డైలీ సీరియల్

పూలకుండీలు- 31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ లోపు నేనక్కడికి పోవాలి, నువ్వేం భయపడాల్సిన పనిలేదులే’’ అంటూ గదిలోనుండి బయటికెళ్లి అక్కణ్ణుండి లిఫ్ట్‌వైపు పరుగెత్తుతున్నట్టుగా నడిచి వెళ్లాడు వెంకటరెడ్డి.
అతను వెళ్లినవైపే చూస్తూ నిల్చున్న శాంతమ్మ ‘ఎనటికెవడో రోట్లో తలకాయబెట్టి, వామ్మో! రోకటిపోటు పడుద్దేమో’ అనుకున్నాడంట! నాకత గూడా అట్లనే వుంది. అతనన్నట్టు ఎవరున్నా లేకున్నా చేసేదేముంది? జరిగేదేదో జరుగుద్ది, జరగనియ్యి’’ అన్న మొండి ధైర్యానికొచ్చి మెల్లగామంచంమీద కూర్చుంది.
అప్పటికి ఉదయం ఎనిమిది గంటలు దాటిపోయింది.
రోడ్లమీద ట్రాఫిక్ రణగొణధ్వనులు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి.
మేకను మింగిన కొండ చిలువలా హాస్పిటల్ నిశ్శబ్దంగా వుంది.
కడుపులోకి కాసిని టీ నీళ్ళు కూడా పడకపోవడంతో శాంతమ్మకు నీరసంగా అన్పించి ‘‘ఆ నర్సులమ్మలు ఎవరో దబ్బున వస్తే బాగుండు’’ అనుకుంటూ నర్సుల కోసం ఎదురుచూడసాగింది.
మరో గంట తరువాత ఏ దేవతలో కరుణించినట్టు ఇద్దరు సిస్టర్లు శాంతమ్మ రూమ్‌లోకి వచ్చారు.
వాళ్ళను చూడగానే ఎప్పటిమాదిరిగానే బెడ్‌మీది నుండి లేచి నిల్చుంది శాంతమ్మ.
ఈ రోజు మళ్లీ బిపి చెక్ చేసి, ఏదో ఇక ఇంజెక్షన్ ఇచ్చి బ్లడ్ శాంపుల్ కూడా తీసుకున్నారు.
‘‘నాకు బాగ ఆకలైతుంది!’’ నిజానికి ఆకలికి ఏమాత్రం తట్టుకోలేని శాంతమ్మ సిగ్గువిడిచి సిస్టర్లతో చెప్పుకుంది.
‘‘తిందువుగానిలే ఓసారి మాతో కిందికిరా! అక్కడో టెస్టుంది’’ అంటూ శాంతమ్మను కిందికి తీసుకెళ్ళారు.
‘‘ఒక్క టెస్ట్’’ అంటూ కిందకు తీసుకెళ్లిన వాళ్ళు షుగర్, హోమోగ్లోబిన్, హెచ్‌ఐవి, హార్ట్ అన్ని టెస్టులూ చేయించి ఎప్పుడో మధ్యాహ్నం మూడు గంటల తరువాత మళ్లా రూమ్‌లోకి తీసుకొచ్చి వదిలిపెడుతూ ‘‘ఈ రిపోర్టులన్నీ రేపు మధ్యాహ్నానికి చేతికొస్తాయి. అప్పటిదాకా హాయిగా రెస్ట్ తీసుకో’’ అంటూ టివి ఆన్ చేసి వాల్యూమ్ పూర్తిగా తగ్గించి పెట్టి వెళ్ళారు.
వాళ్ళు అటు వెళ్ళారో లేదో ఇటు లిఫ్ట్‌లోనుండి వీల్ ట్రేలో భోజనాలొచ్చాయి.
ఆకలితో పేగులు నకనకలాడుతుంటే హాస్పిటల్‌కి వచ్చిన తరువాత ఈ రెండు రోజుల్లో మొదటిసారిగా వచ్చిన అన్నం అంతా తినేసింది శాంతమ్మ.
ఆ తరువాత పొద్దున స్నానం చేసినపుడు తడిపి పెట్టిన చీరా, లోలంగా, జాకెట్లను పిండి ఫ్యాన్ గాలికి ఆరేసి వచ్చి టీవీ ఆపు చేసి ఇందిరమ్మ డాబా ఇల్లు కట్టాలన్న తన నిర్ణయాన్ని భర్త, అత్తమామలూ కాదన్నందుకు వాళ్ళమీద అలిగి అన్నంలో చెయ్యి కడిగేసింది మొదలు అప్పటిదాకా జరిగిన ఒక్కో సంఘటనా కళ్ళముందు సినిమా రీళ్ళ మాదిరిగా తిరుగుతుంటే వాటిలో మునిగిపోయి ఎప్పుడో తనకు తెలియకుండానే నిదురపోయింది.
