మంచి మాట

గృహస్థ్ధర్మము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గృహస్థాశ్రమమునకు చెందిన మానవులు తమ తమ గృహ ధర్మములను ఆచరించుచుండవలెను. వాటిని భగవంతునికే నివేదన చేయవలెను. పెద్దలను కూడా సేవింపవలెను. పైన ఉదహరించినవి కాక గృహహ్థుడు సమయానుసారము విరాగులతో కూడి ఉండవలెను. పదే పదే భక్తిశ్రద్ధలతో భగవంతుని యొక్క అవతార లీలామృతమును గ్రోలుచుండవలెను.
నిద్రనుంచి లేచిన మనుష్యుడు తాను స్వప్నములో చూచిన విషయములందు ఏ విధముగా ఆసక్తుడు కాదో అట్లే అతడు సత్సాంగత్యము వలన పరిశుద్ధ మనస్కుడై శరీరము, భార్యాపుత్రులు, ధనము, మొదలగువాటియందు ఆసక్తిని విడిచి పెట్టవలయును. ఎందుకనగా ఏదైనా ఒక రోజు వాటిని సంపూర్ణముగా త్యజించవలయును కదా!
బుద్ధిమంతుడు అవసరము ఉన్నంతవరకే శరీరమునకు గృహమునకును సంబంధించిన పనులు చేయుచుండవలెను. అంతరంగికముగా నిరాసక్తుడైనను, బయటికి ఆసక్తి యున్న సామాన్య మానవునివలె ప్రవర్తించవలెను. తల్లిదండ్రులు, సోదరులు, పుత్రులు బంధు మిత్రులు మొదలగువారు చెప్పిన విషయములను, అంశములను విని, ఎట్టి మమకారమూ లేకుండా వానిని ఆమోదింపవలయును.
పృధ్వి నుండి ఉత్పన్నమైన ఖనిజములను, అకస్మాత్తుగా లభించిన ద్రవ్యము మున్నగువాటిని భగవంతుని ప్రసాదములుగా భావించవలెను. ప్రారబ్దానుసారము లభించిన వాటిని అనుభవించవలెను. వాటిని ఎన్నడును కూడబెట్టక సత్పురుషుల సేవలు మొదలగు కార్యములందు వినియోగించవలెను.
ఎంతటి సంపదతో తన పొట్ట నిండగలదో, అంతటి సంపద పైననే ఆ వ్యక్తికి అధికారముండగలదు. దానికి మించిన సంపద తనదని భావించువాడు చోరుడు అగును. ఏలనన తన స్వశక్తిని ఉపయోగించి భగవంతునిచే దీనులగువారి సంపదను దోచుకొనుటకు ఇది సమానము గాదా! అందులకు ఆ వ్యక్తి భగవంతుని దృష్టిలో శిక్షార్హుడును అగును.
పశుపక్ష్యాదుల యందు గృహస్థుడు కనికరము చూపవలెను. వాటిని తన పుత్రసమానముగా భావింపవలెను. గృహస్థుడు ధర్మార్థ కామములందు ఎక్కువశ్రమపడక తన సమస్త భోగ సామగ్రిని పశుపక్ష్యాదులకు, నిమ్నజాతులకు యధోచితంగా పంచి పిదప మిగిలినదానినే ఉపయోగించవలెను.
తన ఆత్మీయులను అతిథి పరిచర్యలందు ఉపయోగించవలెను. భార్య, పుత్రాదులయందు వ్యామోహము విడిచిపెట్టినవాడే ఓటమి నెరుగని భగవంతునిపై కూడా విజయము సాధించును. బుద్ధిమంతుడు ఇది నాది అని భావము కలిగియుండరాదు. అతడు తనకు ప్రాప్తించిన దానితో ప్రతిదినము, దేవతలు, మహానుభావులు, తోటిమనుష్యులు పితృదేవతలు, ఇతర ప్రాణులను సేవించవలెను.
తన ఆత్మను కూడా సేవించవలెను. తద్వారా సర్వరూపముల భగవంతుని సేవించిన వాడగును. సజ్జనుడు నివసించిన దేశమే శ్రేష్టమైనది. భగవంతుడొక్కడైనను సర్వజీవులయందును వేర్వేరు రూపములయందు ప్రకాశించుచున్నాడు. బుద్ధిమంతుడైన మానవునికి సర్వజీవుల సేవచే విశిష్టత చేరుకుంటుంది. కావున తన ధర్మము నెరవేర్చగలిగిన గృహస్థుడే శ్రేష్టునిగా పరిగణింపబడతాడు.
...............................
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు.
రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.
.................................

-పట్టిసపు శేషగిరిరావు