డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మి నవ్వింది. ‘‘ఈ సృష్టి మొత్తం శూన్యంలోంచే పుట్టింది. గొప్ప గొప్ప వాళ్ళంతా ఏమీ లేని స్థితిలోనుండే ప్రతికూలమైన పరిస్థితులని ఎదిరీదారు. కావలసినదల్లా ధైర్యం.. అంతే.. అదే నీ ఆయుధం! హరితా సమస్య వచ్చినపుడు చేయవలసింది భయపడటమో, బాధపడటమో కాదు.. ఆలోచించడం! ఒక చిన్న ఆలోచనతో పెద్ద సమస్యనైనా తరిమికొట్టవచ్చు.’’
హరితకామె మాటలు గీతాబోధలా అనిపించాయి. ఇన్నాళ్ళూ తనకే సమస్య వచ్చినా వరుణ్ సహాయంతో దానిని మర్చిపోవడమే తెలుసు... వరుణ్ తనకిచ్చిన బొమ్మలాగే తనూ ముందుకు కదలకుండా వున్నచోటునే తిరుగుతోంది.
ఆమె బయలుదేరబోతుంటే చెప్పింది లక్ష్మి ‘‘హరితా, జీవితం ఒక ఆట లాంటిది. అందులో గెలుపెంత సహజమో ఓటమి కూడా అంతే సహజం.. ఓటమి నుండి పాఠాలు నేర్చుకుంటూ గెలిచేవరకూ ఆడుతూనే వుండాలి. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనుషులెవరూ వుండరు.. సమస్యలవల్ల కృంగిపోని మనుషులే వుంటారు. అది గుర్తుపెట్టుకో! నీకే అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకు’’.
‘‘్థంక్యూ’’ చెప్పింది హరిత మనస్ఫూర్తిగా. యుద్ధ్భూమిలోకి అడుగుపెట్టబోతున్న సైనికుడిలా ఆమె అక్కడినుండి బయలుదేరింది.
***
హరిత మొబైల్ ఫోన్ ఆగకుండా మ్రోగసాగింది. ఈమధ్యన హరితకి ఫోన్ రింగైన ప్రతిసారీ భయం వేస్తోంది, అది భరణి దగ్గరనుంచేమోనని. తెలిసిన నెంబర్లనుంచి ఫోన్ వస్తే ఎత్తడం మానేసింది. ఎన్నిసార్లు కట్ చేసినా ఒకసారి ఆగకుండా మ్రోగసాగింది ఫోన్. ఏదో తెలియని నెంబరు నుంచి.
హరిత గుండెలు దడదడలాడాయి.. తండ్రి ఇంట్లో లేడు. తల్లి బెడ్రూంలో పడుకుంది. గబగబా ఫోన్ తీసి ‘హలో’ అంది.
ఆమె ఊహించినట్టుగా ఫోన్ చేసింది భరణీ కాదు- వరుణ్. ‘‘హరీ.. నేను..’’ అటునుంచి వరుణ్ కంఠం ఉద్వేగంగా వినిపించింది.
చాలా రోజుల తర్వాత అతని కంఠం వింటుంటే ఆమెకీ ఎంతో ఉద్వేగంగా అనిపించింది. కానీ వెంటనే తేరుకుని మామూలుగా అయిపోయింది. ‘‘చెప్పు’’ అంది నిరాసక్తంగా.
‘‘ఏమైపోయావ్ హరీ.. కనీసం ఫోన్ కూడా చెయ్యడం మానేసావ్. సెల్‌కి ఫోన్ చేస్తే ఎత్తవు’’ అన్నాడు వరుణ్ ఎంతో బాధగా.
హరిత ఏమీ మాట్లాడలేదు. ఆమెకీ బాధగానే వుంది. ఒకప్పుడు అతనే సర్వస్వమనుకున్న తను ఇన్నాళ్ళు తనని కలుసుకోకుండా, కనీసం తలవనైనా తలవకుండా ఇలా వుండాల్సి రావడం.. కానీ బాధపడేం ప్రయోజనం? వాస్తవాన్ని గుర్తించకుండా ఎన్నాళ్లని అందమైన భ్రమల్లో ఉంటుంది?
‘‘నామీద కోపం వచ్చిందా?’’ ఆమె వౌనానికి తనకి తోచిన భాష్యం చెబుతూ అన్నాడు.
హరిత సమాధానం చెప్పలేదు.
అతను అంతకన్నా ఎక్కువ స్థాయిలో తనని ఊహించలేనందుకు బాధగా కూడా అనిపించింది. హరిత ఇంకా ఏమీ మాట్లాడకపోవడంతో అన్నాడు వరుణ్.
‘‘నన్ను నమ్మవా హరితా? నీకు నేను ఎన్నటికీ అన్యాయం చేయను’’.
అతని మాటలకి హరితకి ఒళ్ళు మండిపోయింది.
‘‘నమ్మాను వరుణ్.. ఇన్నాళ్ళూ నమ్మాను కనుకే నీతో తిరిగాను. నువ్వేం చేసినా అభ్యంతరం పెట్టలేదు. నీకోసమే పెళ్లి సంబంధాలు చెడగొట్టుకున్నాను. నీ కోసమే మా అమ్మా నాన్నలతో దెబ్బలాడాను. నా జీవితాన్ని ఇన్నాళ్ళూ నరకం చేసుకున్నాను.. ఎందుకు? నీకోసమే.. కేవలం నీతో కలిసి బ్రతకడం కోసమే.. నేనింత చేస్తే నువ్వేం అన్నావు? నేను ఊహించుకుంటున్నవన్నీ సినిమాల్లో తప్ప సాధ్యం కావన్నావ్..’’ కోపంగా అంది.
