భక్తి కథలు

హరివంశం - 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందుడు గోకులంలో వున్న వాళ్ళ చుట్టాలనందరినీ పిలిపించుకున్నాడు. వాళ్ళందరికీ అమూల్యమైన వస్త్రాలు బహూకరించాడు. గోపూజోత్సవం జరిపాడు. గోశాలలన్నిటినీ పరమ సుందరంగా అలంకరింపజేశాడు. ఇక గోప వనితలంతా యశోద చుట్టూ చేరి ఆమె భాగ్యాన్ని కొనియాడారు. ఇంత చక్కటి వాణ్ణి కన్నది మన యశోద! ఇంత అదృష్టం ఎవరికైనా ఉంటుందో! ఏమి నోములు నోచిందో. ఏమి వ్రతాలు ఆచరించిందో అని పొగడ్తలతో ముంచెత్తారు యశోదను.
ఇక నందుణ్ణి గోకులంలో పిన్నలు పెద్దలు అయిన గోపకులంతా అభినందుణ్ణిగా ఎంతో ప్రశంసించారు. ఇంతటి సౌభాగ్యం ఎవరికి కలిగేను! ఆ తేజస్సు, ఆ చక్కదనం, ఆ సొగసు, ఆ సంపద, ఆ ఐశ్యర్యం మన నందుడి కాక ఎవరికైనా కలిగేనా? అని మురిసిపోయినారు గోపకులంతాను.
గోకులంలో ఇంత మిన్నుముడుతుండగా ఇక కంసుడు తన అనుచర గణం వల్ల విని మధురలో విషాదంలో కూరుకొనిపోయినాడు. నిరంతరం కౌశికీ దేవి తనను శపించిన సన్నివేశం కంసుడి చెవిలో ప్రతిధ్వనిస్తూనే వుంది. ఆ పరాభవాన్ని ఎంత ప్రయత్నించినా మరచిపోలేకపోతున్నాడు కంసుడు.
పొగరు కాస్త తగ్గించుకుని దిగులుపడుతున్నాడు. తన అహంకారం ఎవరో అణగదోక్కినట్లైంది. అయినా క్రోధం తగ్గలేదు. తన అనుచర గణాన్ని అంతా పిలిపించుకున్నాడు. తన గోడు వాళ్ళకు వెళ్ళబోసుకున్నాడు. ఏ విధంగానైనా మీరే నన్ను గట్టెక్కించాలని వాళ్ళను పొగిడాడు కంసుడు. నందకుమారుడిపైన తన సందేహం వాళ్ళకు చెప్పాడు. ఇందులో శకటుడనే రాక్షసుడు వెంటనే వెళ్లి నందుడికి అత్యంత ప్రియమైన ఒక శకటాన్ని ఆవహించాడు. తన మాయ ఎవరికీ తెలియకుండా ఎంతో నేర్పుతో సమయం ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తూ ఉన్నాడు.
ఒక రోజు యశోద తన గారాబు పట్టిని నిద్రపుచ్చి ఆ ఎతె్తైన, ఉరువైన శకటం కింద ఒక పాన్పునమర్చి అక్కడ పిల్లవాణ్ణి పడుకోబెట్టింది. తన నేస్తురాండ్రు కొందరితో కలిసి క్షణంలో వచ్చేస్తాను కదా! అనుకుంటూ అక్కడ తమ గోష్ఠానికి దగ్గరగానే ఉన్న యమున మడుగుకు స్నానమాడటానికి వెళ్లింది. ఎంత వేగంగా ఈ పని ముగించుకొని రావాలా! అని త్వరపడింది.
కొంచెంసేపు కాగానే ఇక్కడ బాలకృష్ణుడికి మెలుకువ వచ్చింది. అటూ ఇటూ చూశాడు. ఎవ్వరూ కనపడలేదు. ఏదో బెంగ పెట్టుకున్నట్లూ, అందరూ తనను విడిచి ఎందుకు వెళ్లారా అన్నట్లు చేతులు రెండూ నోట్లో కుక్కుకున్నాడు. బుడి బుడి రాగాలు తీశాడు. కళ్ళు నులుపుకున్నాడు. కన్నీరు కాటుకతో కలిసి చెంపలపైకి జారగా తుడుచుకుంటున్నట్లు మొగమంతా పులుముకున్నాడు. పక్కమీద లేచి కూచోవాలని ప్రయత్నం చేసేవాడు. నడ్డి ఎత్తటానికి అటూ ఇటూ కదిలాడు. చేతగాక గింజుకున్నాడు కాసేపు. ఆ పసితనపు ముగ్ధత్వమంతా ప్రదర్శించాడు. ఇదంతా చూస్తూనే వున్నాడు శకట రాక్షసుడు.
ఒకవైపు వొరిగి చక్రపు కమ్ములు బాలుణ్ణి నుజ్జు నుజ్జుగా అదిమివేసేట్లుగా చంపాలా లేదా పోలుగాడి ఎత్తి మీద పడి పసివాణ్ణి అణిగిపోయేట్లు చేయాలా? బండి మొత్తం తలకిందులై బాలుడి మీద పడేట్లు చేయాలా? అని అదనుకోసం ఆలోచిస్తున్నాడు రాక్షసుడు. ఆ శిశువును చూసినపుడు తనలో కోపం పెల్లుబుకుతుండగా! ఇట్లా శకటాసురుడి మదిలో ఆలోచనలు మెదలుతూ ఉండగానే బాల లీలగా ఒళ్ళు విరుచుకుంటున్నట్లు కాలు సాచి ఆ బండిని తాటించాడు కృష్ణుడు. అది ఒక్కసారిగా పైకి ఎగిరి అటు పక్కకు పడిపోయింది.

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు