మంచి మాట

భగవంతుని ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు ప్రేమ స్వరూపుడు. నిర్హేతుక జాయమాన కరుణాసముద్రుడని భక్తులు వర్ణిస్తారు. భగవంతుని ప్రేమ అనంతం. అపారం. అతని ప్రేమకు ఎక్కువ తక్కువ భేదాలుగాని స్వపర భేదాలు గానీ లేవు. తనను ద్వేషించే వారినీ తనను ఆరాధించేవారినీ సమానంగానేప్రేమిస్తాడు.
జీవులకు జీవించినంత కాలం లభిస్తున్న ఆహారం నీరు, గాలి, వెలుతురు అన్నీ భగవంతుని దయతో కలిగినవే. మనకు హాని తలపెట్టిన వారికి తిరిగి హాని తలపెడతాము. మేలు చేసిన వారికి మేలు కలిగిస్తాము.ఇది సామాన్యుల మానవ లక్షణం. కాని పరమాత్మ తనను నమ్ముకున్న భక్తులకేకాదు తనను నిత్యము ద్వేషించినవారికి కూడా మోక్షాన్ని ప్రసాదించాడు.
శిశుపాలుడు ఎప్పుడూ కృషుణ్ణి దూషించడమే పనిగా పెట్టుకున్నాడు. హిరణ్యకశిపుడు సర్వదా హరిని ద్వేషిస్తునే ఉండేవాడు. అటువంటి వారికి కూడా శ్రీహరి సద్గతులను కలిగించాడు.
కొందరు నాస్తికులు, భగవంతుడి ఉనికిని అంగీకరించరు. భగవంతుడు లేడని ప్రచారం కూడా చేస్తారు. అటువంటి వారిపై కూడా భగవంతుడు ప్రేమ వర్షాన్ని కురిపిస్తాడు.
కొందరు భక్తులకు భగవంతునిపై అపార విశ్వాసం, భక్తి భగవంతుడు లేడని ఎవరైనా అంటే వారిపై ఎక్కడలేని కోపం తెచ్చుకుంటారు. అటువంటి వారిపై ద్వేషం కూడా పెంచుకుంటారు. కాని భక్తుడైనవాడికీ ఏ ప్రాణియందు కూడా ద్వేషబుద్ధి ఉండకూడదు. భక్తుడి లక్షణాలలో అది మొదటి లక్షణం. భగవద్గీత భక్తియోగంలో చెప్పినట్లుగా భక్తుడు సర్వుల యెడ భగవంతుని అంశనే చూడాలి.
ఒకసారి ఒక భక్తుడింటికి ఆకలితో అలమటిస్తూ ఒక వృద్ధుడు వచ్చాడు. అతనిని సాదరంగా పిలిచి భోజనం పెట్టాడు. సాక్షాత్ భగవంతుడే మిమ్ములను అతిథి రూపంలో పంపించాడు. తృప్తిగా భుజించమని చెప్పాడు. అపుడు ఆ వృద్ధుడు అయ్యా ఆ హారం పెట్టినందుకు మీకు ధన్యవాదాలు. కాని మధ్యలో లేని భగవంతుడి గురించి ఎందుకు లెండి. భగవంతుడే ఉంటే, నా గతి ఇలా ఎందుకుంటుంది? అని నిష్ఠూరంగా మాట్లాడాడు.
భక్తుడికి కోపం వచ్చింది. వెంటనే వచ్చిన వానిని ఆతిథ్యం ఇస్తున్నవాడిని మీరు మాఇంట భోజనం చేయనవసరం లేదు. నాస్తికులకు భోజనం మేము పెట్టము. బయటకు నడవండి అంటూ తింటున్న ఆహారాన్ని లాక్కొని తోసేసాడు.
ఆ రాత్రి నిద్రలో భగవంతుడు ఆ భక్తునికి కనిపించాడు. ఆకలి తో వచ్చిన వృద్ధుడిని అలా అవమానించెందుకు నాయనా ? ఎన్నో ఏళ్లుగా అతడు నన్ను దూషిస్తూనే ఉన్నాడు. ఐనా యినే్నళ్లు గా అతనిని పోషిస్తూ వస్తున్నాను కదా. నా కోసం నువ్వు ఒక్క పూట అతనిని భరించలేకపోయావు అని అన్నాడు.
వెంటనే మేల్గాంచిన భక్తునికి కనువిప్పు కలిగింది. ద్వేషించినా, ఆరాధించినా అందరూ భగవంతుని పిల్లలే కదా. అమ్మ పిల్లలందరినీ సమాన దృష్టితో చూచినట్లు గా భగవంతుడు కూడా సృష్టి మొత్తాన్ని సమానంగా చూస్తాడు . కనుక నేను భగవంతునికి ఇష్టమైన దానినే చేస్తాను. నాకు భగవంతుణ్ణి ఇష్టపడేవారైనా ఇష్టపడని వారైనా ఒక్కటే. జంతువు అయినా మనిషి యైనా భగవంతుని అంశంగానే చూస్తాను ఇప్పటి నుంచిఅనుకొన్నాడు. తెలియక చేసిన తన తప్పును క్షమించమని భగవంతుని వేడుకున్నాడు.
జీవారాధకుడే నిజమైన శివారాధకుడు. జీవులను ద్వేషిస్తూ దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడం అజ్ఞానమే. ప్రేమ అమరం. ప్రేమ పవిత్రం. ప్రేమ దైవ స్వరూపం. దైవం ప్రేమ స్వరూపం. సత్యము, ధర్మము , ప్రేమ, శాంతి ఈ నాలుగు దైవ లక్షణాలు. ఎవరైనా సరే ఈ లక్షణాలను నేర్చుకుని మరీ ఆచరిస్తే వారికి భగవంతుడికి భక్తుడికి తేడా ఉండదు.

నెయ్యిగాపుల కృష్ణ