సాయంత్రం ఆరు గంటల తరువాత మేనల్లుడి అంత్యక్రియలు ముగించుకొని ఇంటికి వెళుతూ మళ్లీ హాస్పిటల్‌కి వచ్చిన వెంకటరెడ్డి నేరుగా శాంతమ్మ రూమ్‌కొచ్చి తలుపు తట్టాడు.
తలుపు తీసిన శాంతమ్మకు అతనంటే అప్పటికి కొంత బెరుకు తీరిపోయినట్టుగా అతని వంక చూస్తూ ‘మట్టి జేసి వస్తున్నరా?’ అంటూ తనే ముందుగా పలుకరించింది.
‘‘ఆ అయిపోయింది. ఇంటికి పోతు పోతు ఒకసారి నిన్ను చూసి పొమ్మని మీ లింగయ్య ఫోన్లమీద ఫోన్లు జేసి చంపుతుంటే ఇక తప్పదని ఇటొచ్చాను. సరే ఎలాగూ వస్తున్నాను గదా నీకు సంబంధించిన ఆ లేడీ డాక్టర్‌ని కలిసి పోదామనుకుంటే ఆమె ఈరోజు వేరే ఊరికి క్యాంప్‌కెళ్ళిందంట. ఈ రోజు టెస్టులన్నీ చేశారటగదా? రేపు డాక్టరమ్మగారు రాగానే ఆ రిపోర్టులన్నీ చూసి ఏం చెబుతారో చూద్దాంలే గాని వుండు. నేను అర్జంట్‌గా ఇంటికెళ్ళాలి. ఇట్లాంటిదే మా ఇంటి దగ్గర కూడా ఓ కేసుంది’’ అనుకుంటూ లేచి వెళ్లిపోయాడు వెంకటరెడ్డి.
ఎనిమిదింటికి మళ్లీ రాత్రి భోజనం వచ్చింది.
‘‘నాకీ పూట అన్నం వద్దు తీసుకోండి’’ అంటూ తెచ్చిన అన్నాన్ని తిరిగి పంపించింది శాంతమ్మ.
కాస్సేపు టీవీ చూసిన శాంతమ్మ ‘‘ఇహ పడుకుందాం’’ అనుకుంటుండగా ఫోన్ రింగైంది. ఫోనెత్తిన ఆవిడకు భర్త గొంతు విన్పించడంతో ఒక్కసారిగా గుండెలు ఝల్లుమంటుంటే ‘‘ఇదేంది! ఇన్నాల్ల తరువాత ఈన ఫోన్ జేశాడు. అయినా ఈ నెంబర్ ఆయనకెట్లా తెలిసింది?! ఆ ఆర్‌ఎంపి లింగయ్యగాని ఇచ్చాడేమో? ఇపుడు నేను మాట్లాడితే పిల్లలతో మాట్లాడతాను వాళ్లకోసారియ్యమంటాడు. దాంటో నేనెక్కడున్నానో చెప్పాల్సి వస్తుంది. పోనీ చెబితే, అమ్మో ఇంకేమన్నా వుందా? మొదటికే మోసం వస్తుంది’’ మాట్లాడాలా వద్దా అనుకుంటూ ఆవిడ మీనమేషాలు లెక్కపెడుతుండగానే ఫోన్ మోగీ మోగీ ఆగిపోయింది.
ఎప్పుడైతే ఫోన్ ఆగిపోయిందో ఆవిడ ఆలోచనాధార కూడా అపుడే తెగిపోయింది.
ఒక్కసారిగా వాస్తవంలోకొచ్చిన శాంతమ్మ ‘‘అయ్యో ఆయన చెయ్యక చెయ్యక ఇన్ని రోజులకు ఫోన్ చేస్తే పాపిష్టిదాన్ని మాట్లాడ్డానికి కూడా నోచుకోలేకపోయాను’’ అనుకుంటుండగానే మళ్లీ ఫోనొచ్చింది. అయినా ఎత్తలేదు. మళ్లీ మళ్లీ ఐదారుసార్లు ఫోను మోగీ మోగీ ఆగిపోయింది. ఇక దాంతో ఎంతో రాత్రిదాకా కుళ్లి కుళ్లి ఏడుస్తూ మంచంమీద అలా కూర్చుండిపోయింది.
విరామం ఎరుగని కాలయంత్రపు నిరంతర ప్రయాణం ఆ రోజు చీకటి రాత్రి నుండి మరుసటి రోజు వేకువలోకి అడుగుపెట్టింది.
ఏడు గంటలకు స్వీపర్ వచ్చి కాలింగ్ బెల్ కొట్టేదాకా శాంతమ్మకు మెలుకువే రాలేదు.
అంతలో..

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు