డైలీ సీరియల్

ఒయాసిస్ 28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ శే్వత హత్య కేసులో ఇనె్వస్టిగేషన్ ఏ మేరకు ప్రోగ్రెస్ సాధించిందో సమీక్షించేందుకు క్రైం డిపార్ట్‌మెంట్ పర్యవేక్షిస్తున్న అడిషనల్ పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఇన్స్‌పెక్టర్స్ రణధీర్, శంభుప్రసాద్, సబ్ ఇన్స్‌పెక్టర్ రాజు హాజరైనారు.
ఇంతవరకు తాను చేసిన ఎంక్వయిరీల గురించి, వాటివల్ల తెలిసిన విషయాల గురించీ రణధీర్ పై అధికారులకు వివరించడం మొదలుపెట్టాడు.
‘‘ఇప్పటివరకు నేను సీనియర్ డాక్టర్ రోహిణిని, అశ్వనీ నర్సింగ్ హోంలో డ్యూటీ డాక్టర్‌గా ఉన్న మమతను, శే్వత భర్త అహోబలరావును, ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న బాలాజీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సింహాద్రిని, వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఛాయను, శే్వత క్లాస్‌మేట్ డాక్టర్ హేమంత్, అదే కాలేజీ క్లర్క్‌గా పనిచేస్తూ, శే్వతమీద కోపంగా ఉన్న దీప్తిని, అశ్వినీ నర్సింగ్ హోంను బ్లాక్‌మెయిల్ చేసి లక్ష రూపాయలు డబ్బు గుంజాలని ప్రయత్నించిన ఓ యువకుడ్ని కలిసి వాళ్ళు చెప్పే విషయాలను క్రోడీకరించాను. కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిసాయి. అనుమానించదగిన పాయింట్స్ గుర్తించాను. అయితే నేరస్థుడు ఎవరూ అన్నది నిర్థారించడానికి సరైన ఆధారం లభించలేదు.. ఇప్పుడున్న ప్రోగ్రెస్‌ను బట్టి త్వరలోనే తగిన సాక్ష్యాధారాలతో హంతకుడు ఎవరో, హత్య ఎందుకు చేశాడో నిరూపించగలనన్న నమ్మకం నాకుంది..’’ అన్నాడు రణధీర్.
‘‘ఓ.కె.. ఇప్పటిదాకా నువ్వు సేకరించిన విషయాలేమిటో చెప్పు..’’ అన్నాడు అడిషనల్ పోలీస్ కమిషనర్.
‘‘శే్వతకు చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు.. సర్వీసులో ఉండి చనిపోయినందున, ఆయన పనిచేసిన ఆఫీసులో శే్వత తల్లికి కింది స్థాయిలో ఉద్యోగమిచ్చారు. అదే జీవనాధారం. శే్వత తెలివిగలది. పెద్ద చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న తపన, ఆరాటం ఉన్నాయి. ఆ అమ్మాయి ఆసక్తిని గమనించిన కొంతమంది బంధువులు ఇతోధికంగా ఆర్థిక సాయం చేశారు. ఆ రోజుల్లో డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడింది. చదువుకొనే రోజుల్లో ఒక శ్రీమంతుడి భార్యకు పక్షవాతం వచ్చి మంచంమీద నుంచి లేవలేని స్థితిలో ఉంటే రోజూ శే్వత ఆమెకు స్నానం చేయించి, తల దువ్వి, చీర కట్టి కుడి ఎడమ అని చూసుకోకుండా సేవ చేసి డబ్బు సంపాదించింది. అంత కష్టపడింది కాబట్టే దేవుడికన్నా ఎక్కువగా డబ్బుకి విలువనివ్వడం నేర్చుకుంది. ఈ మనస్తత్వం ఆమె జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పింది. తర్వాత జీవితంలో ఆమె కొన్ని నిరాశలకు గురికావటానికి ఈ మనస్తత్వమే కారణమయింది. డబ్బుతో కొనలేని సుఖ సంతోషాలు కొన్ని ఉంటాయన్న ఆలోచనను ఆమె రానివ్వలేదు.