‘‘నిజమే హరితా.. ఒప్పుకుంటున్నాను. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది మాత్రం నిజం. నేను నువ్వు లేకుండా బ్రతకలేను. అనుక్షణం నువ్వే గుర్తుకు వస్తున్నావు. నన్ను పిచ్చివాడిని చేయకు.. ఒక్కసారి కలుద్దాం’’ అన్నాడు.
హరిత విరక్తిగా నవ్వుకుంది. ప్రేమ.. ప్రేమంటే ఏమిటి? కలిసి తిరగడం, ఇంట్లో తెలియకుండా సినిమాలకి షికార్లకీ వెళ్ళడం, చాటుకుండా చిన్న చిన్న శారీరిక వాంఛలు తీర్చుకోవడం.. ఇదేనా ప్రేమంటే?!
తనకింకా వరుణ్‌తో అలా తిరుగుతూ దానే్న ప్రేమ అని ఆత్మవంచన చేసుకునే ఓపికా, ఆసక్తీ లేవు. ఏ రకంగా చెబితే ఆ విషయం అతనికి అర్థవౌతుందో తెలియడంలేదామెకి.
‘‘సరే వరుణ్.. ఇప్పటికేనా మించిపోయింది లేదు. నువ్వు ఊ అను.. నేను ఈ క్షణంమే నీతో బయటికి వచ్చేస్తాను. ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఈ మనుషులూ, ఈ లోకం నుంచి దూరంగా పారిపోయి అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా బ్రతుకుదాం’’ అంది.
హరిత అలా మాట్లాడుతుందని ఊహించలేదు వరుణ్. ఖంగు తిన్నట్టుగా ఒక్క క్షణం వౌనంగా ఉండిపోయాడు.
‘‘తొందరేం లేదు వరుణ్, బాగా ఆలోచించుకుని ఫోన్ చెయ్యి. నువ్వు ఎప్పుడు వెళ్దామంటే అపుడు నేను సిద్ధంగా ఉంటాను. నీ ఫోన్ కోసం ఎదురుచూస్తూ వుంటాను’’.
వరుణ్ కోపంగా ఫోన్ పెట్టేశాడు. హరిత నవ్వుకుంది. ఏమనుకోని వుంటాడు అతడు? ఏదేమైనా కొంతకాలం వరకూ మళ్ళీ తనని విసిగించే సాహసం చేయడన్నది మాత్రం నిజం.
***
‘‘మొన్న వరుణ్ ఫోన్ చేశాడు’’ చెప్పింది హరిత లక్ష్మితో.
ఇదివరకులా తనకి లక్ష్మి దగ్గిర వరుణ్ గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా లేదు. ఇన్నాళ్ళూ తను తప్పు చేస్తున్నానేమో అన్న అనుమానం వల్ల తన మనసులో తనకి తెలియకుండానే వరుణ్‌తో తిరుగుతున్నందుకు ఒకరమైన గిల్టీ ఫీలింగ్ వుండేది. అందువల్లే లక్ష్మి దగ్గిర అతని గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా వుండేది. కావేరి లాంటి స్నేహితుల దగ్గిర మాత్రం, వాళ్ళూ అలాంటి తప్పే చేస్తున్నారు కదా అన్న తేలిక భావంతో ఏ ఫీలింగ్ లేకుండా అతని గురించి చర్చించగలిగేది. ఇపుడు వరుణ్ విషయంలో తను చేస్తున్న తప్పేమిటో తెలసుకోగలగడం వల్ల ఆ గిల్టీ ఫీలింగ్ పోయింది. లక్ష్మితో కూడా అతని గురించి ఫ్రీగా మాట్లాడగలుగుతోంది.
‘‘ఏమన్నాడు?’’ అడిగింది లక్ష్మి.
హరిత అతనితో జరిగిన సంభాషణంతా చెప్పి ‘‘ఇంక మళ్లీ అతడు నాకు ఫోన్ చేస్తాడనుకోను’’ అంది విరక్తిగా. లక్ష్మి ఏమీ మాట్లాడలేదు కాసేపు. తర్వాత నెమ్మదిగా అడిగింది.
‘‘నువ్వింకా అతన్ని ప్రేమిస్తున్నావా?’’
బేరర్ వాళ్ళు ఆర్డర్ చేసిన కాఫీ తీసుకొచ్చి ఇద్దరిమధ్యా పెట్టాడు. తనకి అంతకుముందు కాఫీ తాగడం అలవాటు లేకపోయినా, వరుణ్ కోసమని కాఫీ తాగడాన్ని అలవాటు చేసుకోవడం, తరువాత అదే ఇష్టంగా మారడం గుర్తొచ్చాయి హరితకి. వేడి వేడిగా పొగలు కక్కుతున్న కాఫీ కప్పుని అపురూపంగా చేతుల్లోకి తీసుకుంటూ నెమ్మదిగా చెప్పింది.
‘‘లక్ష్మీ.. నేను నిన్ను మాట్లాడడానికి ఈ హోటల్‌కే ఎందుకు రమ్మన్నానో తెలుసా... నేనూ, వరుణ్ కలుసుకునే ప్రతిసారీ ఇక్కడికే వచ్చేవాళ్ళం.. అందుకే. ఎందుకో.. నాకు తెలియకుండానే నేను వరుణ్‌మీదా, అతనితో కలిసి నేను తిరిగిన పరిసరాలమీదా, అతనితో కలిసి నేను చేసిన పనులమీదా విపరీతమైన ఇష్టాన్ని పెంచుకున్నాను. అతను నన్ను అంతగా ఇంప్రెస్ చేసేశాడు.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