డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నిజం తెలుసుకోవడం అన్నది ప్రతిసారీ నేరస్థులని శిక్షించడానికే కానక్కర్లేదు సూర్యా. ఒక నిజం తెలుసుకోవడం, సమాజానికి తెలియచెప్పడం వెనుక పరమార్థం నేరస్థులకి శిక్ష వేయడం మాత్రమే కాదు. అపరాధం- అంటే తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని, ముందు ముందు అలాంటి పరిస్థితులే ఎదురైతే, అలాంటి తప్పు పునరావృతం అయి, మళ్లీ ఇలాంటి దారుణాలు జరుగకుండా కాపాడడం. నా దృష్టిలో అపరాధ పరిశోధన అంటే నేరస్థులని కనిపెట్టడం కాదు. జరిగిన దారుణానికి కారణమైన ‘అపరాధం’ ఎక్కడ ఉందోకనిపెట్టడం. అపరాధ పరిశోధన కూడా ఒకలాంటి ఆత్మశోధనే. అందుకే ఈ కేసులో నీకు తెలిసిన నిజాలని నాతో చెప్పు’’.
సూర్య ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అన్నాడు. ‘‘మీరు ఎన్ని చెప్పండి, ఒక విషయం మాత్రం నిజం. భరణిని చంపినవాళ్ళనీ మీరేమీ చెయ్యలేరు’’.
‘‘ఎందుకు?’’
‘‘ఎందుకంటే, భరణిని చంపినది మనిషి కాదు కనుక’’
‘‘ఏమిటి నువ్వంటున్నది? భరణిని చంపినది మనిషి కాకపోతే మరెవరూ?’’ ఆశ్చర్యంగా అడిగాడు పాణి.
‘‘దె..య్యం..!’’ ఆ రెండు అక్షరాలూ రెండు బాంబుల్లా పేలాయి ఆ గదిలో. వింటున్న పాణి ఉలిక్కిపడ్డాడు.
‘‘ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది?’’
‘‘మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది మాత్రం నిజం. భరణిని చంపినది ఒక ఆత్మ. అతడి మీద పగబట్టి అతడిని వెంటాడి చంపింది!’’
‘‘ఈ విషయం నీకెలా తెలుసు?’’
‘‘్భరణే స్వయంగా నాతో చెప్పాడు’’
‘‘తనని ఒక దెయ్యం హత్య చేసిందని చనిపోయిన భరణి దెయ్యమై వచ్చి నీతో చెప్పాడా?’’ చిన్నగా నవ్వుతూ వ్యంగ్యంగా అన్నాడు పాణి.
పాణి మాటలకి సూర్య ముఖం ఎర్రగా అయింది. ‘‘అతడు నాకీ విషయాన్ని చనిపోయాక చెప్పలేదు. గత కొద్దికాలంగా ఆ ఆత్మ తనకి తరచుగా కనిపిస్తూ, బెదిరింపు ఉత్తరాలు రాస్తూ, బ్లాంక్ ఫోన్ కాల్స్ చేస్తూ తనని ఇబ్బంది పెడుతోందనీ, తనని చంపుతానని బెదిరిస్తోందని చనిపోకముందు భరణే నాతో స్వయంగా చెప్పాడు. నాకే కాదు, శ్రీనూ, రాజూలకు కూడా ఈ విషయం తెలుసు. జరిగినది మీకు చెబితే, ఆ ఆత్మ తమనేం చేస్తుందోనన్న భయంతోనే వాళ్ళిద్దరూ మీకే విషయమూ చెప్పలేదు’’.
‘‘నువ్వు చెబుతున్నది నమ్మశక్యంగా లేదు. ఈ రోజుల్లో కూడా ఆత్మలూ దెయ్యాలూ ఏమిటి? చదువుకున్న మీరంతా వాటిని నమ్మడమేమిటి?’’ అతడి వంక వింతగా చూస్తూ అన్నాడు పాణి.
‘‘్భరణి అనుభవం వినేవరకూ నేనూ మీలాగే అనుకునేవాడ్ని. అతడి అనుభవాన్ని విన్నాక, అతడి మరణాన్ని కళ్ళారా చూసాక ఇపుడు నేను ఆత్మలున్నాయనీ, వాటికి శక్తి ఉంటుందనీ పూర్తిగా నమ్ముతున్నాను’’.
పాణి ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు.
‘‘ఓకె, భరణిని ఆత్మే చంపిందని అనుకుందాం. ఎవరా ఆత్మ? దానికి భరణిమీద ఎందుకు పగ?’’