‘‘మెడిసిన్ చదివే రోజుల్లో కొంతమంది ఫ్రెండ్స్ దొరికారు. వాళ్ళు శ్రీమంతుల పిల్లలు కావటంతో దేనికీ వెనకాడేవారు కాదు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేసేవారు. ఏనాటికైనా తను వాళ్ళ స్థాయికి చేరుకోగలనా అన్న ఆలోచన శే్వతను మానసికంగా కృంగదీస్తుండేది.. ఇలా ఉండగా.. ఆమెకు హేమంత్ మంచి స్నేహితుడయ్యాడు. చిన్న చిన్న సహాయాలు చేసేవాడు. ఇంటికి తీసుకెళ్లి ఒకటి రెండు సార్లు తన కుటుంబ సభ్యుల్ని పరిచయం చేశాడు. హేమంత్‌ని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో వాళ్ళ ఆదరాభిమానాలకు నోచుగలనా అన్న ఆశ కల్గింది. అయినవాళ్ళు, బంధువులూ ఎవరూ లేనందున హేమంత్ ఆప్తుడిలాగా కన్పించాడు. అతడ్ని ప్రేమించడం నుంచి ఆరాధించే స్థాయికి చేరుకుంది. హేమంత్ కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ చదువు పూర్తయి, డాక్టర్‌గా స్థిరపడ్డ తర్వాత పెళ్లి ప్రసక్తి తీసుకురావచ్చునన్న ఆలోచనలో ఉన్నాడు.
‘‘ఒక ఫంక్షన్‌లో అహోబలరావు శే్వతను చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు. ఆమె గురించి విచారించాడు. పేదింటి పిల్ల అయినా అభ్యంతరం లేదన్నాడు. ఆమె ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తానన్నాడు. ఆమె కోసం హాస్పిటల్ కట్టిస్తానన్నాడు. శే్వతకు ఈ విషయాలన్నీ చేరవేశాడు. శే్వతను, ఆమె తల్లిని తమ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇంటిని, హోదాని, ఆస్తిని చూశాక శే్వతకు తాను కలలు కంటున్న ప్రపంచం ఇదేననిపించింది. అహోబలరావుకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి ఉంది. చిన్న వయసు నుంచే రాజకీయాల్లో పదవులు చేపడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. శే్వతకన్నా అహోబలరావు వయసులో పదేళ్ళు పెద్దవాడైనా శే్వతకు మిగిలిన విషయాల ముందు అదొక అభ్యంతరంలా కనిపించలేదు.
‘‘శే్వత అహోబలరావు భార్య అయిపోయింది. ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకుంది. అన్నమాట ప్రకారం అహోబలరావు ఆమె కోసం నర్సింగ్ హోం కట్టించాడు. ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాడు. రాజకీయాల్లో పదవులు నీటి బుడగల్లాంటివి. ఎప్పుడొస్తాయో, ఎప్పుడు పోతాయో తెలియదు. కానీ, ఒక స్థాయికి చేరుకున్నాక ఆ స్థాయిని నిలబెట్టుకోవాలి అంటే క్రమం తప్పకుండా లక్షల్లో ఆదాయం వస్తుండాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పలుకుబడి ఉన్నప్పుడే పనులు చేయించుకోవాలి. బ్యాంకు నుండి రెండు వందల కోట్లు అప్పు తీకున్నాడు. రాజకీయాల్లో సంపాదించే అక్రమార్జనలతో ఆస్తులు సమకూర్చుకుంటారు. అయితే, ఆ ఆస్తులు ఎలా వచ్చాయని ఎవరన్నా అడిగితే చూపించడానికి బ్యాంకు లోను తీసుకుంటారు.. దాన్ని తీర్చడం అంటూ ఉండదు.. ఆ విధంగా అహోబలరావుకు వద్దంటే డబ్బు వచ్చిపడుతోంది. ఒక రకంగా శే్వత ఆశ, ఆశయం నెరవేరాయి..
‘‘కానీ కేవలం డబ్బుతోనే జీవితం సుఖంగా గడిచిపోతుందన్న ఒకనాటి అభిప్రాయం పూర్తిగా నిజం కాదన్న సంగతి క్రమంగా తెలిసొచ్చింది. శరీరానికి ఆహారం ఎంత అవసరమో, మనసుకు ప్రేమ అంత అవసరం అన్న విషయం ఆలస్యంగా అర్థమైంది. ప్రేమ అనేది ఉచ్ఛాస నిశ్వాసలంతా సహజంగా ఏర్పడాలి కానీ, తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదని గ్రహించింది.

- ఇంకా ఉంది

శ్రీధర