భక్తి కథలు

కాశీఖండం 8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మబంధువైన భాస్కరుడు పాండ్య నృపాలుర అంతఃపుర ప్రాసాదాలకు చేరువుగా వున్న స్వర్ణ పద్మాలు కల నడబావుల్లో తన ప్రతిబింబం ప్రకాశించగా తుండీర దేశపు నడిమి చక్కి ఆకాశ రాజు మార్గాల్లో నడచింది.
ఒక ద్వీపానికి ఏ అచలం ఉదయాద్రి అవుతున్నదో ఆ వెనుక దీవికి ఆ గిరియే అస్తంగిరి అవుతోంది. ఒక లంకలో ప్రాతస్సంధ్య తేజరిల్లుతూ వుంటే మరొక ద్వీపంలో సాయం సంధ్య ఉదయిస్తోంది.
ఒక ద్వీపంలో పూర్ణచంద్రికలు నింగిని ప్రాకుతూ వుంటే మరొక ద్వీపములో బీరెండ నిప్పులు చెరుగుతోంది. ఒక దీవిలో ఒక రుతువు ప్రారంభం కాగా వేరొక లంకలో ఇంకొక రుతువు చిగురిస్తోంది. ఒక లంకలో దక్షిణాయనం ప్రవర్తిస్తూ వుంటే ఇంకొక దీవిలో ఉత్తరాయణం ఉప్పతిల్లుతున్నది. ఇన్ని అచ్చెరువు గొల్పు విషయాలకి ఏ రవి తేరు ప్రభావం హేతుభూతం అయిందో అట్టి సూర్యరథం లంకలోని మలయాచలం మీద నడచింది.
చందన గిరిమీద వున్న సర్ప స్ర్తిల ఫణ రత్నముల్లో ప్రతిఫలించి, లంకాపురంలో వెలసిన శాంకరీ దేవత కిరీటమందలి చంద్రవంకతో మత్సరం వహించి, కాంచీపురం చెంతకల కంపా నదీ తీర పద్మవనావళిని మేలుకొలిపి, తమిళతరుణుల పీనవక్షస్స్థలాల్లో క్రొత్త చెమ్మట బిందువులు నిలిపి, కావేరీ నది జలధిలో సంగమించే తావులందలి జలాల ఆస్ఫాలనలతో చిందిపడుతున్న కణాల సోకుకి శీతలాలయిన మందపవనాలవల్ల మార్గాయాసాన్ని తీర్చుకొని- దక్షిణ భారతదేశంలో చనుతరిని-
అన్ని వంకల క్రమ్మి వ్యాపించే స్వభావం కల చిమ్మ చీకట్ల సమూహాలని నశింపచెయ్యడం అనే మహాదీక్షా రంభానికి గురుస్థానం అయిన వేయి కిరణాల పరిషత్తుకి ఆధారం అయిన మండలం కల సూర్యుడికి అధిష్ఠానమయిన కారణంగా ఆ భారాన్ని వహించడంవల్ల బరువెక్కి నది అయి సప్తవాయువులు క్రమంగా మూపులు మార్చుకొంటూ అతి ప్రయాసంతో నడుస్తూ వున్న సూర్య రథం ఆకాశము నడిమిభాగం చేరుకొనే తరికి పిడుగుపడ్డ మోతతో బ్రహ్మాండ కర్పరం పగులు విధంగా వింధ్యాచలం చరియలకి భగ్గుమంటూ తాకింది.
వింధ్యాచలం అడ్డుతగులగా వడిచెడి రవి రథం ఒరిగిపోయిన చక్రం కలది అయి సముద్రం నీలిమ ముఖాన ఏర్పడిన ఇసుక మెట్టకి తగిలి ఆగిన ఓడవలె నిలిచిపోయింది.
ఒక్క నిమేషకాలమైనా రాహువు పుక్కిట చిక్కువడక గమనించు అర్కుడు ఈ వింధ్య పర్వతం ప్రక్కనే పెక్కేండ్లు ఆగిపోయాడు. విధివశపు ప్రభావం ఎంతటిదో కదా!
అర్థ నిమేష పరిమితం అయిన సమయంలో రెండు వేల రెండు నూర్ల రెండు ఆమడలు నింగిని పరుగు పెట్టు సూర్యరథం పెద్ద కాలము- బహు సంవత్సరాలు- నిలిచిపోయింది. నియతి మహిమ ఇట్టిదే సుమా!
సృష్టిస్థితి ప్రళయాల మూడింటికి సూర్యుడొక్కడే కారణం. కనుక ఆ సూర్య సంబంధావరోధము ముజ్జగాలకి ప్రతిబంధమై నిరంతరం ఆపదల పరంపరని అధికం చేసింది.
దేవతలకు హవిస్సులు వేల్చుతరిని వినవచ్చు స్వాహాకార వషట్కారాలు వినరాకున్నవి. పితృదేవతల కొసగు హవిస్సులొసగుచు పలుకు స్వధాకారాలు లేవయ్యెను. మూడు అగ్నిహోత్రాలు- ఆర్హపత్య, ఆహవనీయ, దక్షిణాగ్నులు మూడున్ను- మూల పడిపోయాయి. కాల ప్రమాణాలను లెక్కపెట్టనేరక చిత్రగుప్తాదులు చిక్కులు పడసాగారు. ఇది సంధ్యావేళ, ఇది పగటి సమయం, ఇది రాత్రివేళ అనే సమయ ప్రమాణాలు క్రమం తప్పిపోయాయి. తరితో వానలు కురవక పంటలు పండడం లేదు. పాడి కూడా కరవైపోయింది.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి