మంచి మాట

సత్‌సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మానవుడు మనిషిగా మానవత్వం మరిచి మృగంలా మారిపోతున్నాడు. రోజూ మన కళ్ళముందు జరుగుతున్న దారుణాలు, నేరాలు, ఘోరాలు ఎన్నో. కష్టపడి పనిచేయకుండా అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు పాల్పడి ఎంతోమంది యువత తమ విలువైన జీవితాన్ని పణంగా పెడుతున్నారు. ఇదంతా ఆగాలంటే ఎలా?! మనిషికి సత్ సంకల్పం కావాలి. సంకల్పం గట్టిగా ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. మనిషి మహనీయుడు కాగలడు. అలాంటి ఉదంతాలు ఈ భారతావనిలో కోకొల్లలు.
వాల్మీకి మహర్షిగా మారాడంటే అది దైవసంకల్పం. బోయవాడైన వాల్మీకి పశుపక్షులను వేటాడిన కసాయి. కాని మహర్షుల ఆశీర్వాదంవల్ల మహారచయితగా మారి రామాయణం మనకందించి మహాత్ముడు అయ్యాడు. సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపియైన సీతాదేవికి ఆశ్రయమిచ్చి.. లవకుశులకు విద్యాబుద్ధులు నేర్పిన మహాగురువు వాల్మీకి. అది కేవలం దైవ సంకల్పమే అయినా ఆయనలో వున్న సత్‌సంకల్పమే కదా!
అలాగే తిన్నడు. అటవి జాతికి చెందిన తిన్నడు, వేటాడిన మాంసం మహాశివునికి నైవేద్యం సమర్పించి ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందాడు. స్వామి కంట రక్తం కళ్ళజూచిన తిన్నడు, తన రెండు కళ్ళను ఆ హరునకు సమర్పించిన మహాభక్తుడు. తిన్నడి సత్‌సంకల్పంవల్ల భక్తకన్నప్పగా మారి ఆ నీలకంఠునిలో ఐక్యమయ్యాడు.
భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్నది కాదు ప్రశ్న. చిత్తశుద్ధితో ఆ భగవంతున్ని ఓ నిమిషం భక్తితో ప్రార్థిస్తే.. మనలోని బాధలన్నీ పటాపంచలైపోతాయి. అంతేకాని భక్తి పేరుతో ఒళ్ళు గుల్ల చేసుకోవడం ఏ మాత్రం భావ్యం కాదు. మనకు ఉన్నంతలో ఆ దేవున్ని పూజిద్దాము. ఎవరో చేశారన్న అక్కసుతో అప్పులు చేసి తిప్పలు కొని తెచ్చుకోవడం మంచిది కాదు. ఉపవాసాల పేరిట చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇది కూడా మంచిది కాదు కానీ, శరీరం సహకరిస్తేనే చేయాలి ఏదైనా.
చేసేది దైవనామస్మరణం. కాని ఎప్పుడూ చేసేది తిట్ల పురాణ దండకం. ఇదెంతవరకు భావ్యం చెప్పండి. ఉదయం లేచింది మొదలు ఆ ప్రవచనాలు.. ధర్మసందేహాలు, జాతక సమస్యలు, వాస్తు దోషాలు, రంగురాళ్ళు, రుద్రాక్షలు, హోమాలు, ఉత్సవాలు అంటూ కూర్చుంటారు. అక్కడ పొయ్యిమీద అన్నం మాడిపోతుంది. ఇక్కడ కూర రెడీగా ఉండదు. భర్త పనికి వెళ్లాలి, పిల్లలు స్కూలుకు వెళ్లాలి. ఇదేమి అంటే, భగవంతుడా అని నిట్టూరుస్తారు. అదే ఉదయం తొందరగా లేచి విధిగా అన్నీ పనులు సక్రమంగా చేసి అందరూ వెళ్లిన తర్వాత అది కేవలం సత్ సంకల్పంతో ఆ దేవదేవుని ఆరాధిస్తే ఎంత పుణ్యం. ఈ రోజుల్లో ఇలాంటి దృశ్యాలు చాలామంది ఇళ్ళల్లో అనునిత్యం కన్పిస్తాయి. అందుకే అందర్నీ కోరేది ఒకటే. ఈ సకల చరాచర సృష్టిని నడిపించే అదృశ్య శక్తి పేరే భగవంతుడు. ఆ భగవంతుడిచ్చిన గొప్పవరం ఈ జన్మ. ఈ జన్మ సార్థకం కావాలంటే.. సత్ సంకల్పం, చిత్తశుద్ధి, మానవ సేవ, ఆరాధనం, కీర్తనం మనిషికి కావాల్సిన ఆభరణాలీసేవలు. చేయాలి.. చేసి తీరాలి.
ఇంకొంతమంది చేసే పనులు వదిలి అప్పులు చేసి తీర్థయాత్రలు చేస్తుంటారు. మరి అప్పులు చేస్తే తిప్పలు తప్పవు కదా! గాల్లో దీపం పెడితే ఆరిపోకుండా ఉంటుందా! దీపం వెలగాలంటే ప్రమిద కావాలి, వత్తి కావాలి, చమురు కావాలి. మరి ఇవన్నీ కావాలంటే మనం ఏదో ఒక పని చేయాలి. పని చేస్తే రొక్కం వస్తుంది. అందులో కొంత కుటుంబ పోషణకు, తర్వాత ఆ భగవంతుని ఆరాధనకు కేటాయించాలి. అలాగే అజ్ఞానాంధకారంలో వున్న మనకు జ్ఞానదీపం వెలగాలంటే సత్‌గురువు ఆశ్రయం తప్పనిసరి. ఆ భగవంతునికి ప్రతిరూపమే సత్‌గురువు. గురువు లేని విద్య.. ఉప్పు లేని పప్పు వంటిది. ఎంతటి మహనీయులకైనా మహాత్ములకైనా దిశానిర్దేశం చేసేది గురువు.
మహాత్ములు, మహర్షులు, మహనీయులు నడయాడిన భారతావనిలో మనం ధర్మబద్ధులై జీవించి మన కీర్తిని దశదిశలా దిగంతాల అంచులు దాటిద్దాం. సదా ఆ భగవంతుని నీడలో సేద తీరుదాం.

-కురువ శ్రీనివాసులు