డైలీ సీరియల్

యమహాపురి 72

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యమ ఊళ్లో లేడు. రెండ్రోజుల్లో వస్తాడు. ఆయన వచ్చేలోగా మీరు రావడం వెళ్లిపోడం ఐపోవాలి. ఆ తర్వాత మీరొస్తానన్నా రమ్మనే స్థితిలో నేనుండను’’ అన్నాడు రాజా.
రాజా గొంతులో ఏదో భయం, తొందర పసికట్టాడు శ్రీకర్. జాప్యం చేస్తే- అనుకోకుండా వచ్చిన అవకాశం చేజారిపోవచ్చు. కాబట్టి నరకపురి వెళ్లాలనే నిర్ణయించుకున్నాడు. కానీ ఈలోగా రాజా నుంచి మరికొంత సమాచారం రాబట్టాలనుకుని, ‘‘అసలు నువ్వక్కడికి ఎలా వెళ్లావు? యమకి ప్రతినిధివి ఎలాగయ్యావు?’’ అని ఇంకా అడగబోతుండగా-
‘‘సార్! రేపుదయం పదిలోగా మఫ్టీలో మా ఊరి చెక్‌పోస్టు దగ్గరుండండి. నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. మీరడిగినవాటికే కాదు, అడగనివాటికి కూడా జవాబులిస్తాను. ప్లీజ్- ప్రస్తుతానికింకేమీ అడక్కుండా నాకు ఓకె చెప్పండి సార్!’’ అన్నాడు రాజా.
‘‘ఏంటీ- నువ్వేమైనా ఐజీననుకుంటున్నావా- నాకే ఆర్డరేస్తున్నావు’’ అన్నాడు శ్రీకర్.
‘‘మీకలా అనిపిస్తే కనుక- ఆ తర్వాతెలాగూ మీ లాకప్పులోకొచ్చే మనిషినే కదా సార్! అప్పుడు నా మీద పగ తీర్చుకోండి. కానీ ఇప్పుడు మాత్రం ఓకే చెప్పండి. ప్లీజ్- ఇది ఆర్డర్ కాదు. రిక్వెస్ట్’’ అన్నాడు రాజా.
ఆ గొంతులో ఏదో వేదన ఉన్నట్టు తెలుస్తోంది. ‘ఓకె’’ అన్నాడు శ్రీకర్.
రాజా థాంక్స్ చెప్పి ఫోన్ కట్ చేశాడు.
శ్రీకర్ వెంటనే సుందరానికి ఫోన్ చేశాడు. ‘‘నేను రేపు నరకపురి వెడుతున్నాను’’ అన్నాడు.
ఎలా వెడుతున్నాడని అడగలేదు సుందరం. ‘‘సార్! మీతో నేనూ వస్తాను’’ అన్నాడు వెంటనే.
‘‘అదీ పోలీసు స్పిరిటంటే’’ అనుకున్నాడు శ్రీకర్ మెప్పుకోలుగా. సుందరంతో, ‘‘ఇది సీక్రెట్ మిషన్. ప్రమాదకరమైనది కూడా. నేను స్టేషన్లో ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి వెడతాను- ఎటాక్‌కి ఫోర్సెస్‌తో సిద్ధంగా ఉండమని. రేపు రాత్రి పదికి నేను ఇంటికి రాలేదని నా భార్యనుంచి నీకు ఫోన్ వస్తే కనుక- నువ్వు వెంటనే వెంకటరత్నాన్ని కాంటాక్ట్ చేసి- తక్షణం నరకపురి మీద ఎటాక్ చెయ్యమని చెప్పు’’ అన్నాడు.
‘‘సార్! అంత ప్రమాదకరమైనదైతే- అనవసరంగా ఆ ఊరికి మీరు వెళ్ళడమెందుకు సార్- నన్ను పంపండి!’’ అన్నాడు సుందరం కంగారుగా.
‘‘ప్రమాదకరమైనదైతే నినే్న పంపేవాణ్ణి. దిసీజ్ జస్ట్ ఎ పిక్నిక్. ఎంజాయ్ చెయ్యడానికి వెడుతున్నాను. ఊరికే ముందు జాగ్రత్తకోసం చెబుతున్నానంతే! ఓకే’’ అని ఫోన్ పెట్టేశాడు శ్రీకర్.
***
నరకపురి చెక్‌పోస్ట్ దగ్గిర ఆగింది క్యాబ్. అందులోంచి దిగాడు మఫ్టీలో వున్న శ్రీకర్. క్యాబ్ వెళ్లిపోయింది.
అప్పటికి చెక్‌పోస్టు దగ్గిర ఎదురుచూస్తున్నాడు రాజా.
ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. పరస్పరం పరిచయాలు చేసుకున్నారు. రాజా శ్రీకర్‌ని యమ సదనానికి తీసుకెళ్లాడు. మాతకి పరిచయం చేశాడు.
‘‘ఈయన పేరు శ్రీకర్. పట్నంలో యమకి మంచి మిత్రుడు. ఈయన్ని నేనిక్కడకి ఆహ్వానించడానికి కారణం మీకు చెప్పాలి’’ అన్నాడు.