‘‘కొద్ది రోజుల క్రితం భరణిని మా కాలేజీలో చదివే సంధ్య అనే అమ్మాయి గాఢంగా ప్రేమించింది. ఎంత గాఢంగా అంటే, అంతకుముందు తనని ప్రాణంగా ప్రేమించిన ఒక ప్రే మికుడి ప్రేమని కూడా వదులుకుని భరణి కోసం వచ్చేసింది. భరణి అంటే ఆమెకి పిచ్చి ఆరాధన. అతడు ఏం చెయ్యమంటే అది చేసింది. భరణిని నమ్మి తన సర్వస్వాన్నీ సమర్పించుకుంది. కొద్ది రోజులు ఆమెతో తిరిగిన భరణి మోజు తీరాక ఆమెని వదిలిపెట్టేవాడు. భరణిది ప్రేమ కాదు మోసం అని తెలుసుకున్న ఆమె అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంది. అలా బలవన్మరణం పొందిన ఆమె ఆత్మే భరణిని పట్టి పీడించి, చివరికి మృత్యుగుహ్వరంలోకి నెట్టేసింది’’.
అతడు చెబుతున్నది వింటుంటే పాణికి తల తిరుగుతున్నట్టనిపించింది. పరిశోధనని పక్కదారి పట్టించడానికి అలా మాట్లాడుతున్నాడా అన్న అనుమానం కూడా వచ్చింది. తన మనసులోని భావాలని పైకి కనిపించనీయకుండా ‘‘సంధ్య ఎప్పుడు చనిపోయింది?’’ అని అడిగాడు.
‘‘ఆరు నెలల క్రితం. భరణి నిజస్వరూపం తెలిసిన వెంటనే హాస్టల్‌నుంచి సామాన్లు సర్దుకుని తన సొంత ఊరు వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుంది’’.
‘‘మరి కాలేజీలో అంతా హరితని భరణి లవర్ అని అంటున్నారు?’’
‘‘హరిత భరణి లవర్ కాదు గర్ల్‌ఫ్రెండ్’’’
‘‘రెండింటికీ తేడా ఏమిటి?’’
‘‘ఒక అబ్బాయికి ఇద్దరు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉండచ్చు, కానీ లవర్ మాత్రం ఒక్కరే ఉంటారు. ఒకసారి ఒకరి ప్రేమకి కట్టుబడితే ఇంక మిగిలిన గర్ల్‌ఫ్రెండ్స్‌ని కేవలం ఫ్రెండ్స్‌లాగానే చూస్తారు. అదీ తేడా’’
వింటున్న పాణికి ‘బోయ్‌ఫ్రెండ్’ అన్నమాటకి హరిత చెప్పిన నిర్వచనం గుర్తుకు వచ్చింది. తను ఉన్నది భారతదేశంలోనేనా అన్న అనుమానం వచ్చింది అతడికి ఒక్కసారి.
‘‘్భరణి అందమైనవాడు. తెలివైనవాడు. మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నవాడు. కాలేజీలో ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేస్తూ అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా కూడా అతడికి మంచి పేరు ఉంది. ఇన్ని మంచి గుణాలు ఉన్న అతడికి ఒకే ఒక్క వీక్‌నెస్- స్ర్తిలోలత్వం. అమ్మాయిలని ‘ఆ’ దృష్టితో తప్ప మరో దృష్టితో అతడు చూడగలిగేవాడు కాదు. మనసుకి నచ్చిన అమ్మాయి కంటపడితే ఆమెని పొందడం కోసం ఏమైనా చెయ్యడానికి సిద్ధపడేవాడు. అంత బలహీనుడు అతడు అమ్మాయిల విషయంలో.
అయితే, అతడు పెరిగిన వాతావరణం వల్లో మరి దేనివల్లో అందరు అబ్బాయిల లాగా అమ్మాయిల వెంట పడడం, వాళ్లని బ్రతిమలాడడం, ప్రేమ కబుర్లు చెప్పి దారిలోకి తెచ్చుకోవడం అన్నది అతడికి నచ్చేది కాదు. కావాలంటే వేట కోసం మాటువేసిన పులిలా ఎన్నాళ్ళైనా నచ్చిన అమ్మాయి కోసం ఎదురుచూస్తూ ఉండగలిగేవాడు కానీ, అమ్మాయిలని తనకు తానుగా వెంటపడి ప్రేమిస్తున్నానని చెప్పి తన దారికి తెచ్చుకోవడం మాత్రం అతడు చేసేవాడు కాదు.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