మంచి మాట

కర్తవ్య మహిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక వ్యక్తి, తాను ఆచరించవలసిన విద్యుక్త ధర్మాన్ని కర్తవ్యం అంటారు. భాగవత / భగవంతుని సేవ, భక్తుని కర్తవ్యం, న్యాయం, ధర్మం, చట్టాలను గౌరవిస్తూ సమాజ సేవ చేయటం అతని కర్తవ్యం. శాంతిభద్రతలను కాపాడుతూ, చట్టాలను రక్షిస్తూ, పాటిస్తూ, ప్రజలకు ధైర్యాన్ని అందించడం రక్షక భటుల కర్తవ్యం. న్యాయాన్ని నిలబెట్టి కాపాడటం న్యాయాధీశుల, న్యాయమూర్తుల కర్తవ్యం. ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పరిపాలన సాగించటం పాలకుల కర్తవ్యం.
భగవద్గీతలోని శ్లోకం ‘కర్మణ్యే వాధికారస్తే..’ ప్రకారం ఒక వ్యక్తి తాను కర్మలను ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా, విజయాపజయాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్వర్తించాలి. ఇక్కడ ఆ వ్యక్తి తన కర్మను, ఆచరించవలసిన ధర్మాన్ని ఎట్టి పరిస్థితులలోను నిర్వర్తించాలనేది గీతాచార్యుని బోధన.
రామాయణాన్ని పరిశీలిస్తే వృద్ధులైన, అంధులైన తన మాతాపితరుల సేవలోనే తరించి, దురదృష్టవశాత్తు దశరథుని శరాఘాతానికి గురై మరణించిన శ్రవణ కుమారుడిది మొక్కవోని కర్తవ్యదీక్ష. ఒక విద్యార్థి సక్రమంగా పాఠశాలకు లేదా కళాశాలకు వెళ్లి విద్యా విజ్ఞానాలను సముపార్జించటమనేది అతని కర్తవ్యమూ, విధి. ఈ కర్తవ్యాన్ని సరిగా నిర్వహించితే, అతనికి జీవితంలో మంచి భవిష్యత్తు- పురోగతి లభిస్తాయి. ద్వాపర యుగంలో సాందీపుల వారి వద్ద విద్యనభ్యసించిన శ్రీకృష్ణ, కుచేలురు, బలరాముడు ఇందుకు ఉదాహరణలు. ఒకే గురువు వద్ద విద్యనభ్యసించినా, తరువాతికాలంలో మహారాజు అయి, తన సహాధ్యాయి అయిన ద్రోణుని చిన్నచూపు చూసిన ద్రుపదుడు- ఆ తరువాత అర్జునుని చేతిలో ఓడిపోయి, ఆ ద్రోణుని ముందరే పరాభవం పొందిన వ్యక్తిగా నిలబడటం మరొక ఉదంతం.
ఇక్కడ ద్రుపదుడు తన సహాధ్యాయిని గౌరవించాలనే కర్తవ్యాన్ని పాటించకపోవడమే అతనికా దురవస్థని దుస్థితినీ కల్పించింది. ప్రతి మనిషీ చతుర్విధ పురుషార్థాలను ఆచరించాలి. అది అతని కర్తవ్యము, ఆధ్యాత్మిక అవసరము కూడా. ఈ పురుషార్థాలు- ధర్మము, అర్థము, కామము, మోక్షము. దురదృష్టవశాత్తు ఎక్కువమంది అర్థము, కామముల మీదనే మనసు లగ్నం చేసికొని, తమ కర్తవ్యం పూర్తి అయిందనుకొంటారు. ఈనాటి ఉరుకుల పరుగుల జీవితంలో మిగతా రెంటి పురుషార్థాలమీద కూడా మనసు లగ్నం చేయాలి. ఇది గమనించే, ఈనాడు కొందరు సాధకులు, యోగులు వివిధ మాధ్యమాల ద్వారా ప్రవచనాలు చేస్తూ, తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, ప్రజలను సరైన గమ్యాలవైపు దిశానిర్దేశనం చేస్తున్నారు. ఈ చతుర్విధ పురుషార్థాల ద్వారా ఒక వ్యక్తి ఉత్తమ పురుషుడై, ప్రకృతి యెడల సమధర్మాన్ని పాటిస్తూ, సమాజంలో ప్రతి ఒక్కరి హితం కోసం కృషి చేస్తూ జీవితంలో పరిపూర్ణత సాధిస్తూ, సంపూర్ణ మానవుడై, తుదకు మోక్షమార్గం ద్వారా కైవల్యాన్ని సంప్రాప్తించుకొంటాడు. ఈ లోకంలో ఈ విధంగా తన కర్తవ్యాన్ని నెరవేర్చుకొన్నవాడవుతాడు.
అదేవిధంగా చతుర్విధ పురుషార్థాలను నియమ నిష్ఠల ద్వారా ఆచరించటమే తమ కర్తవ్యంగా భావించిన పురాణ పురుషులు- జగన్మాత సీత తండ్రి జనక మహారాజు, సత్యవ్రత దీక్షను తుదివరకు పాటించిన సత్యహరిశ్చంద్రుడు. ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని నిర్వర్తించేటప్పుడు, విజయం వస్తే పొంగిపోతాడు. విఫలుడై, అపజయం సంప్రాప్తిస్తే కృంగిపోకూడదు. భగవంతుని మీద భారం వేసి అడుగు ముందుకు వేస్తే ఎప్పటికైనా ఆ వ్యక్తికి మంచే జరుగుతుంది చివరకు. సక్రమంగా ఆచరించబడిన, నిర్వర్తించబడిన కర్తవ్య మహిమే ఆ వ్యక్తిని సమాజానికి ఉపయోగపడే అచంచల శక్తిగా మార్చుతుంది.

-పొత్తూరి రాఘవేంద్రరావు