భక్తి కథలు

కాశీఖండం 105

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అగస్త్య మునిచంద్రా! చతుర్వేదాల అధ్యయనం, యజ్ఞపరత్వం, అస్ఖలిత బ్రహ్మచర్యం, తపము, దమము (అంతరింద్రియ నిగ్రహం), శ్రద్ధ, ఉపవాసం, పరాధీనుడు కాకుండా వుండడం, శమం (బహిరింద్రియ నిగ్రహం) ఇవి బ్రహ్మవిజ్ఞానానికి కారణాలు.
ధర్మనిర్మల హృదయా! ఆత్మ పదార్థం గురించి వినవలసి వుంది. ప్రణవవాచ్యం అయిన పరతత్త్వంపట్ల నిష్ఠకల మునీశ్వరా! ఆత్మపదార్థం మననం చేసుకోతగినది. సకల శాస్త్ర విశారదా! ఆత్మ పదార్థం దర్శింపదగినది. కపటరహితా! ఆత్మ మరల మరల మరల ధ్యానించతగినది సుమా! ఆత్మ సందర్శనానికి యోగాభ్యాసం సర్వోత్తమం అయిన సాధనం.
మహామునీ! యోగసాధనకి పర్వత గుహగర్భాల్లోను, కాంతారాలలోను, పొదరిండ్లలోను నివసించడం కారణం అవదు. వివిధ గ్రంథాధ్యయనం, తాత్పర్య పర్యాలోచనం- అనుశీలనం- ఈ కర్మతంత్రం కాదు కారణం.
దానం, వ్రతాచరణము, యజ్ఞము మొదలైన కర్మ కాండ కారణం కాబోదు. భ్రూమధ్య సంవీక్షణం, పద్మాసనాది ఆసనాలు వేయడం కాని కారణం కాదు. యోగసాధనకి వౌనం, శౌచం, యంత్ర మంత్రాలు కారణాలు అవవు. నిశ్చయబుద్ధి, ఆసక్తిలోని నిశ్చలత్వం, పూనికయున్ను, అభ్యాసమున్ను కారణాలు అవుతాయి.
ఎవడు ఆత్మను తప్ప అన్యం ఎరుగడో, ఎవడు అహర్నిశమున్ను ఆత్మ వస్తువుని ఆత్మలోనే సందర్శిస్తూ వుంటాడో ఎవడు ఆత్మయే రెండవదిగా కలవాడో అతడే యోగలక్ష్మికి అధినాధుడు.
కొందరు వ్యుత్పన్నులు ఆత్మలో మనసుని లయం చెయ్యడమే యోగం అని అంటారు. మరికొందరు పెద్దలు ప్రాణ, అపానవాయువుల ఏకీభావమే యోగం అంటారు. మరికొందరు వృద్ధులు శబ్దాది విషయాలతో ఇంద్రియాల్ని సమావేశపరచడమే యోగం అని వచిస్తారు. విద్వాంసులు మరికొందరు యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణం, సమాధులు ఎనిమిదిన్నీ యోగానికి అంగాలని పేర్కొంటారు. నా మతంలో అభిప్రాయంలో- ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, సమాధి- అనేవి ఆరున్ను యోగానికి అంగాలు. ఆ ఆరింటిలో తొలుతటిది అయిన ఆసనం అనేది స్వస్తికాసనం, గోముఖాసనం, పద్మాసనం, వీరాసనం, సింహాసనం, భద్రాసనం, ముక్తాసనం, మయూరాసనం, సుఖాసనం- అని బహు విధాలుగా వుంటాయి.
వీటిలో ఒక ఆసనంలో మాత్రం కూర్చున్నవాడై యోగి అయినవాడు యోగం అభ్యసించాలి. అడవి ఈగల చేత, దోమలచేత, దట్టంగా ముసురుకొన్నదికాక, శిరోజాలు, విభూతి, బోగ్గులు, ఎముకలు మున్నగువాటిచేత అపవిత్రం చెయ్యబడింది కాక, జనసమ్మర్దం కలదికాక, సర్వబాధారహితమై, సకలేంద్రియాలకి సుఖావహం అయి, మనస్సుకి ప్రసన్నతని కలిగించేది అయి, పూలమాలల వాసనల చేతనున్ను, ధూపగంధాలచేత సాంద్రం అయిన ప్రదేశంలో తృప్తుడున్ను, క్షధార్తుడున్ను, మనోవ్యధల చేత వ్యాకులపాటు చెందినవాడున్ను కాక, నిమీలితాక్షుడై, దంతాలని దంతాలతో బిగించక, ఇంద్రియ సముదాయాన్ని నిగ్రహించి, ప్రాణాయామం చెయ్యడానికి ఉపక్రమించాలి.
యోగి ప్రాణానిలాన్ని కుంభక ప్రక్రియతో ఒయ్య ఒయ్యన కుక్షిగోళంలో మచ్చిక చేసి నిలుపుకోవాలి. బలాత్కారంగా నిరోధించినట్లయితే నిలుపుకొనట్లయితే- ఆ ప్రాణవాయువు రోమకూపాలనుంచి వెలువడి కుష్ఠాది వ్యాధుల్ని కలుగజేస్తుంది.

-ఇంకాఉంది

శ్రీపాద కృష్ణమూర్తి