భక్తి కథలు

మాయామోహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాయను జయించండి. మాయ మిమ్మల్ని నిర్ణయాత్మక శక్తినుండి దూరం చేస్తుంది. కనుక మాయా మోహములకు దూరంగా ఉండండి అని ఆధ్యాత్మికవేత్తలు, మతగురువులు, సాధారణ ప్రజానీకమును హెచ్చరిస్తూ యుంటారు. మాయామోహములు ప్రలోభములకు మానవాళిని గురిచేస్తున్నాయి. మాయామోహములు లేనిదే జీవితం మృగ్యం నిరర్థకం అనే స్థాయికి ఇవి విస్తరించి ఉన్నాయి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏందంటే స్వాప్నిక జగత్తు ఎంత నిజమో మన వాస్తవము అని భావించే నిజ జగత్తు కూడా అంతే నిజం.
మాయా మోహములకు లోబడకుండా ఉండుట ఎంతటి మహామహుల తరం కూడా కాదని తెలిసే సంఘటనలు కోకొల్లలు. త్రికాల సంధ్యాపరుడు, నిత్య శివాభిషేకకరుడు అయిన రావణబ్రహ్మ స్ర్తిల మాయలో పడి తన జీవితం దుర్లభం చేసుకొనుటయే కాక తన వారినందరిని బలిపశువులు చేశాడు. లోకమాత అయిన సీతాదేవిని చెరబట్టి అశోక వనమందు ఉంచి ఆమెను మాటలతో చిత్రహింసలు పెడుతున్నాడు. అవి రామ రావణ సంగ్రామం హోరాహోరీగా జరుగుచున్న రోజులు.
రావణుడు తెగిన రాముని తలను సీతాదేవి వద్దకు కొనిపోయి వికటాట్టహాసం చేస్తూ, ఇదిగో నీ రాముని తల. నేటి యుద్ధమునందు రాముడు నా చేతిలో హతుడైనాడు. ఇక నీకు నేను తప్ప వేరే దిక్కు లేదు. ఆలోచించక నాకు లొంగిపో అని హుంకరించాడు. రాముని తల చూచిన సీతాదేవి నిరుత్తరురాలు అయి నిర్ఘాంతపోయినది. రావణుని నిష్క్రమణ తరువాత సీతామాత అచటనే యున్న రాక్షసాంగనలతో అమ్మా ఈ దుర్మార్గుడు నా పతి తలను మాత్రమే తెచ్చాడు. మీరు ఆయన శరీరమును తెచ్చి అప్పగించినట్లయితే ఆయన శరీరంతోపాటు అగ్నిప్రవేశం చేస్తాను అనగానే రాక్షస వనితల మధ్యలోనుంచి సీతాదేవి సమ్ముఖమునకు జ్ఞానమూర్తి విభీషణుని భార్య అయిన సరమాదేవి వచ్చి ఇలా చెప్పసాగెను.
అమ్మా, మీరు ఎంతో గొప్పవారు. మనసు నిలిపి ఆలోచించండి. ధర్మమే స్వరూపముగాగల శ్రీరామచంద్రుని యుద్ధములో జయించి ఆయన శిరసు తేగల వీరుడు ఈ పుడమి యందు పుట్టి యుంటాడా? నిశ్చయంగా పుట్టియుండడు. రావణుడు వేద వేదాంగ విద్యలయందు ఎంత నిపుణుడో టక్కు టమారాది మాయ విద్యలయందు అంతే నిపుణుడు. కనుక రాముని మాయా శిరస్సుతో మిమ్మల్ని నమ్మించి లొంగదీసుకొనుటకు ఆఖరు ప్రయత్నం చేసాడు. మాయను నిజమని భ్రమించుట మీవంటివారికి శోభించదు అనగానే సీతామాత సరమాదేవి సహృదయతకు కృతజ్ఞతలు తెలిపింది. అవతార పురుషులు సైతం మాయకు అతీతులు కాదు అనుటకు ఇది ఒక ప్రబల నిదర్శనం. శ్రీకృష్ణపరమాత్మ నాకుమారుడే అనే భ్రాంతిలో ఉండుటవలన మన్ను తినవద్దని వారిస్తూ నోరుతెరవమని అదిలించింది ఆ తల్లి యశోదమ్మ. నారదుడుకి తాను సంసారమంటని సన్యాసినని తనను ఎవరూ మాయమోహములకు లోను చేయలేరు అనే గర్వము యుండేది. అదొక మాయ. దానినుండి విష్ణువు ఆయనను ఒడ్డున వేశాడు. ఈ ప్రపంచంలో నాకన్నా ఎక్కువ కాలం ఎవడు బ్రతకడు, బ్రతకలేడు అనే మాయలో పడిన బ్రహ్మకు అష్టావక్ర మహర్షి వంటివారిని చూపి విష్ణుమూర్తి ఆయనను మాయనుండి భ్రమలనుండి బయటపడవేశాడు ఆ విష్ణుమూర్తి. మాయనుండి బయటపడడం దుర్లభం అయితే కావచ్చు కాని అసాధ్యం ఎన్నటికీ కాదు.
ఈ స్వాప్నిక జగత్తుయందు జగన్నాథుడు మాత్రమే నిజం. ఆయన పట్ల ఆర్ద్రత కలిగియుండుట అవశ్యం. ప్రాప్త వైరాగ్యం శ్రేష్టం. అది లుప్తమయినపుడు ఆర్జిత వైరాగ్యం మేలు అని మానవుడు ఒక నిశ్చయమునకు వస్తే మాయా పొరలు కొంత తొలగినట్లే. మనలో నిక్షిప్తమైవున్న ముష్కర పీడిత భావోద్వేగములను కూకటివేళ్ళతో పెగిల్చివేసి పరిశుభ్రపడాలి. నిష్పక్షపాతం, దయ, త్యాగం, న్యాయభావనలను మరవో ప్రతిష్ఠింపచేసుకోగలగాలి. ధర్మబద్ధతతో నిజాయితీగా జీవిస్తూ భగవన్నామం జపిస్తూయుంటే మాయామోహములను తొలగించే మార్గదర్శకత్వం అదే చూపుతుంది.

- వేదగిరి రామకృష్ణ