‘‘రెండు నెల్ల క్రితం ఈ ఊరు మరొకలా ఉండేది. ఆ వివరాలు జనం చేతనే ఇతడికి చెప్పిస్తాను. ఇతడు రికార్డు చేసుకుంటాడు. ఇప్పుడీ ఊరెలా మారిపోయిందో- అది కూడా జనం నోటనే ఇతడికి వినిపిస్తాను. అదీ ఇతడు రికార్డు చేసుకుంటాడు. అప్పుడైనా ఇప్పుడైనా జనమేం చేసినా యమ చెప్పాడనే చేశారు. అప్పుడైనా ఇప్పుడైనా జనం ఒక్కలాగే సంతోషిస్తున్నారు. అదీ జనం నోటనే చెప్పిస్తాను. అదీ ఇతడు రికార్డు చేసుకుంటాడు..’’
శ్రీకర్ ఇదంతా చెబుతుంటే, ‘‘అసలిదంతా ఎందుకు?’’ అంది మాత.
‘‘యమ ప్రతినిధిగా నేనీ ఊరొచ్చాను. ఆయన చెప్పింది నాకెలా అర్థమయిందో అలా చేశాను. నావల్ల ఏదైనా పొరపాటు జరిగుండొచ్చు. అందుకు జనాలకి శిక్ష పడకూడదని నా ఉద్దేశ్యం. శ్రీకర్ యమకి మిత్రుడు కాబట్టి ఇతడి చేత ఈ రికార్డింగు చేయిస్తున్నాను. శ్రీకర్ రేపిది యమకు వినిపిస్తాడు’’ అన్నాడు రాజా.
‘‘ఈ ఊరికి శుభం జరగాలన్న నీ సంకల్పం నాకు నచ్చింది. విజయోస్తు’’ అని వెళ్లిపోయింది మాత.
తర్వాత రాజా శ్రీకర్‌కి ఏకాంతంలో తన కథంతా చెప్పి, ‘‘ఇప్పుడు ఊరి జనాలచేత నేను చెప్పిస్తున్న మాటలు మీకు వాఙ్మలంగా పనికొస్తాయి. ఎందుకంటే యమ తిరిగొచ్చేక జనాలు ఈ నిజాలు చెప్పరు. యమ ఏం చెప్పమంటే అదే చెబుతారు. అందుకనే ఈ ఏర్పాటుచేశాను’’ అన్నాడు.
శ్రీకర్‌కి వేరే ఏదో లోకంలో వున్నట్లుంది. రాజా చెప్పిందంతా ఆశ్చర్యంగా విన్నాడు. ఐతే అందులో నిజానిజాలు తెలుసుకుందుకు ఎంతోసేపు పట్టలేదు.
రాజా శ్రీకర్‌ని ఊరంతా తిప్పాడు. ముఖ్యులని తాననుకున్న కొందర్ని శ్రీకర్‌కి పరిచయంచేశాడు. వారి మాటల్ని రికార్డు చేసుకున్నాడు శ్రీకర్. ఒకప్పుడా ఊరెలా వుండేదో విని, ఇప్పుడా ఊరెలా మారిందో చూసిన శ్రీకర్, ‘‘ఇంత తక్కువ కాలంలో ఇంత మార్పు సాధ్యమయిందంటే నేను నమ్మలేకపోతున్నాను’’ అన్నాడు.
‘‘మీరు నమ్మినా నమ్మకపోయినా- ఇది కళ్లకి కనిపిస్తున్న నిజం’’ అన్నాడు రాజా.
‘‘అది కాదు రాజా! ఈ మార్పు తేవడానికి- నువ్వు కేవలం యమకున్న సంపదని ఊరందర్నీ పోషించడానికి ఉపయోగించావు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. ఆఫ్టరాల్ ఒక్క మనిషి సంపాదన- దీనికెలా సరిపోయింది?’’ అన్నాడు శ్రీకర్.
రాజా నవ్వాడు. ‘‘కూర్చొని తింటే కొండలు కరిగిపోవచ్చు- కానీ గ్రహాలు అంత తొందరగా కరగవు కదా సార్! మీరు ఊరినంటున్నారు- ఒక రాష్ట్రానికి రాష్ట్రానే్న ఏడాదిపాటు పోషించగల గొప్ప సంపద ఉంది సార్- ఆ నాయకులకి! కానీ వాళ్ళు దాన్ని ప్రజలకందకుండా నల్లరంగు పూసి భూతలస్వర్గం లాంటి విదేశీ సురక్షిత ప్రాంతాల్లో దాస్తున్నారు. చిత్తశుద్ధితో సామాజిక స్పృహతో తల్చుకోవాలి కానీ- దాన్ని దివినుంచి భువికి తీసుకురావడానికి నాలాంటి సామాన్యుడే చాలు సార్! అదే మీరిక్కడ చూశారు’’ అన్నాడు.
‘‘నువ్వు సామాన్యుడివంటే ఒప్పుకోను. సామాన్యుడికిది సాధ్యం కాదు’’ అన్నాడు శ్రీకర్ తల అడ్డంగా ఊపి.

ఇంకా ఉంది

వసుంధర