మంచి మాట

సత్య మహిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర మహాభారతంలో ఆదిపర్వంలో దుష్యంతోపాఖ్యానం సత్యం యొక్క మహిమను చక్కగా వివరించారు ఆది కవి నన్నయ్య. సత్యప్రభావం అన్ని యుగాల్లోనూ- అన్ని కాలాల్లోనూ ఆచరించదగినది. ఇతిహాసాల్లో పురాణాల్లో వేదాల్లో సత్యప్రాభవం సందేశాత్మకంగా వర్ణించబడినది. సత్యం అంటే నిజము. అది వాక్కుకు సంబంధించినది. ఎందరో కవులు రచయితలు పద్య గద్యములలో సత్యమహిమను సూక్తుల ద్వారా చక్కని తేట తెనుగులో లోకానికి అందించారు. అభినందించబడినారు. యోగి వేమన సత్యప్రభావాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఆటవెలదిలో పలు పద్యాలను ఉటంకించారు.
అభిమానమే ధనంగా గల్గినవారు సత్యవాక్కులనే ఆలంబనగా చేసికొని ఆచరించి చూపుతుంటారు. వారిని వేమన మానధనులన్నాడు. భారతంలో శకుంతల దుష్యంతునితో సత్య ప్రభావాన్ని చెబుతూ- వేయి అశ్వమేధయాగాల ఫలితాన్ని ఒక్క సత్యవాక్యాన్ని త్రాసులో పెట్టి తూచినపుడు సత్యంవైపే మొగ్గిందట. అభిమాన ధనులు ఎన్ని ఆపదలెదురైనా మాట తప్పరని భాగవతోక్తి. మానహీనులు అసత్యం పలుకుతూ మాట మారుస్తుంటారు. ఇది లోక సహజం. సత్యాన్నాస్తి పరో ధర్మః అంటుంది వేదం. పూర్వకాలంలో ఆదర్శంగా జీవించిన రాజన్యుల చరిత్రలే చెక్కు చెదరకుండా వున్నాయి. వారు నిరంతరం సత్యవాదులుగా ఉన్నారు. భరతుడు - సత్యహరిశ్చంద్రుడు- జనకుడు- శిబి చక్రవర్తి - బలి చక్రవర్తుల జీవిత చరిత్రలు చరిత్రలో శిలాక్షరాలై నిలిచాయి. కలియుగంలో కూడా ఎందరో మహనీయులు సత్యవాదులుగా నిలిచారు. జాతిపిత గాంధీజీ సత్యవ్రతంతో దేశ స్వాతంత్య్రమును సాధించిపెట్టారు.
సూనృతమెంతో విలువైనది. సత్యమే శ్రేయము జనులకు, సత్యము దక్క లోకంలో వేరే సద్ధర్మమేదీ లేదని ప్రౌఢ వ్యాకరణంలో ప్రారంభంలోనే తెలిపారు కవి సీతారామాచార్యులవారు. నూర్గురు కుమారులకంటే ఒక సూనృత వాక్యము మేలని భారతం తెలిపింది. ఒక్క సత్యవాక్యమే గొప్పదన్నది. సంస్కృత సూక్తులలో మహనీయమైనది సత్యమహిమ అంటూ
‘సత్యం బ్రూయాత్ - ప్రియంబ్రూయాత్
నబ్రూయాత్ సత్యమప్రియం-
సత్యంచనానృతంబ్రూయాత్
ఏష ధర్మ సనాతనః’ అని మను ధర్మశాస్త్రం బోధించినది.
నిరంతరం సత్యమే పలకాలి. అది ప్రియంగా ఉండాలి. అప్రియమైన సత్యం పలుకరాదు. ధన, మాన ప్రాణాలకు ముప్పు కల్గించే సత్యం ప్రియమైనదిగాదు. అసత్యం పాపహేతువు. భాగవతంలో పోతనగారు సత్యానికి కొన్ని మినహాయింపులిచ్చారు. వారిజాక్షులందు- వైవాహికములందు, ....జన్మ రక్షణమందు బొంకవచ్చు నఘము పొంద దధిప అని తెలిపారు. స్ర్తిలు- పెళ్ళిళ్ళు- ఆవులు- బ్రాహ్మణుల రక్షణమందు- ప్రాణం- సొమ్ము- మానం పోవునపుడు అసత్యమాడవచ్చుననీ, పాపం రాదనీ తెలిపారు. అసత్యమాడడంవలన సంఘంలో పరులకు కలిగే కీడు ఏమీ ఉండదనీ ఆనాటి పెద్దలు ఆలోచించి వుంటారు. ఈ సందర్భాలలో అసత్యమాడితే పాపహేతువుగాదని పెద్దల భావన. ఇవన్నీ సత్యానికి మినహాయింపులు.
సత్యప్రభావమే జీవులకు మార్గదర్శనం చేస్తుంది. సత్యవాదిత్వం ఎంతో గొప్పది. అలాగే వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహాముని అయోధ్యకాండలో రాజుయొక్క జీవనానికి నిత్యమూ ఆధారమైనవి సత్యమూ- దయలేనన్నారు. లోకం యొక్క ఆత్మసత్యం అనీ, అన్ని లోకాలకూ సత్యమే కుదురు అన్నారు. సత్యం ద్వారా పరమ పదం లభిస్తుందన్నారు. సత్యం వలన సంపద- ధర్మమూ తద్వారా స్వర్గ ప్రాప్తి లభిస్తాయని తెలిపారు. లక్ష్మీ వుండేది సత్యంలోనే. లోకాలన్నింటినీ నియమించేది సత్యమే. సకలానికీ మూలం సత్యమే. సత్యం కంటే శాశ్వతమైనది ఏదీ లేదు.

-పి.వి.సీతారామారావు