భక్తి కథలు

హరివంశం-22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యశోద కూడా అదే సమయంలో ప్రసవించి ఉండటంవల్ల విష్ణుమాయవల్ల ఒళ్ళెరుగని నిద్రలో ఉంది. ఆమెకు జన్మించిన కూతురు ఆమె పక్కనే వుంది. తన కుమారుణ్ణి ఆమె పక్కలో జాగ్రత్తగా పడుకోబెట్టి ఆమెకు పుట్టిన ఆడ శిశవును ఎత్తుకొని త్వరత్వరగా వచ్చి దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడు వసుదేవుడు. తనంత తానే వెళ్ళి కంసుడికి దేవకి ప్రసవించిందని చెప్పాడు. ఒక్క ఉదుటున తల్పం మీది నుంచి లేచాడు కంసుడు.
అతడి కేశపాశమంతా చిందరగా ఊడిపోయింది. ఒంటిపైన ఉత్తరీయం లేకుండా అమర్చుకోకుండా కట్టుకున్న వస్త్రం కూడా సరిగా ఉందో లేదో చూసుకోకుండా ఎంతో తత్తరపాటుతో భయ సంభ్రమాలతో చిడిముడిపాటుతో పురిటిల్లు ద్వారం దగ్గరకు అంగల పంగల మీద వచ్చాడు. ‘తీసుకొనిరా, తెచ్చి నాకివ్వు, ఏదీ బిడ్డ, ఎక్కడ’ అని కేకలు వేశాడు. కృష్ణమాత గజగజ వణికిపోయింది. పెద్దగా రోదించింది. ఆర్తురాలై హడలిపోయింది.
‘అన్నా! ఆగ్రహం వద్దు, శాంతించు, దయచూపు. మగశిశవు కాదు. నీవే చూడు, ఇదిగో ఈ బిడ్డ ఆడపిల్ల. ఇది నినే్నం చేస్తుందయ్యా! నీవు అత్యంత బల శౌర్య సమగ్రుడవు. వేయికళ్ళతో ఎంతో జాగ్రత్తగా నీకెటువంటి అపకారం కలగకుండా చూసుకుంటున్నావు.
చూడు! నీకు హాని జరగకూడదనే కదా, నా పిల్లలను చంపుకున్నాను. లేకపోతే వాళ్ళను నీకెందుకప్పగిస్తాను. పుట్టుగానే నీకు ఇచ్చివేశాను కదా! అన్నా! లోకంలో నీకు సంపదలో సాహసంలో పౌరుషంలో సాటి ఎవరున్నారు? నీ కీర్తి అసామాన్యం. నీ విభవం అసదృశం. ఈ పసికందు నినే్నం చేయగలదు? అని తన పట్ల జాలి, కనికరం, దయ చూపవలసిందని పరి పరివిధాల కంసుణ్ణి వేడుకొంది దేవకీదేవి. అయినా కంసుడు ఎంత మాత్రం పట్టించుకోలేదు. అంతఃపురమంతా హాహాకారాలు చెలరేగాయి. దేవకి చుట్టూ చేరిన వనితలంతా పెద్ద పెట్టున యేడ్చారు. ఇక క్షణం కూడా ఆలస్యం చేయటానికి ఇష్టపడక స్వయంగా కంసుడే పురిటి మంచం దగ్గరకు వెళ్లి ఆ పాపను చేతులలోకి తీసుకున్నాడు. కడ కాళ్ళు పట్టి ఎప్పటిలాగానే శిలమీద మోది చంపాలని పైకెత్తాడా పాపను.
ఇంతలో అతడి చేతుల్లోంచి జారి ఆ శిశువు గగన తలానికి ఎగసి అద్భుతాకారయై తన చేతిలోని మధుపాత్ర నుంచి ప్రీతిపూర్వకంగా కాస్త మధువునాస్వాదించింది. ఉద్ధరంగా పెద్ద పెట్టున నవ్వింది. హుంకరించింది. కంసుణ్ణి తీవ్రంగా నిష్ఠురంగా నిరసిస్తూ ఇట్లా పలికింది. కంసుడి ముఖాన కత్తివేటుకు నెత్తురుచుక్క లేకుండా పోయింది.
ఓరీ! దుర్మార్గుడా! శిలపై మోది నన్ను చంపివేయాలనుకున్నావు కదా! ఇంతకూ ఇంత అనుభవిస్తావు. నీ శత్రువు నిన్ను ఇట్లానే చీల్చి చంపుతాడు. అపుడు నీ ప్రాణాలతోపాటు నీ నెత్తురుకూడా ఆస్వాదిస్తాను నేను. నీ అహంకారం ఇంతటితో అణిగిపోతుంది. నీవు ఎగిరెగిరిపడుతున్నావు. నీ త్రుళ్లి అణిగిపోతుంది. నీ గర్వపంకం ఇంకిపోతుంది అని హెచ్చరిస్తూ తనను సిద్ధ సంఘం కొలిచి ఉండగా అదృశ్యమైపోయింది ఆదేవి.
ఇక కంసుడు పశ్చాత్తాప మనస్కుడైనాడు. దేవకి దగ్గరకు వచ్చి చేతులు జోడించాడు.
నా ప్రాణం రక్షించుకుందామని ఇంతా అంతా అనరాని పాపం చేశాను చెల్లెలా! పరమ దుర్మార్గంగా నిన్ను శోక సముద్రంలో ముంచాను. నా సమస్త యత్నమూ బూడిదపాలైంది. వృధా అయిపోయింది. మానవ ప్రయత్నం అల్పమైనది. దైవ బలం ముందు అది నిలవలేదు. విధాతృ నిర్ణయం ఎవరు తప్పించగలరు? మానవుడి తుచ్ఛయత్నం దాని ముందు సాగగలదా? కాలమే కర్త. కాలమే హుస్త. మానవుడు నిమిత్తమాత్రుడు.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు