ్లనుంచో ఆశిస్తున్న నా ఇంకొక కోరిక కూడా నెరవేరుతుంది. బదరీ వనం మళ్లీ దర్శించాలని నా అభిలాష. అక్కడ అనవరత తపో నియమవ్రతులు, అఖిల సిద్ధాంత దర్శనులు, జీవన్ముక్తులు అయిన మునీశ్వరులను నేను అభినందించాలన్నది కూడా నా అభీష్టం. పరమేశ్వరానుగ్రహంవల్ల అక్కడికి నారద మహర్షి కూడా రావచ్చు. ఆయనతో పొద్దుపుచ్చాలని కూడా నా అభిమతం.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు